ఇల్లు దాటి రావొద్దు…ప్లీజ్!
దేశవ్యాప్తంగా ప్రతి వీధి, ప్రతి ఊరు, ప్రతి పట్టణం, ప్రతి నగరం లాక్‌డౌన్
అర్థరాత్రి నుంచే అమలైన ఆంక్షలు
కర్ఫ్యూను కాదంటే కఠిన చర్యలే
కరోనా వ్యాపిస్తే ఆపలేం…అర్థం చేసుకోండి
జనం కోసం జనమే జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ ః కరోనా వైరస్ ప్రభావం విజృంభిస్తుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి కర్ఫ్యూ తప్పనిసరి అని పేర్కొంటూ ఇంకా 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రకటించారు. ఇక నుంచి ప్రతి వీధి, ప్రతి ఊరు, ప్రతి పట్టణం, ప్రతి నగరం… ఇలా దేశమంతటా లాక్‌డౌన్ వుంటుందని, ఈ అర్థరాత్రి నుంచే ఇది అమలవుతుందని తెలిపారు. కర్ఫ్యూని కాదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా వ్యాప్తిని ఆపలేమని, దయచేసి ప్రజలంతా అర్థం చేసుకోవాలని, జనం కోసం జనమే జాగ్రత్తలు తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని ఉద్బోధించారు. ఈ ఆంక్షలను ఇంకోరకంగా భావించకుండా, ప్రజలు ఇళ్లకే పరిమితమై, కరోనాను ఎదుర్కొనాలని కోరారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత రెండోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారంనాడు జాతినుద్దేశించి ప్రసంగించారు. మార్చి 22న ప్రజలంతా జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. “కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. సంకట సమయంలో దేశమంతా ఒక్కటిగా నిలిచింది. కరోనా ఎలా వ్యాప్తి చెందుతుందో వార్తల్లో చూస్తున్నాం. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలి. ఒకరికి ఒకరు దూరంగా ఉంటూ ఇళ్లల్లోనే ఉండాలి. ఈ విధంగా ఉంటే తప్ప ఈ గండం నుంచి గట్టేక్కే పరిస్థితి లేదు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. కరోనా మహమ్మారి కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ అర్ధరాత్రి నుంచి మూడు వారాల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నాం. లాక్‌డౌన్‌వల్ల ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడుతుంది. కానీ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఇది తప్పనిసరి. అనివార్యం. ఇది కర్ఫ్యూ తరహా వాతావరణమనే చెప్పవచ్చు. కానీ చేసేదేమీ లేదు. ప్రతి నగరం, ప్రతి ఊరు, ప్రతి పట్టణం, ప్రతి వీధి లాక్‌డౌన్. దీన్ని ప్రతిఒక్కరూ పాటించాలి. ఏ ఒక్క పౌరుడూ గడప దాటి బయటకు రావొద్దు. జనతాకర్ఫ్యూకు మించి లాక్‌డౌన్ అమలు చేస్తాం. ఈ అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నాం. 21 రోజులపాటు ఇది కొనసాగుతుంది. ప్రజలు తూచ తప్పకుండా పాటించి, ప్రభుత్వానికి సహకరించాలి. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు రానున్న 21 రోజులు చాలా కీలకం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 21 రోజులు కావాలని నిపుణులు చెబుతున్నారన్నారు. ఈ 21 రోజులు జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత మన చేతుల్లో ఏమీ ఉండదన్నారు. కొన్నాళ్ల పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లాలనే ఆలోచన మానుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 21 రోజులు జాగ్రత్తగా ఉందాం.. దేశాన్ని కాపాడుకుందాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకే ఆలోచిస్తున్నాయి. కరోనా వైరస్ మొదటి లక్ష మందికి చేరడానికి 67 రోజులు పట్టింది. కేవలం 11 రోజుల్లోనే ఆ సంఖ్య రెండు లక్షలకు చేరింది. ఆ తర్వాత మరో నాలుగు రోజుల్లోనే 3లక్షలకు చేరింది. అమెరికా, ఇటలీలో అత్యుత్తమ వైద్య సేవలున్నా కరోనా నియంత్రణలో లేదు. దేశంలో ఏం జరిగినా ప్రజలు ఇంట్లోనే ఉండాలి. ప్రధాని నుంచి గ్రామవాసుల వరకు సామాజిక దూరం పాటించాలి. ఏం జరిగినా ఇంటి చుట్టూ ఉన్న లక్ష్మణ రేఖ దాటి బయటకు రావొద్దు. కరోనాపై పోరాటానికి మన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయమిది. ప్రతిఒక్కరూ క్రమశిక్షణ, సంయమనం పాటించాలి. ఇళ్లలోనే ఉండాలని చేతులు జోడించి వేడుకుంటున్నా. 24 గంటలూ పనిచేస్తున్న పోలీసులు, మీడియా ప్రతినిధుల క్షేమం కోసం ప్రార్థిద్దాం. ప్రయివేటు సంస్థలు కూడా ప్రభుత్వానికి తోడ్పాటునిస్తున్నాయి. ఎలాంటి పుకార్లు, వదంతులు నమ్మవద్దు. నిత్యావసరాలన్నీ ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పేదల ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజల సంయమనం, సహకారం అన్నిటికన్నా చాలా ముఖ్యం. ప్లీజ్ 21 రోజులూ సామాజిక దూరం పాటించండి” అని మోడీ ఆ ప్రసంగంలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.