న్యూఢిల్లీ : సిఎఎ, ఎన్‌పిఆర్‌లపై పార్లమెంటు దద్దరిల్లింది. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చలో భాగంగా సిఎఎ అంశంతోపాటు బిజెపి నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఉభయ సభలు అట్టుడికాయి. లోక్‌సభలో గందరగోళం నెలకొనగా, రాజ్యసభ పదేపదే వాయిదా పడింది. లోక్‌సభ నిర్వహణ స్పీకర్‌కు కష్టసాధ్యమైంది. రాజ్యసభ కార్యకలాపాలు ఏకంగా తుడిచిపెట్టుకుపోయాయి. ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చి మోడీ సర్కారుపై దుమ్మెత్తిపోశాయి. రెండు సభలు బిజెపి వ్యతిరేక నినాదాలతో హోరెత్తిపోయాయి. ప్రజాగళాన్ని తూటాతో మూయించలేరంటూ నినదించారు. దేశరాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని రోజులే ఉందనగా ఎన్నికల ప్రచారంలో బిజెపి నాయకు లు అనురాగ్ ఠాకుర్, పర్వేశ్ వర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద కొనసాగుతున్న పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) వ్యతిరేక నిరసన సోమవారం లోక్‌సభలో ప్రముఖ అంశాలయ్యాయి. లోక్‌సభలో పౌరసత్వ సవరణ చట్టంపై ప్రతిపక్షనాయకులు, ప్రధానంగా కాం గ్రెస్, డిఎంకె నిరసనలను ప్రదర్శించడం కనిపించింది. ప్రజాగళాన్ని (బోలి)ని ప్రభుత్వం తూటా (గోలి)తో మూయించలేదని కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించారు. ఉదయం 11 గంటలకు ప్రశ్నోత్తర సమయం ఆరంభం కాగానే విపక్ష నాయకులు లోక్‌సభ వెల్‌లోకి దూ సుకెళ్లారు. అప్పుడు వారు వారి ప్రశ్నలను రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానం అప్పుడు లేవనెత్తవచ్చని లోక్‌సభ స్పీకకర్ ఓమ్ బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పిఆర్), జాతీయ పౌరసత్వ జాబితా(ఎన్‌ఆర్‌సి)కి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దాంతో ప్రశ్నోత్తర సమయం తర్వాత స్పీకర్ సభను 10 నిమిషాలపాటు వాయిదా వేశారు. అది భోజన సమయం అని కూడా ఆయన నొక్కి చెప్పారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు, జాతీయ జెండాలను మోస్తున్నారని, కొంతమంది నిరసనకారులను ‘కనికరం లేకుండా‘ చంపేశారని అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. ‘మీరు బూటకపు హిందువులు’ అని బిజెపిపై దాడి చేశారు. ‘అసలైన హిందువులైతే భిన్నంగా వ్యవహరించేవారు’ అని కూడా అన్నారు. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ ఠాకుర్ ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిఎఎ వ్యతిరేక ఉద్యమకారులను ఉద్దేశించి ‘ద్రోహులను కాల్చి పారేయండి’ అన్న నినాదానిచ్చినందుకు ఆయన ఎన్నికల ప్రచారంపై మూడు రోజులపాటు ఎన్నికల సంఘం నిషేధం విధించింది. సభ వెల్‌లో ఉన్న కాంగ్రెస్ సభ్యులు, ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ఆప్‌కా గోలి కహా హై? (మీ బుల్లెట్ ఎక్కడ ఉంది?)’ అని నిలదీశారు. మరికొంతమంది సభ్యులు ‘గోలీ మార్నా బంద్ కరో (తూటా కాల్పులు ఆపండి)’ అని అరిచారు. ప్రశ్నోత్తర సమయంలో ఠాకుర్ అనుబంధ ప్రశ్నలకు జవాబివ్వపూనుకునప్పుడల్లా పార్లమెంటు సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ఢిల్లీ ఎన్నికల ర్యాలీలో పర్వేశ్ వర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, డిఎంకె సభ్యులు నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వర్మ చర్చను ప్రారంభించినప్పుడల్లా ‘సిగ్గుపడండి’(షరమ్ కరో) అంటూ ప్రతిపక్ష సభ్యులు నినదించారు. లోక్‌సభ సభ్యుడు బయట చెప్పింది సభ లోపల ఎత్తరాదని, తప్పుడు ఉదాహరణను రూపొందించరాదంటూ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పౌరసత్వ సవరణ చట్టంను కాంగ్రెస్ వ్యతిరేకించడాన్ని వర్మ ప్రస్తావిస్తూ ‘ఇది రాజీవ్ ఫెరోజ్ ఖాన్ ప్రభుత్వం కాదని, నరేంద్ర మోడీ ప్రభుత్వం అని వారు గుర్తించాలి’ అని వాడిగా వ్యాఖ్యానించారు. షాహీన్ బాగ్ బైఠాయింపును ప్రస్తావిస్తూ ‘మేము సిఎఎను వెనక్కి తీసుకోబోము. ఇది దేశ సమగ్రతకు సంబంధించిన అంశం. వారు పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన తెలుపడంలేదు. కాకపోతే వారు అక్కడ పాకిస్థాన్ జిందాబాద్, భారత్ నుంచి అసోం, కశ్మీర్‌లను వేరు చేయాలి అంటున్నారు’ అని చెప్పారు. ‘నిర్భయ కేసు దోషుల క్షమాభిక్ష అభ్యర్ధనను తిరస్కరించినటువంటి రాష్ట్రపతిని చూసి గర్వించాలి’ అన్నారు. సంబంధిత చట్టాల క్రింద ఠాకుర్‌ను బుక్ చేయాలని కాంగ్రెస్‌కు చెందిన గౌరవ్ గొగోయ్ చెప్పారు. రెచగొట్టే ప్రసంగాలు చేయడానికి మంత్రులకు తమ రాజకీయ పెద్దల నుంచి ఆదేశాలు అందుతున్నాయని కూడా ఆయన ఆరోపించారు. పేరు ప్రస్తావించకుండానే ‘మంత్రిని తగిన చట్టాల కింద బుక్‌చేయండి’ అని డిమాండ్ చేశారు.
ప్రజాగళాన్ని తూటాతో మూయించలేరు!
RELATED ARTICLES