ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో; తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విత్తన చట్టానికి సంబంధించి పలుమార్పులు చేశారు. కల్తీ విత్తనాలని తేలితే పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేసి వ్యాపారులను జైళ్లకు పంపడంతో పాటు దుకాణాలను శాశ్వతంగా మూస్తున్నారు. ప్రైవేటు విత్తన వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ పట్ల ఎందుకు ఉదాసీన వైఖరి వహిస్తుందో అర్థం కాని స్థితి. ఈ ఏడాది యాసంగికి సంబంధించి సీడ్స్ కార్పొరేషన్ విక్రయించిన వరి విత్తనాల్లో కల్తీలు ఉన్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. నాటిన 20రోజులకే వరి ఈనడం ప్రారంభించగా అధికార యంత్రాంగం అసలు సంగతి మరిచి వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అదృష్టవశాత్తు వర్షాకాలం చివరిలో భారీ వర్షాలు కురవడం దీనికి తోడు ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో యాసంగి వరిసాగు బాగా పెరిగింది. ప్రధాన ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు, విద్యుత్తు మోటార్ల కింద యాసంగి వరి సాగు చేశారు. రైతులు వివిధ కారణాలతో విత్తన కల్తీలు జరగడం తీవ్రంగా నష్టపోతున్నామన్న భావనతో విత్తన కొనుగోళ్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ప్రైవేటు విత్తన కంపెనీలను కాదని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అందించిన 1010 రకం వరి విత్తనాలను సాగు చేశారు. ఈ వరి నారు పోసి తిరగనాటిన 20 రోజులకే ఇనడం ప్రారంభించింది. చిన్న చిన్న కంకులు వేస్తూ రైతులను కలవరానికి గురి చేసింది. ఒకరో ఇద్దరో లేదా కొద్ది శాతం మంది వరినారును ఆలస్యంగా నాటిన సందర్భాల్లో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం పరిపాటే. కానీ ఎక్కువ శాతంలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా విత్తన కంపెనీలను తప్పుపట్టక తప్పదు. సహకార సంఘాలు, వ్యవసాయ కార్యాలయాల నుంచి ఈ ఏడాది ఎక్కువగా రైతాంగం వరి విత్తనాలను కొనుగోలు చేశారు. విత్తన కంపెనీలు మోసం చేస్తున్నాయనుకుంటే తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వద్ద కొనుగోలు చేసిన విత్తనాలు కూడా రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అధికార యంత్రాంగం మాత్రం వరినారు ఆలస్యంగా నాటడం వల్ల మాత్రమే ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయని కొన్ని సందర్భాల్లో వాతావరణ మార్పులు కారణంగా నాటిన 20 రోజులకే అంకురం రూపొందుతుందని చెబుతున్నారు.
నాటిన 20 రోజులకే వరికి వెన్ను
RELATED ARTICLES