చేతులెత్తేసిన టాప్ బ్యాట్స్మెన్లు
క్రీజులో రహానె, విహారీ
ప్రస్తుతం 144/4
పట్టు బిగించిన కివీస్
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో అరంగేట్ర బౌలర్ జేమీసన్‌కు దాసోహమైన టీమిండియా టాపార్డర్ రెండో ఇన్నింగ్స్‌లో ట్రెంట్ బౌల్ట్ దెబ్బకు కుదేలైంది. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 65 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. క్రీజులో వైస్ కెప్టెన్ అజింక్యా రహానే(25 బ్యాటింగ్), హనుమ విహారి(11 బ్యాటింగ్) ఉన్నారు. భారత్ ఇంకా 39 పరుగుల వెనుకంజలో ఉంది. మయాంక్ అగర్వాల్ (58) మినహా.. పృథ్వీషా(14), పుజారా(11), కోహ్లి(19) దారుణంగా విఫలమయ్యారు. ప్రత్యర్థి బౌలర్లలో ట్రెంట్ బోల్ట్ (3/27) కోహ్లీ సేన పతనాన్నిశాసించగా.. టీమ్ సౌతీ ఒక వికెట్ తీశాడు. ఇక అంతకముందు ఓవర్‌నైట్ స్కోర్ 216/5తో మూడో రోజు ఆటను ప్రారంభించిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 100.2 ఓవర్లలో 348 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో విలియమ్సన్(89), రాస్ టేలర్, కైలీ జేమీసన్(44) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ(5/65) ఐదు వికెట్లతో రాణించగా.. రవిచంద్రన్ అశ్విన్ (3/99) మూడు వికెట్లు, బుమ్రా(1/88), మహ్మద్ షమీ (1/91) చెరొక వికెట్ తీశారు.
మరోసారి షా, పుజారా..
ఇక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది యువ ఓపెనర్ పృథ్వీ షా(14) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. దీంతో 27 పరుగులకే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా(11)తో మయాంక్ ఆచితూచి ఆడాడు. మంచి బంతులను గౌరవిస్తూ చెడ్డ బంతులను బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో 75 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని విడదీసి బౌల్ట్ మరోసారి దెబ్బతీశాడు. పుజారాను క్లీన్ బౌల్ చేసి పెవిలియన్ చేర్చాడు. దీంతో రెండో వికెట్ నమోదైన 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఫలితంగా 78/2 స్కోర్‌తో కోహ్లీసేన టీ విరామానికి వెళ్లింది.
కోహ్లీ మరీ ఘోరంగా..
విరామం అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ పైనే టీమిండియా భారం పడింది. అతను మూడు బౌండరీలతో చాలా కాన్ఫిడెంట్‌గానే కనిపించాడు. మరోవైపు మయాంక్ కూడా నిలకడగానే ఆడాడు. కానీ సౌతీ అద్భుత బంతితో కీపర్ క్యాచ్‌గా మయాంక్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే కోహ్లీ కూడా ఔటవ్వడంతో భారత్ 113 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 46వ ఓవర్లో బౌల్ట్ వేసిన షార్ట్ పిచ్ బంతిని వెంటాడి మరి కోహ్లీ వికెట్ చేజార్చుకున్నాడు. కీలక స్థితిలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన కోహ్లీపై అటు అభిమానులు.. ఇటు విశ్లేషకులు మండిపడుతున్నారు. 35 పరుగుల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌ను వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, తెలుగు కుర్రాడు హనుమ విహారీ గట్టెక్కించే ప్రయత్నం చేశారు. నిదానంగా ఆచితూచి ఆడుతూ.. మరో వికెట్ పడకుండా మూడో రోజు ఆటను ముగించారు.
ఇషాంత్ అరుదైన రికార్డు..
భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ మెరుగైన ప్రదర్శన చేశాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఇషాంత్ శర్మ జోరు కొనసాగుతోంది. ఇషాంత్ ఐదు వికెట్లతో విజృంభించడంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఇషాంత్‌కిది 11వ సారి కావడం విశేషం. టెస్టుల్లో ఎక్కువ సార్లు ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్‌తో ఇషాంత్ సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. కివీస్‌తో తొలి టెస్టు మూడో రోజు ఆటలో శర్మ ఈ మైలురాయి అందుకున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇషాంత్‌కిది మూడోసారి. కాగా.. ఓవరాల్‌గా విదేశాల్లో తొమ్మిదోది కావడం విశేషం. ఇప్పటి వరకు టెస్టు కెరీర్లో 97 మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్ 174 ఇన్నింగ్స్‌ల్లో 297 వికెట్లు పడగొట్టాడు.
టీమిండియా ఎదురీత
RELATED ARTICLES