ఆరేళ్ల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం
జనవరిలో 7.59 శాతానికి పెరుగుదల
అత్యధికంగా పెరిగిన ఆహార పదార్థాల ధరలే కారణం
న్యూఢిల్లీ: ఒకవైపు ఆర్థికమందగమనంపై భయాలు, ద్రవ్యోల్బణంపై తీవ్ర ఆందోళన కొనసాగుతుండగానే జనవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలకు మించి ఆరేళ్ల గరిష్టానికి చేరింది. వినియోగదారుల ధరల సూచిక (సిపిఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి నెలలో 7.59 శాతానికి పెరిగింది. డిసెంబర్ నెలలో 7.35శాతంగా ఉంది. సిపిఐ డేటా గణాంకాలను నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఒ) బుధవారం వెల్లడించింది. 2019 జనవరిలో ద్రవ్యోల్బణ రేటు 2.05 శాతం గా ఉంది. ఎన్ఎస్ఒ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆహార ద్రవ్యోల్బ ణం 2019 డిసెంబర్లో 14.19 శాతం నుండి 13.63 శాతానికి తగ్గింది. ఆహార ద్రవ్యోల్బణ రేటు 2019 జనవరిలో (- 2.24 శాతంగా ఉంది. ఈ నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 50.19 శాతానికి పెరిగింది, 2019 డిసెంబర్లో 60.50 శాతంగా ఉంది. అదేవిధంగా, తృణధాన్యాలు, ఉత్పత్తుల ధరలు 5.25 శాతం వేగం తో పెరిగాయి. పప్పుధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ధరలు ఈ నెలలో 16.71 శాతం పెరిగాయి. ముఖ్యంగా మార్చి 2019 నుంచి క్రమంగా పెరుగుతూ నింగిని తాకిన ఉల్లిపాయల ధరలు ద్రవ్యోల్బణం పెరగడానికి దోహదం చేసింది. దీనికి తోడు కూరగాయలు, పప్పుధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార ఉత్పత్తుల ధరల మంట దీనికి కారణంగా భావిస్తున్నారు. ఆహార, పానీయాల కేటగిరిలో ద్రవ్యోల్బణం 11.79 శాతం పెరిగిందని డేటా పేర్కొం ది. 2020 జనవరిలో హౌసింగ్ 4.20 శాతం మేరకు ప్రియం అయింది. ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం 3.66 శాతంగా ఉంది. కాగా ఫిబ్రవరి నాటి పరపతి విధాన సమీక్షలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. ద్రవ్యోల్బణం చాలా అనిశ్చితంగా ఉన్నందున రెపో రేటును 5.15 శాతంగానే ఉంచినట్టు ఆర్బిఐ వెల్లడించింది. అలాగే దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 4 శాతానికి (2 శాతం మార్జిన్‌తో) అటూ ఇటూగా ఉండాలే చూడాలని కేంద్రాన్ని ఆర్బిఐ ఆదేశించింది. మరోవైపు మందగమన పరిస్థితులకు అద్దం పడుతూ దేశంలోని పారిశ్రామిక ప్రగతి మరింత ఆందోళనకర స్థాయికి పడిపోయింది. ఇప్పటికే నెగటీవ్ జోన్లోకి చేరిన పారిశ్రామికోత్పత్తి డిసెంబరులో 0.3 శాతానికి పతనమైంది. ఉత్పాదక రంగం క్షీణించి, ఏడాది క్రితం ఇదే నెలలో 2.5 శాతం వృద్ధిని సాధించింది. ‘ఆర్బిఐ నిర్ధేశించిన గరిష్ఠ పరిమితిని సిపిఐ వరుసగా రెండో నెల కూడా ఛేదించింది. ఒకవేళ ద్రవ్యోల్బణం 6 శాతంకు మించి ఉంటే ఆర్బిఐ వడ్డీ రేట్లను తగ్గించడం లేదా అకామడేటివ్ పాలసీ వైఖరిలో మార్పు తెస్తుందని మనం ఆశించలేం’ అని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిసెర్స్(కరెన్సీ) అధిపతి రాహుల్ గుప్తా చెప్పారు.
ద్రవ్యోల్బణం పైపైకి!
RELATED ARTICLES