టోర్నీలు, ఈవెంట్లు అన్నీ రద్దు
ఐపిఎల్పైనా నీలినీడలు
న్యూ ఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్ 19) ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దాని ప్రభావం ఒక్కో రంగంపై తీవ్ర ప్రభావం చూపుతూ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వర్తకం, వాణిజ్యం, ఔషధ, పర్యాటక రంగాలను దాటి క్రీడా రంగంపై పడింది. కరోనా కారణంగా ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు వాయిదా పడగా.. మరికొన్ని అదే బాట పడుతున్నాయి. కరోనా సెగ ఇప్పుడు బీసీసీఐని కూడా తాకింది. కరోనా వైరస్ దేశంలో వేగంగా వ్యాప్తిచెందడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్-19ను మహమ్మారిగా ప్రకటించడంతో జనాలు గుమిగూడకుండా ఉండేందుకు ఐపీఎల్‌ను ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. భారత్, దక్షిణాఫ్రికా ద్వైపాక్షిక వన్డే సిరీస్‌నూ రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దేశవాళీ టోర్నీలు అన్నింటినీ బీసీసీఐ తాత్కాలికంగా రద్దు చేసింది. ఈనెల 18వన ఆరంభం కావాల్సిన ఇరానీ కప్‌తో సహా సీనియర్ వుమెన్స్ వన్డే నాకౌట్ టోర్నీ, విజ్జీ ట్రోఫీ, సీనియర్ వుమెన్స్ వన్డే చాలెంజర్, వుమెన్స్ అండర్-19 వన్డే నాకౌట్, వుమెన్స్ అండర్-19 టీ20 లీగ్ అన్ని టోర్నీలను వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ దేశవాళీ టోర్నీల వాయిదా కొనసాగనుంది. ఈ మేరకు బీసీసీఐ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ 2020, దేశవాళీ టోర్నీలతో పాటు టీమిండియా ఆడాల్సిన పలు టోర్నీలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుత పరిస్థితి నుంచి ఉపశమనం లభించిన తర్వాతే టోర్నీల నిర్వహణపై ముందుడుగు వేయాలనేది బిసిసిఐ యోచిస్తోంది. అంతేకాదు బాడ్మింటన్ టోర్నీలు కూడా రద్దు చేశారు.
భారత్‌లో ఆటలు బంద్!
RELATED ARTICLES