మద్యం పంపిణీ షరా మామూలే
నేటితో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర
ప్రజాపక్షం / హైదరాబాద్; మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలతో తెర పడనుంది. కొన్ని గంటల్లో పోలింగ్ మొదలుకానున్న నేపథ్యంలో కొందరు అభ్యర్థులు డబ్బుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆదివారం నుంచే మద్యం, డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. మరి కొందరు అభ్యర్థులు తమ ప్రత్యర్థులు ఎంత మేరకు డబ్బులు పంపిణీ చేస్తారో అంచనా వేసి అందుకు కొంత ఎక్కువ చేసి పంపిణీ చేయాలని తమ అనుచర వర్గానికి చెబుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. వార్డులోని ప్రాంతాలు, ఓటర్లు, సామాజిక వర్గాల వారీగా లెక్కలు తీస్తున్నారు. మరోవైపు పోలింగ్‌కు గంటల సమయమే ఉండడంతో వ్యూహాత్మం గా వ్యవహరించి, ఆయా ప్రాంత ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు సర్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలందరూ ప్రచారహోరులో నిమగ్నయమయ్యారు. కాగా కొన్ని వార్డులలో ప్రతిపక్ష అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకునేలా అధికార టిఆర్ఎస్ ఒత్తిడి తీసుకొస్తోందని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. తమకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు (పెన్షన్) రాదని కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ ఎంఎల్ఎలు ప్రచారం చేస్తున్నారు. ఎవరికి ఓటు వేసిన తనకు తెలిసిపోతుందని సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించడం పట్ల ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎవరికి ఓటు వేసింది ఎలా తెలుస్తుందని, ఏమైనా గోల్మాల్ చేస్తారా..? లేదా ఓటర్లను బెదిరిస్తున్నారా..అని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించి మంత్రి ఎర్రబెల్లిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా అధికార టిఆర్ఎస్ మాత్రం ప్రత్యార్థుల బలబలాలపై అంచనా వేస్తోంది. రెబెల్స్ నుంచి ఏమైనా ముప్పు ఉంటే వారిని ఎలాగైనా ఒప్పించాలని స్థానిక నాయకత్వానికి ఆ పార్టీ ముఖ్యనేతలు ఆదేశించారు. ఒక వేళ రెబెల్స్ వర్సెస్ టిఆర్ఎస్ మధ్యనే పోటీ ఉన్న మరికొన్ని వార్డులలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఒక వేళ వారు గెలిస్తే తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా టిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.