సిఎఎ, ఎన్‌ఆర్‌సి ప్రమాదకరం
ఐఎఎల్ జాతీయ మహాసభలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అఫ్తాబ్ ఆలమ్
విజయవాడ : పౌరస్వేచ్ఛను పరిరక్షించడంలో న్యాయవ్యవస్థపై గురుతర బాధ్యత ఉందని సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అఫ్తాబ్ ఆలమ్ సూచించారు. దేశ పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు విఘాతం కలుగకుండా చూడాల్సిన అవసరం కోర్టులు, న్యాయవాదులపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభు త్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ పౌర నమోదు (ఎన్‌ఆర్‌సి) అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక దేశంలో తాను పౌరుడని నిరూపించుకోవడం దౌర్భాగ్యమన్నారు. మూడు రోజులపాటు జరిగే భారత న్యాయవాదుల సంఘం (ఐఎఎల్) పదో జాతీయ మహాసభలు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అఫ్తాబ్ ఆలమ్ జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులకు కోర్టులు రక్షణ కవచంగా ఉండాలని చెప్పారు. ఒకవేళ ఆ విషయంలో కోర్టులు వైఫల్యం చెందితే న్యాయవాదులైనా వాటి పరిరక్షణకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పతనమవుతున్న ప్రజాస్వామ్య పరిరక్షణలో న్యాయస్థానాలు, న్యాయవాదుల ఎదుట అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. కేంద్రం తెచ్చిన సిఎఎ వల్ల దేశం ముక్కలయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆవేదనను వెలిబుచ్చారు. ఎన్‌ఆర్‌సి రూపకల్పనలోనే లోపాలు చోటు చేసుకున్నాయని, అందుకే సామాన్య ప్రజలు అభద్రతాభావానికి గురవుతున్నట్లు చెప్పారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ వల్ల పౌరసత్వం కోల్పోతామనే భయాందోళన ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల వినతులను స్వీకరించి, న్యాయం చేసేందుకు కోర్టులు ముందుకు రావాలన్నారు. ప్రమాదకర చట్టాల విషయంలో సుప్రీం కోర్టు బాధ్యతాయుతంగా వ్యవహరించి కేంద్ర ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేయాలని ఆయన కోరారు. ఎన్‌ఆర్‌సీ వల్ల అసోంలో లక్షలాది మంది పౌరుల పేర్లు జాబితాలో లేవన్నారు. దేశం నుంచి ముస్లింలను వెళ్లగొట్టే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం సీఏఏ చట్టాన్ని తెచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రజాసామ్య మనుగడపై ప్రజలలో చర్చ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పని తీరును విమర్శించినా, ప్రశ్నించినా, వారిపై దేశ ద్రోహులనే ముద్ర వేసి జైళ్లలో పెడుతున్నారని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో కేంద్ర, రాష్ట్రాల పాలనలో ఇటీవల అనేక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. పాలనలో భాగంగా పోలీసు తదితర వ్యవస్థలలో చట్టం అమలుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిరక్షణకు న్యాయవాదులు అంకితభావంతో పని చేయాలన్నారు. ప్రజాస్వామ్యానికి న్యాయస్థానాలే పట్టుగొమ్మలని, అక్కడ ప్రజలు, న్యాయవాదులు, ప్రభుత్వానికి మధ్య అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సడలకుండా చూడాల్సిన బాధ్యత న్యాయవాదులదేనని ఆలమ్ స్పష్టం చేశారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్రాల పాలన ఆశించినస్థాయిలో లేదనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారన్నారు ఈ నేపథ్యంలో న్యాయస్థానాలు, న్యాయవాదులు వారికి రక్షణ కల్పించాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. న్యాయవ్యవస్థలో ఇతరుల జోక్యం ఉండకూడదని పేర్కొన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణతోపాటు దోపిడీకి గురవుతున్న వారికి సత్వర న్యాయం అందించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన న్యాయ వ్యవస్థకు పేరు తెచ్చిన సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ గురించి వివరించారు. దేశంలో రైతులు, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలకు (పిల్) ఆయన చాంపియన్‌గా వ్యవహరించారని చెప్పారు. అనంతరం భారత న్యాయవాదుల సంఘం (ఐఏఎల్) నిర్వహణలో సమర్థంగా పని చేసిన జస్టిస్‌లు పి.ఎన్.భగవతి, డి.ఎ.దేశాయ్, ఒ.చిన్నప్పరెడ్డితోపాటు సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డి సేవల గురించి వివరించారు. అలాంటి వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని నేటితరం న్యాయవాదులు పని చేయాలని కోరారు.
దేశంలో బిలీనియర్ పాలన : నీలోఫర్ భగవత్
దేశంలో బ్రిటిష్ పాలన పోయిందనుకుంటే నేడు బిలీనియర్ పాలన సాగుతోందని ఐఏఎల్ ఉపాధ్యక్షురాలు నీలోఫర్ భగవత్ వ్యాఖ్యానించారు. మహాసభలలో ఆమె మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కార్పొరేట్‌ల నుంచి విరాళాలు సేకరించడం వల్లే దేశంలో నేడు బ్రిటిష్ పాలనకు బదులు బిలీనియర్ పాలన సాగుతోందన్నారు. ప్రపంచంలో 90 శాతం దేశాలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌లను (ఈవీఎం) నిషేధించినట్లు చెప్పారు. భారత్‌సహా కేవలం 18 దేశాలలో ఈవీఎం విధానంలో ఓటింగ్ జరుగుతోందని తెలిపారు. కంప్యూటర్ వ్యవస్థ అభివృద్ధి చెందిన తరుణంలో హ్యాకింగ్‌కు ఆస్కారముందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో లక్షలాది మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎలక్ట్రోల్ బాండ్ల విధానంలో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వొచ్చని నిర్ణయించడంతో 95 శాతం విరాళాలు అధికార పార్టీకే రావడం గమనార్హమన్నారు. గత ఎన్నికలకు రూ.45 వేల కోట్ల ఖర్చయిందని, ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలన్నారు. ఐఏఎల్ జాతీయ కార్యదర్శి చలసాని అజయ్‌కుమార్ మాట్లాడుతూ, మూడు రోజులపాటు జరిగే జాతీయ పదో మహాసభలకు అన్ని రాష్ట్రాల నుంచి 700 మంది ప్రతినిధులు హాజరయ్యారన్నారు. ఐఏఎల్ జాతీయ అధ్యక్షుడు రాజిందర్ సింగ్ చీమా అధ్యక్షతన జరిగిన సభలో ఐఏఎల్ పూర్వ అధ్యక్షుడు జితేందర్ శర్మ, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు గంటా రామారావు, బెన్నెట్ లా యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, ఐఏఎల్ ఏపీ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి మురళీధర్, కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, ఉపాధ్యక్షులు వైఎస్ లోహిత్, కేవీ పరమేశ్వరరావు, వీడీ సిద్ధార్థ లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చెన్నుపాటి దివాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
పౌరుల హక్కులు కాపాడే బాధ్యత లాయర్లది
RELATED ARTICLES