వలస కూలీలందరికీ 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు
న్యూఢిల్లీ: కరోనా చెలరేగిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లలోనూ అంతర్రాష్ట్ర సరిహద్దులను తెరవవద్దని, ఎవరినీ సరిహద్దులు దాటి వారి వారి రాష్ర్టాలకు పంపించవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు సరిహద్దులను మూసివేశాయని, మిగిలిన రాష్ట్రాలు కూడా అన్ని సరిహద్దులను మూసివేసి, చెక్‌పోస్టులను పటిష్టం చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా పనులు లేక తమ సొంత రాష్ట్రాలకు చేరుకుంటున్న వలస కూలీలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వివిధ రాష్ట్రాల సీఎస్ లతో సమావేశం నిర్వహించారు. లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ, కూలీలు రాష్ట్రాలు, నగరాలు దాటకుండా సరిహద్దులను మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అవకాశం ఉన్నంత వరకు జాతీయ రహదారుల పక్కనే క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాజీవ్ గౌబా సూచించారు. అయితే ఇప్పటికే తమ సొంత ప్రాంతాలకు పయనమైన వలస కూలీలను రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని క్వారంటైన్లకు తరలించాలని ఆదేశించారు. ఈ చర్యతో కరోనా వ్యాప్తిచెందకుండా నివారించవచ్చని అన్నారు. విపత్తు నివారణ చట్టం కింద జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని ఈ నిబంధనలు అమలయ్యేలా చూడాలని కేంద్రం ఆదేశించింది.