లాక్డౌన్ బేఖాతర్
బయటికి రావద్దన్న ఆదేశాలను పట్టించుకోని జనం
24 గంటల్లోనే పనుల నిమిత్తం రోడ్లపైకి..
హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వ్యాధిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను పలువురు బేఖాతరు చేస్తున్నారు. ఆదివారం నాడు ఒక్కరోజు మాత్రమే జనతా కర్వ్యూలో పాల్గొన్న వీరు సోమవారం యథావిధిగా మళ్లీ రోడ్లపైకి ఎక్కారు. కరోనా కారణంగా దేశంలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందగా, దేశ వ్యాప్తంగా … పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకు 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 97 మంది అనుమానితులు ఉన్నారని, వారి ఆరోగ్య నివేదికలు రావాల్సిన ఉందని ప్రభుత్వం ప్రకటించింది. రోజురోజుకు ఈ వ్యాధి విస్తరిస్తున్న వైనాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం ప్రజల ముందు ఉంచుతూ ఈ వ్యాధి వ్యాప్తి నివారించడానికి ఈనెల 31 వరకు లాక్డౌన్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. లాక్డౌన్ తొలి రోజు ఆదివారం నాడు ఉదయం ఆరు గంటల నుండి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు ఇంటికే పరిమితం కావడమే కాకుండా సాయంత్రం ఐదు గంటలకు గంటలు మోగించి, చప్పట్లు కొట్టి వైద్య బృందానికి కృతజ్ఞతలు కూడా చెప్పారు. అంత వరకు బుద్దిగానే ఉన్న జనం సోమవారం మాత్రం లాక్‌డౌన్‌ను బేఖాతరు చేస్తూ ఉదయం నుండే ఇళ్లలోంచి బయటికి వచ్చారు. వ్యాధి తీవ్రతను వివరించి ఇండ్లకు వెళ్లాల్సిందిగా పోలీసులు గులాబీ పూలు ఇచ్చి చెప్పినా దీనిని ప్రజలు మాత్రం సీరియస్‌గా తీసుకోలేదు. సిరిసిల్ల , రంగారెడ్డి జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్ పాతబస్తీ, చార్మినార్ ప్రాంతంలోని రోడ్లన్నీ వాహనచోదకుల రద్దీతో ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి నెలకొంది. కేవలం అత్యవసర వైద్య సేవలకు, నిత్యావసర సరుకుల కొనుగోలుకు మాత్రమే మినహాయింపు ఉందని, ఎవరూ బయటికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు నచ్చజెప్పినా వారు దీనిని సీరియస్‌గా తీసుకోవడం లేదు. మంత్రి కెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలోనూ జనం రోడ్లపైకి రావడం గమనార్హం. దీంతో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని పోలీసులతో కలిసి లాక్‌డౌన్‌ను పాటించాలని, జనాలు ఇళ్లకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కరోనా విజృంభణ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 31 వరకు లాక్డౌన్ ప్రకటించిందని, దీనిని ప్రతి ఒక్కరూ పాటించాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్, డిజిపి మహేందర్‌రెడ్డిలు కూడా విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్తంగా ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే 9 మంది మృతి చెందారని, తెలంగాణ రాష్టంలోనూ 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని , వైరస్ మరింత విస్తరించకుండా ఉండాలంటే ఈ నెల31 వరకు లాక్‌డౌన్‌ను విధిగా పాటించి తీరాలని విజ్ఞప్తి చేసింది. అంతే కాకుండా కరోనా వైరస్ మరింత విస్తరించకుండా ఉండేందుకు దేశంలోని 19 రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. గడపదాటి బయటికి రావొద్దన్న ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తే క్రిమినల్ కేసులు పెట్టేందుకు వెనుకాడరాదని డిజిపి మహేందర్ రెడ్డి జిల్లా ఎస్‌పిలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.దీంతో పోలీసులు ఎక్కడిక్కడక రోడ్లపైకి వస్తున్న వారిని కట్టడి చేస్తున్నారు. వైద్యపరంగా అత్యవసరంగా వెళ్లే వారికి మాత్రమే అనుమతించారు. వెళ్తున్న వారి పూర్తి స్థాయి వివరాలు, ఫోన్ నెంబర్ లాంటిని నోట్ చేసుకుని వదిలారు.
ఇంత నిర్లక్ష్యమా?
RELATED ARTICLES