న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య ఘటనలో దోషులకు ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. తమపై ఉరి అమలును నిరవధికంగా వాయిదావేయాని కోరుతూ దోషు లు పెట్టుకున్న పిటిషన్ ఈ మేరకు పాటియలా హౌస్ కోర్టు తీర్పు వెలువరించింది. తదుపరి ఆదేశాల ఇచ్చే వరకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు వాయిదా వేయాలని ఆదేశించింది. గతంలో ఢిల్లీ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం శనివారం (ఫిబ్రవరి 1న) ఉదయం ఆరు గంటలకు నలుగురు దోషులు ముఖేశ్ కుమార్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ కుమార్ శర్మ(26), అక్షయ్ కుమార్(31)లను ఉరితీయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో మరో దోషి వినయ్ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నాడు. ఈ అభ్యర్థన ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. న్యాయపరంగా అన్ని అవకాశాలూ ఉన్న నేపథ్యంలో ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ ముగ్గురు దోషులు..పవన్, వినయ్, అక్షయ్ తరఫు న్యాయవాది ఎ.పి. సింగ్ గురువారం పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా డెత్ వారెంట్‌పై స్టే విధిస్తూ శిక్ష అమలును వాయిదా వేస్తూ తీర్పు వెలువరించారు. Crime తీహార్ జైలు అధికారులు దోషుల దరఖాస్తులను సవాలుచేశారు. వారిని వేర్వేరుగా ఉరితీయాలని వాదించారు. అయితే తీహార్ జైలు అధికారుల వాదనను కోర్టు ఆమోదించలేదు. దోషులకు ఉన్న న్యాయపరమైన అవకాశాలను చూసిచూడనట్లు ఉండలేమని(టర్నింగ్ ఏ నెల్సన్ ఐ) న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కోర్టు ఈ మేరకు తీర్పు ప్రతని దోషుల తరఫు న్యాయవాదికి అందించింది. ‘జైలు సూపరింటెండెంట్ శనివారంకల్లా కాంప్లియన్స్ రిపోర్ట్ దాఖలుచేయాలి’ అని కూడా జడ్జి అన్నారు.
2 గంటలపాటు జరిగిన వాదన సమయంలో ముఖేశ్ తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాది వృందా గ్రోవర్ కూడా ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరారు. ‘ఒకవేళ వినయ్ క్షమాభిక్ష పిటిషన్‌ను అనుమతిస్తే, నాకు మరో క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. న్యాయపరమైన వికల్పాలు ముగిసిపోయాయని అనడం సరికాదు’ అని కూడా వృందా గ్రోవర్ వాదించారు. ముఖేశ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారన్నది తెలిసిన విషయమే. రాష్ట్రపతి వద్ద వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్ష అమలుపై స్టే విధించారు. ఒకే కేసులో ఒకే శిక్ష పడిన దోషుల్లో ఏ ఒక్కరికి శిక్ష అమలు వాయిదా పడినా మిగిలిన వారికి అది వర్తిస్తుందని తీర్పులో పేర్కొన్నారు. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ పై నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టు మరోసారి డెత్ వారెంట్ ఇవ్వనుంది. డెత్ వారెంట్‌పై స్టే ఇవ్వడం ఇది రెండోసారి. వాస్తవానికి జనవరి 22నే నిర్భయ దోషులకు ఉరితీయాల్సి ఉండగా తొలిసారి స్టే విధించారు. దీంతో ఫిబ్రవరి 1న ఉరితీయాలని డెత్ వారెంట్ జారీ చేయగా తాజాగా రెండోసారి స్టే విధించడం గమనార్హం. మరోవైపు నిర్భయ కేసు విచారణ సమయంలో తాను మైనర్‌నంటూ పిటిషన్ వేసిన దోషి పవన్ గుప్తా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్‌ను ఇవాళ కొట్టివేసింది. వినయ్, అక్షయ్‌లు పెట్టుకున్న క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇదివరకే కొట్టేసింది.
ఉరిశిక్ష ‘స్టే’పై కేంద్రం ఆగ్రహం
నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదాపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టాన్ని అపహాస్యం చేసేలా దోషులు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉరిశిక్షను తప్పించుకునేందుకు నిర్భయ దోషులు చట్టంలోని లొసుగులను అనుకూలంగా ఉపయోగించుకున్నారని గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఈ మేరకు దోషుల ఉరిశిక్షపై ఢిల్లీ పాటియాలా హౌజ్ కోర్టు స్టే విధించడంపై కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ‘భారత చట్టాలపై పార్లమెంట్ వేదికగా సుదీర్ఘమైన చర్చజరగాలని, దేశ అత్యున్నత న్యాయస్థానం దోషులుగా తేల్చినా.. శిక్ష అమలులో ఇంత ఆలస్యం జరగమేంటి’ అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పవన్ గుప్తా రివ్యూ పిటిషన్ కొట్టివేత
నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. నిర్భయ సామూహిక అత్యాచారం జరిగిన సమయంలో తాను మైనర్‌ను అని వేసిన పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సమీక్షించాలంటూ.. పవన్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ రివ్యూ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం దానిని కొట్టివేసింది.
నిర్భయ కేసు దోషుల ఉరిశిక్ష వాయిదా
RELATED ARTICLES