భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా 15 నెలల పాటు పనిచేసిన కమల్‌నాథ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం నాటికి అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎంఎల్ఎలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి.. రాజీనామాలు చేయడంతో కమల్‌నాథ్ సర్కార్ మైనార్టీలో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సరిపడా బలం లేకపోవడంతో శుక్రవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మధ్యాహ్నం కమల్‌నాథ్ రాజీనామా లేఖను రాజ్భవ్నలో గవర్నర్ లాల్జీ టాండన్‌కు సమర్పించారు. ఈ మేరకు రాజ్‌భవన్ అధికారులు ధ్రువీకరించారు. నా 40 ఏళ్ల సుదీర్ఘ ప్రజాజీవితంలో ఎల్లప్పుడూ స్వచ్ఛమైన రాజకీయాలే చేశాను. ప్రజాస్వామ్య ప్రమాణాలకు విలువనివ్వడంతో పాటు ప్రాధాన్యతనూ ఇచ్చాను. కానీ గడిచిన రెండు వారాల్లో సంభవించిన పరిణామాలు ప్రజాస్వామ్య విలువలు పతనమవుతూ ఒక కొత్త అధ్యాయంగా నిలిచిపోయింది’ అని కమల్‌నాథ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా రాబోయే కొత్త ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షించారు. కాగా, రాజనామా చేయడానికి ముందు కమల్‌నాథ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విలేకరుల సమావేశంలోనే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ప్రభుత్వంపై బిజెపి కుట్రపన్నిందని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను ముట్టుబెట్టిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్ మాజీ నేత జ్యోతిరాదిత్య సింధియానే అని అన్నారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ రాజీనామా
RELATED ARTICLES