మెల్బోర్న్: అలిసా హీలీ.. ప్రస్తుతం యావత్ క్రికెట్ ప్రపంచం మారుమోగుతున్న పేరు. తన అద్వితీయమైన బ్యాటింగ్‌తో భారత అమ్మాయిల కలను కల్లోలం చేసిన క్రికెటర్. ఆస్ట్రేలియాకు అద్భుతమైన విజయాన్నందించిన డాషింగ్ ఓపెనర్. 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో వీరవిహారం చేసిన ఈ అమ్మాయి.. ఆస్ట్రేలియా మెన్స్ టీమ్ పేసర్ మిచెల్ స్టార్క్ సతీమణి. ఆమె ఆటకోసం, ఈ అద్భుత క్షణాన్ని ఆస్వాదించడానికి అంతర్జాతీయ మ్యాచ్‌నే కాదనుకొని 10వేల కిలోమీటర్లు స్టార్క్ ప్రయాణించగా.. అతన్నేమాత్రం నిరాశపర్చకుండా అతని రాకకు ఓ అర్థం ఉండేలా ఆడింది అలిసా. మైదానంలో సతీమణి విధ్వంసకర బ్యాటింగ్‌ను స్టార్క్ తెగ ఆస్వాదించాడు. చేతిలో బీరు సీసాతో అలీసా సూపర్ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేశాడు. భర్తగా తన భార్య ఆటను చూసి ఉప్పొంగిపోయాడు. సిక్స్ కొట్టినప్పుడల్లా చీర్చ్ చెబుతూ.. తమ జట్టుకు మద్దతిచ్చాడు. సతీమణి ఆట.. భర్త సంబరాలను చూడటం కూడా ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇక సౌతాఫ్రికాతో శనివారం జరిగిన చివరి వన్డేను కాదనుకొని స్టార్క్ ఆస్ట్రేలియాకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక అతని విన్నపాన్ని అంగీకరించిన క్రికెట్ ఆస్ట్రేలియా కూడా.. సతీమణి అలీసాకు అండగా ఉండాలని.. మ్యాచ్ ఆడుకున్నా పర్లేదని పంపించింది.
విశ్వవిజేతలే..
అయితే అలిసా నేటిఫైనల్లో విన్నరయితే.. స్టార్క్ 2015 వన్డే ప్రపంచకప్‌లో స్టార్ పెర్ఫామర్.. ఈ భార్యభర్తలిద్దరూ తమ జట్టు విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించారు. కాకపోతే అలిసా బ్యాట్‌తో మెరిస్తే..స్టార్క్ బంతితో రాణించాడు. సొంతగడ్డపైనే న్యూజిలాండ్‌తో జరిగిన ఆ ప్రపంచకప్ ఫైనల్లో స్టార్క్.. తొలి ఓవర్లోనే అద్భుత యార్కర్‌తో బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను పెవిలియన్‌కు చేర్చి ఆసీస్‌కు శుభారంభాన్నందించాడు. అనంతరం లూక్ రోంచిని ఔట్ చేయగా.. ఆ మ్యాచ్‌లో కివీస్ 183 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఆసీస్.. 34 ఓవర్లలోనే మూడు వికెట్లే కోల్పోయి చేధించింది. ఫలితంగా 7 వికెట్లతో గెలుపొంది ఐదోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఇక తాజా మ్యాచ్‌లో అలిసా అద్భుతమైన బ్యాటింగ్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.
ప్రశంసల జల్లు..
అద్బుతమైన ఆటతో భారత్ పతనాన్ని శాసించిన అలిసాపై మాజీ క్రికెటర్లు, వ్యాఖ్యతలు, అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వచ్చే ప్రపంచకప్ వరకు మహిళల బౌండరీల హద్దులు కూడా మారాలని అలిసా చెప్పకనే చెప్పిందని ప్రముఖ వ్యాఖ్యాత హర్షబోగ్లే ట్వీట్ చేశాడు. ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్లో అది పురుషులైనా.. మహిళలైనా.. ఈ తరహా బ్యాటింగ్ ఇప్పటి వరకు చూడలేదని, అలీస్ అద్భుతంగా ఆడిందని ఆకాష్ చోప్రా ట్వీట్ చేశాడు.
భార్యాభర్తలిద్దరూ మ్యాచ్ విన్నర్లే
RELATED ARTICLES