ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి ఉంది
గ్రామాల పారిశుద్ధ్యానికి కలెక్టర్లు, ఎస్పిలతో కమిటీ
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతీ ఒక్కరు స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ చేస్తున్నాం
రాష్ట్ర సరిహద్దులలో 18 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాం
ఉన్నతస్థాయి సమావేశం అనంతరం మీడియాతో సిఎం
ప్రజాపక్షం/హైదరాబాద్ : కరోనా వైరస్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి ఉందని, అయినప్పటికీ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతీ ఒక్కరు స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలకు ప్రజలను అనుమతించవద్దన్నారు. ఎక్కువ మంది గుమికూడకుండా ఉండటమే కరోనా కట్టడికి ముఖ్యసూత్రమని, జగ్నేకి రాత్ను కూడా రద్దు చేసుకునేందుకు ముస్లింలు అంగీకరించారని, ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఇప్పటికే రద్దు చేశామని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యలే శ్రీరామరక్ష అని, ముందు జాగ్రత్త పాటించి మనల్ని మనం కాపాడు కుందామని, ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఆరోగ్యంగా ఉంచుదామని సిఎం విజ్ఞప్తి చేశారు. ప్రగతిభవన్‌లో గురువారం కరోనాపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. అనంతరం సిఎం మీడియాతో మాట్లాడుతూ కరోన వైరస్ సంబంధించి బుధవారం కరీంనగర్లో జరిగిన ఉదంతం నేపథ్యంలో అన్ని జిల్లాల పోలీస్, కలెక్టర్లకు కరోనాపై తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలను జారీ చేసినట్లు చెప్పారు. గ్రామాల పారిశుద్ధ్యానికి కలెక్టర్లు, ఎస్పిలలతో కలిసి ఒక కమిటీని వేశాం. విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా వారిపై నియంత్రణ ఉంటుంది. మార్చ్ ఒకటవ తేదీ నుండి ఇతర దేశాల నుండి వచ్చిన వారు స్వచ్ఛంధంగా సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయాలని, లేనట్లయితే పోలీస్ శాఖ వారిని గుర్తిస్తుందన్నారు. ఇప్పటికే విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి ‘హోమ్ క్వారైటైన్’ చేస్తున్నామన్నారు. ఒకవేళ ఎవరైనా ఇండ్లలో హోమ్ క్వారయింటైన్ వెళ్తాము అంటే పంపిస్తామని, అంతేకాకుండా వారిపై ఎల్లప్పుడూ నిఘా ఉంటుందన్నారు. విదేశాల నుండి ఎవరు వచ్చిసా హోమ్ క్వారయింటైన్లో ఉంచేలా వైద్య, ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మొత్తం 84 రైళ్లు రాష్ట్రం నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. సరిహద్దు రాష్ట్రాల్లో 18 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తామన్నారు. గ్రామ పారిశుద్ధ్యం, పట్టణ పారిశుద్ధ్యం పాటించి మనల్ని మనం కాపాడుకుందాం. షాదీఖానాలు, ఫంక్షన్‌హాల్స్ అన్ని గురువారం నుంచి నుంచి మూసివేస్తున్నామని ప్రకటించారు. అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేయాలని సిఎం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌లోని సిసిఎంబిలో ఉన్న పరీక్షా కేంద్రాలను ఉపయోగించుకునేందుకు అనుమతించాలని కోరారు.