టిఆర్ఎస్ సమాయత్తం
అభివృద్ధి పనులు వేగవంతం
డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రత్యేక దృష్టి
వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనున్న పాలకమండలి గడువు
ప్రజాపక్షం/హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు అధికార పార్టీ టిఆర్ఎస్ యోచిస్తోంది. తాజా రాజకీయ పరిణామాలు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్కు అనుకూల వాతావరణం నెలకొన్నదని, ఈ ఊపును ఇలాగే కొనసాగించాలని టిఆర్ఎస్ భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పాలక మండలి గడువు వచ్చే ఏడాది (2021) ఫిబ్రవరితో ముగియనుంది. చివరి గడువు వరకు ఆగకుండా అంతకుముందే ఎన్నికలను నిర్వహించాలని టిఆర్ఎస్ ఒక అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. అందులో భాగంగానే హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న పలు అభివృద్ధి పనుల వేగాన్ని పెంచాలని, అలాగే డబుల్‌బెడ్ రూమ్‌లను దశలవారీగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు తెలిసింది. అయితే జిహెచ్ఎంసి చట్టం ప్రకారం ఆరు నెలల ముందే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతన్నాయి. ఈ అవకాశాన్ని టిఆర్ఎస్ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. అందుకే ఇప్పటి నుంచే గ్రేటర్ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. ప్రస్తుతం టిఆర్ఎస్కు 99 కార్పోరేటర్లు ఉండగా, టిడిపి నుంచి గెలిచిన ఒక కార్పొరేటర్ టిఆర్ఎస్లో చేరడంతో కార్పొరేటర్ల సంఖ్య వందకు చేరింది. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో ‘110’ సీట్లు గెలుపొందాలని టిఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయని, మరో వైపు వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ భారీ విజయం సాధిస్తుందని, గ్రేటర్ ఎన్నికలకు ఇదే మంచి తరుణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా కొందరు ఎంఎల్ఎలు కూడా గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్నట్టు తెలిసింది. తమ వారిని బరిలో దింపేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అలాగే సిట్టింగ్ కార్పొరేటర్లు కూడా మరోసారి ఛాన్స్ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
గత మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయానికి ‘డబుల్ బెడ్రూమ్’ కార్యక్రమమే కారణమని గుర్తించిన అధికార పార్టీ ప్రస్తుతం ‘డబుల్ బెడ్రూమ్’ ఇళ్ల నిర్మాణాలపై నజర్ పెట్టింది. గ్రేటర్ పరిధిలో లక్ష గృహాలను నిర్మిస్తామని పలు సందర్భాల్లో మంత్రి కెటిఆర్ హామీనిచ్చిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాల వేగాన్ని పెంచారు. డబుల్‌బెడ్ రూమ్ నిర్మాణాల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే రూ.1800 కోట్ల బిల్లులను విడుదల చేసింది. మరో రూ. 900 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే డబుల్ బెడ్ రూమ్‌లను పూర్తి చేయాల్సి ఉంటుందని గుర్తించిన అధికార టిఆర్ఎస్ ఆ దిశగా చర్యలు మొదలు పెట్టింది. నిర్మాణ పనుల వేగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. జూన్ వరకు కనీసం 65 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. రానున్న ఎన్నికల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కీలకం కానున్న నేపథ్యంలో కనీసం 65 నుంచి 75 వేల వరకు గృహాలను ప్రారంభించాలని టిఆర్ఎస్ భావిస్తుంది. అలాగే దుర్గం చెరువుపై కేబుల్ స్టే బ్రిడ్జీ నిర్మాణ పనులు దాదాపు పూర్తికాగా, దీనిని వచ్చే నెలలో ప్రారంభోత్సవం చేసే అవకాశాలు ఉన్నాయి. ఎల్.బి నగర్, బాలానగర్, బయోడైవర్సిటీ, నాగోల్ ఫ్లుఒవర్ ఫ్లుఓవర్ల పనులు దాదాపు పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్టు టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా వరుసగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
జిహెచ్ఎంసికి ముందస్తు ఎన్నికలు?
RELATED ARTICLES