న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు ధరలు దిగివచ్చినప్పటికీ, ప్రస్తుతమున్న రేట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం రూపంలో వాతపెట్టింది. మహమ్మారి కరోనా వైరస్ అంతర్జాతీయ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించుకుంది. లీటరుకు మూడు రూపాయల చొప్పున సుంకాన్ని పెంచింది. అదే విధంగా పెట్రోల్‌పై ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని రూ. 2 నుంచి 8 రూపాయలకు, డీజిల్‌పై రూ.4కు పెంచుతున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఇక రోడ్ సెస్‌ను కూడా పెంచినట్లు వెల్లడించింది. పెట్రోల్, డీజిల్‌పై వరుసగా లీటరుకు రూ.1, రూ. 10 పెంచింది. నిజానికి అంర్జాతీయ చమురు ధరలు తగ్గడం వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాల్సి వుంది. అయితే ప్రభుత్వ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదే అదనుగా మోడీ ప్రభుత్వం చమురుపై ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. దీని వల్ల తగ్గాల్సిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోగా, ప్రస్తుత ధరలు తగ్గడం లేదా స్వల్పంగా ధరలు పెరగడం జరుగుతుంది. కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో రూ. 2000 కోట్ల మేర అదనపు ఆదాయం రావొచ్చునని భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక మందగమనంతో కొట్టుమిట్టాడుతున్నందున కరోనా వైరస్ ప్రభావంతో పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉన్న క్రమంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంచిన నేపథ్యంలో ఇంధన ధరలు నామమాత్రంగా పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.