ప్రజాపక్షం/హైదరాబాద్ : రాష్ట్రంలో తొలి కరోనా మరణం సంభవించినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల వెల్లడించారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 65కి పెరగ్గా, శనివారంనాడు 6 కేసులు నమోదయ్యాయి. కాగా, నాంపల్లికి చెందిన వ్యక్తి కరోనా లక్షణాలతో 74 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడని తెలిపారు. ప్రస్తుతం వృద్ధుడి భార్య, కుమారుడిని హోం క్వారంటైన్ లో ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో మరో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 65కు చేరిందని ఈటల తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కుత్బుల్లాపూర్ కు చెందిన వ్యక్తి ఈ నెల 14న మతపరమైన కార్యక్రమం కోసం వృద్ధుడు ఢిల్లీ వెళ్లారు. 17న నగరానికి తిరిగి వచ్చారు. మార్చి 20న వృద్ధుడికి తీవ్ర జ్వరం రావడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చింది. వృద్ధుడికి సైఫాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం రాత్రి మరణించాడు. వెంటనే సమీప కార్పొరేట్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో సైఫాబాద్ పోలీసుల సాయంతో మృతదేహాన్ని గాంధీకి తరలించారు. అక్కడి వైద్యులు వృద్ధుడి నమూనాలను పరీక్షలకు పంపినప్పుడు అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది అని ఈటల చెప్పారు. ఆస్పత్రుల్లో చనిపోయిన వారి వివరాలను ఇవ్వాలని ఆస్పత్రులను కోరామన్నారు. తెలంగాణలో కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఈటల తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 65 కేసులు నమోదైనట్టు వివరించారు. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న వారిలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఈ నలుగురూ ఎయిర్ పోర్ట్ స్క్రీనింగ్ దగ్గర పనిచేశారని వివరించారు. 65 మందిలో బాధితుల్లో పది మందికి నెగెటివ్ వచ్చిందని, వాళ్లను మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. హైదరాబాద్ లో ఎలాంటి రెడ్ జోన్లూ లేవని స్పష్టంచేశారు. కొత్తగా నమోదైన ఆరు కేసులకు ప్రయాణ చరిత్ర ఉందని వివరించారు. మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఎంతైనా ఉందని, అయితే ఇటువంటి పరిస్థితుల్లో అవన్నీ ఇంటికే పరిమితం కావాలని సూచించారు. క్వారంటైన్ లో ఉన్నవాళ్లు బయట తిరిగితే పోలీసులు జైలుకు పంపుతారని హెచ్చరించారు. ఇప్పటి వరకూ క్వారంటైన్ లో 13వేల మంది ఉన్నారని, ఆ సంఖ్య రోజు రోజుకూ తగ్గుతోందని ఈటల వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి పనికోసం వచ్చిన కార్మికుల కోసం సీఎస్ కి సీఎం ఆదేశాలు ఇచ్చారని ఈటల తెలిపారు. అలాంటి వారికి వసతి, ఆహారానికి సంబంధించిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారని ఈటల తెలిపారు.
తెలంగాణలో తొలి కరోనా మృతి : 65కి చేరిన కేసులు
RELATED ARTICLES