న్యూఢిల్లీ: నిర్భయ కేసులలో దోషులైన ముకేశ్ సింగ్ (32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)లను తీహార్ జైలులో ఉరి తీశారు. పలువురు జైలు అధికారులతోపాటు, జిల్లా మెజిస్ట్రేట్ సమక్షంలో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు జైలు నంబరు 3లో ఒకేసారి నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేశారు. 30 నిమిషాల పాటు వారి మృతదేహాల్ని అలాగే వేలాడదీశారు. వైద్యుడు మృతదేహాలను పరిశీలించి నలుగురూ చనిపోయినట్లు ప్రకటించిన తర్వాత దీనదయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించినట్లు జైలు డైరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ తెలిపారు. ఈ ప్రక్రియను తలారి పవన్ జల్లాద్ పూర్తి చేశారు. ఈ సమయంలో 17 మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. కాగా, అక్షయ్ మృతదేహాన్ని బీహార్‌లోని ఔరంగాబాద్ సమీపంలోని అతని గ్రామానికి తీసుకెళ్తామని జైలు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ముకేశ్ సింగ్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులు రాజస్థాన్‌కు తీసుకెళ్తారు. వినయ్ శర్మ, పవన్ గుప్తా మృతదేహాన్ని దక్షిణ ఢిల్లీలోని రవిదాస్ క్యాంప్ సమీపంలోని వారి ఇళ్లకు తరలించనున్నారని జైలు అధికారులు పేర్కొన్నారు. శవపరీక్ష నిర్వహించడానికి ముందు మృతుల కుటుంబసభ్యుల నుంచి అంగీకార పత్రాలను తీసుకొనేందుకు వారిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి, మార్చురీ సమీపంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రి సిబ్బంది, దోషుల కుటుంబ సభ్యులను తప్ప మరే వ్యక్తిని మార్చురీ సమీపంలోకి అనుమతించలేదు. 16 వేల మంది ఖైదీలు ఉన్న తీమార్ జైలు దక్షిణాసియాలోనే అతిపెద్ద కారాగారం. ఇందులో ఒకేసారి నలుగురు దోషులను ఉరి తీయడం ఇదే మొదటిసారి. అంతకుముందు గురువారం విచారణ సమయంలో నేరం జరిగినప్పుడు తాను దిల్లీలో లేనంటూ దోషి ముకేశ్ సింగ్ చేసిన వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు. చట్టపరమైన అన్ని అవకాశాలు మూసుకుపోయాయని, ఈ దశలో కొత్త వాదనలకు అవకాశం లేదని జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తాను సమర్పించిన రెండో క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఇంకో దోషి అక్షయ్ కుమార్ పెట్టుకున్న దరఖాస్తును కూడా ఇదే ధర్మాసనం తిరస్కరించింది. మరో నిందితుడు పవన్ కుమార్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను జస్టిస్ ఎన్.వి.రమణ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల ధర్మాసనం తిరస్కరించింది.
నిర్భయ హంతకులకు ఉరి
RELATED ARTICLES