ఎంజిబిఎస్ నుంచి జెబిఎస్ వరకు మెట్రోరైలు మార్గాన్ని జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి
ఎంజిబిఎస్ వరకు మెట్రోలో ప్రయాణించిన కెసిఆర్
11 కి.మీ. 9 స్టేషన్లు
ప్రజాపక్షం/ హైదరాబాద్ ; జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఎంజిబిఎస్ (కారిడార్-2) వరకు మెట్రోరైలు మార్గాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. శుక్రవారం హైదరాబాద్ జూబ్లీబస్ స్టేషన్ సమీపంలో కార్యక్రమం నిర్వహించడంతో పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. మెట్రో ప్రా రంభం అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంజిబిఎస్ వరకు మెట్రోలో ప్రయాణించారు. జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు 11 కిలోమీటర్ల మార్గంలో 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఈ మార్గంలో ఒక చివరి నుంచి మరో చివరికి చేరుకునేందుకు కేవలం 16 నిమిషాల సమయం పడుతుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటి స్పీకర్ టి.పద్మారావుగౌడ్, మంత్రులు కె.టి.రామారావు, మహమూద్ అలీ, వి.శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మెట్రోరైల్ ఎండి ఎన్‌విఎస్‌రెడ్డి, ఎల్ అండ్ టి సిఇఒ, చైర్మన్, ఎండి ఎస్.ఎన్.సుబ్రాహ్మణ్యన్, ఎల్ అండ్ టి మెట్రో హైదరాబాద్ ఎం.వి.రెడ్డి హాజరయ్యారు. ఎంజిబిఎస్ ఇంటర్ ఛేంజ్ స్టేషన్లో మెట్రో ఉన్నతాధికారులు, ఉద్యోగులు ముఖ్యమంత్రి కెసిఆర్‌తో ఫొటోలు దిగారు. తొలి దశ మెట్రో ప్రాజెక్ట్‌లో ఇది చివరి దశ కావడంతో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఇందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మొదటి దశలో మెట్రోరైలు ప్రాజెక్ట్‌లో ప్రతిపాదించిన 72 కి.మీ మార్గంలో 69 కి.మీ మేరకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో కారిడార్‌గా హైదరాబాద్ మెట్రోరైల్ నిలిచింది. ఎంజిబిఎస్ స్టేషన్‌ను ప్రత్యేకతలతో నిర్మించారు. 58 పిల్లర్లు, 6 గ్రిడ్స్‌తో పూర్తి స్థాయి స్టీల్, నాణ్యతమైన సిమెంట్ కాంక్రీట్‌తో స్టేషన్ నిర్మించారు. ఎల్.బి.నగర్ నుంచి మియాపూర్ మార్గంలో ప్రయాణించే కారిడార్-1కు సంబంధించిన రైళ్లు రాకపోకలు ఇంటర్ ఛేంజ్ మెట్రోస్టేషన్ కింద అంతస్తుల ద్వారా ప్రయాణించగా, కారిడార్-2 జెబిఎస్ నుంచి ఫలక్‌నూమా మార్గంలో సాగించే రైలు పై అంతస్తుల ద్వారా రాకపోకలు సాగిస్తాయి. ఐతే ఒక మార్గం నుంచి మరో మార్గం మారడానికి సులభమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాబోయే 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా నిర్మించారు. రిటైల్ అవుట్లెట్లు, ఎంటర్టైన్మెంట్ జోన్స్, కన్వీయెన్స్ అవుట్‌లెట్స్‌ను కాంకర్స్ లెవల్లో నిర్మించారు. ఈ మార్గంలో జెబిఎస్, పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, న్యూ గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్, ఆర్టిసి క్రాస్ రోడ్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజిబిఎస్ మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఎల్.బి.నగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం మార్గాల్లో ప్రతిరోజు 4 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు.
మెట్రోరైల్ కారిడార్-2 సేవలు షురూ
RELATED ARTICLES