ఉదయం 7 గంటల నుంచే పోలింగ్
ఏర్పాట్లు పూర్తి.. కట్టుదిట్టమైన భద్రత
దొంగ ఓట్లు పడకుండా ఎన్నికల సంఘం జాగ్రత్తలు
120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఎన్నికలు
ప్రజాపక్షం/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఇక పోలింగ్‌పై దృష్టి పెట్టారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేలా చూడాలని తమ అనుచరులకు, స్థానిక నాయకులకు, కార్యకర్తలకు పురమాయించారు. మరోవైపు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పోలింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు, దొంగ ఓట్లు పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగా పలు మార్గదర్శకాలను ఇది వరకే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏ చిన్న పొరపాటు లేకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పోరేషన్ల పరిధిలోని మొత్తం 3029 వార్డులలో మొత్తం 12,843 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 7961 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) తెలిపింది. ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నిర్వహణకు మొత్తం 55 వేల మంది సిబ్బంది ఉండగా, ఇందులో 10 వేల మంది ఓటు లెక్కింపు సిబ్బంది ఉన్నారు. 53,50,255 మంది ఓటర్లు ఉండగా ఇందులో మున్సిపాలిటీల్లో 40,36,346 మంది, కార్పోరేషన్ పరిధిలో 13,13,909 మంది ఓటర్లు ఉన్నారు. వీడియో కవరేజ్‌లో 2072 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వెబ్‌కాస్టింగ్ లైవ్ పరిధిలో 2406 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆన్‌లైన్‌లో 70 ఫిర్యాదులు అందగా, రాతపూర్వకంగా 40 ఫిర్యాదులు అందాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) ఇప్పటి వరకు రూ. 44.41 లక్షల నగదును, రూ. 16లక్షల విలువ చేసే మద్యాన్ని సీజ్ చేసినట్టు ఎస్‌ఇసి కమిషనర్ వి.నాగిరెడ్డి ఎస్‌ఇసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. భైంసాలో ఎలాంటి ఘర్షణ వాతావరణం లేదని, ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
‘డబ్బు’పై అభ్యర్థులు, రాజకీయ పార్టీలే నిఘా పెట్టాలి: ఎస్‌ఇసి
ఎన్నికల్లో ధనప్రభావాన్ని అరికట్టేందుకు రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు నిఘా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) కమిషనర్ వి.నాగిరెడ్డి సూచించారు. తమ ప్రత్యార్థులు డబ్బులు పంచుతున్నారా? అనే విషయమై వారే దృష్టి పెట్టాలన్నారు. ప్రలోభాలకు గురిచేసే సన్నివేశాలను స్థానికంగా ఉన్న వారే తమ చేతిలో ఉన్న ఫోన్ ద్వారా చిత్రీకరిస్తే మంచి సాక్ష్యాలుగా నిలుస్తాయని చెప్పారు. వాటి ఆధారంగా అభ్యర్థిపై వేటు వేసే అవకాశం ఉంటుందన్నారు. అప్పటికే సదరు అభ్యర్థి ఎన్నికల్లో గెలిచినా ఆయనపై అనర్హత వేటు వేస్తామని నాగిరెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ధన ప్రవాహం పెరుగుతుందనే ఫిర్యాదులు అందుతున్నాయని, తమ వైపు నుంచి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల ఖర్చు విషయంలో తప్పుడు లెక్కలు చూపించినా వాటికి సంబంధించిన ఆధారాలు ఉంటే సదరు అభ్యర్థిపై వేటు తప్పదని హెచ్చరించారు. ప్రస్తుత అవసరాలు, డబ్బులతో కాకుండా రానున్న ఐదేళ్ల పాటు ప్రజలకు సేవ చేసే నాయకులకు ఓటు వేయాలని సూచించారు. తమ ఓటు ద్వారా విశిష్ట అధికారాన్ని అప్పగిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల చరిత్రను పూర్తిగా తెలుసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అభ్యర్థుల చరిత్ర తెలుసుకునేందుకు వీలుగా రిటర్నింగ్ అధికారి వద్ద వారి వివరాలు అందుబాటులో పెట్టామన్నారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లిలో డబ్బు పంపిణీ వీడియో తీసి పెట్టారని, దీనిపై కేసు నమోదు చేశామని, అలాగే అలంపూర్ ఘటనపై ఫిర్యాదు అందిందన్నారు.