ప్రజాపక్షం/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిసి ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 235 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టిసి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని వారు ప్రశంసలు కురిపిస్తున్నారు. పలు డిపోలు, బస్ స్టేషన్లలో వద్ద ఉద్యోగులు కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎంజిబిఎస్‌లో ఆర్టిసి సూపర్వైజర్స్ అసోసియేషన్ అధికారులు, ఉద్యోగుల కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచిపెట్టారు.
ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సిఎం : మంత్రి పువ్వాడ
ఆర్టిసి ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన జీతాల చెల్లింపుల కోసం రూ.235 కోట్లు విడుదల చేసి ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిలబెట్టుకున్నారని, ఆయన పెద్ద మనసుకు ఇది నిదర్శనమని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఒకే దఫాలో నిధులను విడుదల చేయడం చెప్పుకోదగ్గ విషయమన్నారు. మార్చి 31వ తేదీ లోగా సమ్మె కాలం జీతభత్యాలు ఉద్యోగులకు చెల్లించనున్నట్లు చెప్పారు. ఆర్టిసి ఆర్థిక స్థితిని గాడిలో పెట్టడంతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనే విషయం మరోమారు రుజువైందన్నారు. సి.ఎం ఆకాంక్షల మేరకు ఆర్టిసి అభ్యున్నతికై నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టి మంచి ఫలితాలు తీసుకురావడానికి శాయాశక్తుల కృషి చేస్తున్నామన్నారు. ఉద్యోగుల బాగోగుల కోసం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టినట్లు, సంస్థ ఆర్థిక స్థితిని మరింత మెరుగు పర్చడానికి సమష్టిగా ప్రయత్నిస్తున్నామన్నారు. గతంలో చెప్పినట్లుగానే ఆర్టిసికి ప్రభుత్వం బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించిందన్నారు. ముఖ్యమంత్రి ఆశించిన విధంగా సంస్థ పురోభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పని చేసి ఆశించిన ఫలితాలు తీసుకురావాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
ఆర్టిసి ఉద్యోగులకుఊరట
RELATED ARTICLES