ప్రజాపక్షం/న్యూఢిల్లీ ః కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్‌లకు అనుకూలం, పేదలు, రైతులకు వ్యతిరేకమని సిపిఐ వ్యాఖ్యానించింది. సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం శనివారంనాడు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నట్లుగానే కేంద్రప్రభుత్వం కూడా సంక్షోభంలో వున్నట్లు బడ్జెట్ చూస్తే తెలుస్తున్నదని వ్యాఖ్యానించింది. పెద్దసంఖ్యలో స్వదేశీ ప్రైవేట్ వ్యక్తులు, విదేశీ పెట్టుబడిదారులకు ఆహ్వానం పలుకుతూ, వారి కోసమే శక్తినంతా ధారబోసి బడ్జెట్‌ను తయారు చేయడం సిగ్గుచేటు అని విమర్శించింది. రైల్వేలు, ఆరోగ్యం, ప్రాతిపదిక సౌకర్యాలతోపాటు ప్రతి ఒక్క రంగాన్నీ ప్రైవేటీకరించేందుకు వేసిన గణాంకాల పట్టికగా ఈ బడ్జెట్ వుందని తెలిపింది. ఎల్‌ఐసిలోని వాటాలను అమ్మకానికి పెట్టడం అతిపెద్ద తిరోగమన చర్య అని దుయ్యబట్టింది. గత బడ్జెట్ కన్నా ఈ సారి బడ్జెట్‌లో ఆహార సబ్సిడీలను రూ. 75,000 కోట్లకు కుదించడం విచిత్రమని పేర్కొంది. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అంటూ కలలుకంటున్న ఆర్థిక మంత్రి ఐదు శ్లాబుల వ్యక్తిగత ఆదాయపన్ను రాయితీలను అవాస్తవికంగా రూపొందించారని అభిప్రాయపడింది. “రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని పదేపదే ప్రకటిస్తున్న మోడీ ప్రభుత్వం ఆ దిశగా ఒక్క చర్య కూడా చేపట్టలేదు. దేశంలోని నిరుద్యోగులకు బడ్జెట్ పూర్తిగా నిరాశమిగిల్చింది. వాస్తవంగా చూస్తే ఎస్సీలు, ఎస్టీలు, పేదవర్గాలకు కేటాయింపులు అంతంతమాత్రంగానే వున్నాయి. మానవశక్తిని నిర్వీర్యం చేసే క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచాలంటూ చేసిన ప్రతిపాదలన్నీ అస్పష్టంగానే వున్నాయి. విద్యా, సామాజిక, మౌలిక వసతులకు బడ్జెట్ నుంచి తగినంత తోడ్పాటు కన్పించడం లేదు. ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టి ఆదాయాన్ని సమీకరించాలన్న ఆలోచన సరికాదు. అదే సమయంలో కార్పొరేట్ సంస్థలకు భారీగా రాయితీలను ప్రకటించింది. ప్రస్తుత బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ అనుకూలం, పేదలు, రైతులకు వ్యతిరేకం” అని సిపిఐ విమర్శించింది. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా కార్మికులు తమ పోరాటాన్ని కొనసాగించాలని సిపిఐ ఈ సందర్భంగా పిలుపునిచ్చింది.
కార్పొరేట్‌లకు అనుకూలం, పేదలకు వ్యతిరేకం : బడ్జెట్‌పై సిపిఐ
RELATED ARTICLES