రాష్ట్ర సమాచార శాఖకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశం
న్యాయపోరాటంలో టియుడబ్ల్యుజె విజయం
ప్రజాపక్షం/హైదరాబాద్: ప్రజాపక్షం, వెలుగు పత్రికలను ఫిబ్రవరి మొదటివారంలోగా ఎంపానల్మెంట్ చేసి, వెంటనే అక్రిడిటేషన్లు, యాడ్స్ ఇవ్వాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) చైర్మన్ జస్టిస్ సి.కె.ప్రసాద్ తీర్పు ఇచ్చారు. ప్రజా గొంతుకలైన ప్రజాపక్షం, వెలుగు పత్రికలను అణచివేసేందుకు సమాచార శాఖ ఉన్నతాధికారి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎంపానల్‌మెంట్‌కు అన్ని అర్హతలున్నా తిరస్కరించారు. కనీస హక్కులైన పత్రికలకు యాడ్స్, విలేకరులకు అక్రిడిటేషన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారు. రాష్ట్ర అక్రిడిటేషన్ కమిటీ తీర్మానాలను సైతం పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అప్రజాస్వామిక చర్యలపై తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియుడబ్ల్యుజె) గత ఆరునెలలుగా న్యాయపోరాటం చేసి ఎట్టకేలకు విజయం సాధించింది. ప్రజాపక్షం, వెలుగు పత్రికలకు యాడ్స్, అక్రిడిటేషన్లు సాధించగలిగింది. ఆ రెండు పత్రికలపై సమాచార శాఖ కమిషనర్ కక్షసాధింపు చర్యను టియుడబ్ల్యుజె ఎండగట్టింది. అంతటితోనే ఊరుకోకుండా జూన్ 27న, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, న్యాయాధికారం కలిగివున్న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ)ని ఆశ్రయించారు. గత ఆరు నెలలుగా పిసిఐ దీనిపై విచారణ కొనసాగించింది. సోమవారం విచారణ తుదిస్థాయికి రావడంతో పిటిషనర్ కె.విరాహత్ అలీని పిసిఐ ఆహ్వానించింది. దీంతో ఆయనతో పాటు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) అధ్యక్షులు కె.శ్రీనివాస్‌రెడ్డి, పిసిఐ మాజీ సభ్యులు కె.అమర్నాథ్ ఢిల్లీకి వెళ్లి పిసిఐ విచారణ కమిటీ ముందు తమ వాదనలు వినిపించారు. సోమవారం వాదనలు విన్న కమిటీ చైర్మన్ జస్టిస్ సి.కె.ప్రసాద్ కేసును మంగళవారానికి వాయిదా వేసి, బాధ్యులైన సమాచారశాఖ అధికారిని విచారణకు రావాలని ఆదేశించారు. దీంతో సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ జగన్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి పిసిఐ విచారణ కమిటీ ముందు హాజరై తన వాదన వినిపించారు. అధికారి వాదన అక్రిడిటేషన్, యాడ్స్ జిఒలకు విరుద్ధంగా ఉండడంతో, ఫిబ్రవరి మొదటి వారంలోగా ప్రజాపక్షం, వెలుగు పత్రికలను ఎంపానల్మెంట్ చేసి, వెంటనే అక్రిడిటేషన్లు, యాడ్స్ ఇవ్వాలని పిసిఐ చైర్మన్ జస్టిస్ సి.కె.ప్రసాద్ తీర్పు చెప్పారు. ఈ విచారణ కమిటీలో పిసిఐ సభ్యులు దేవులపల్లి అమర్ కూడా సభ్యులుగా ఉన్నారు.