గోదావరి నది, వాగులు వంకల నుండి అక్రమ రవాణా
టన్నుకు రూ. 2500
ప్రముఖులు, పార్టీల కనుసన్నల్లోనే ఇసుక వ్యాపారం?
ప్రజాపక్షం/హైదరాబాద్: గృహ నిర్మాణ రంగంలో ఇసుకకు ఉన్న డిమాండే వేరు. దీనిని ఆసరాగా చేసుకుని పలువురు దళారులు ఇసుక విక్రయాయాలను లాభాపేక్ష వ్యాపారంగా మార్చుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా గోదావరి, ఉప నదులు, పరిసర ప్రాంతాల్లోని వాగులు, వంకల నుంచి జోరుగా అక్రమంగానే ఇసుక తరలి పోతోంది. గోదావరితో పాటు కిన్నెరసాని, మున్నేరు నది తీరప్రాంతాల్లో ప్రస్తు తం ఇసుక తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణ జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం చూసి చూడనట్లు మిన్నకుండి పోతున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. పేదల గృహనిర్మాణం , అభివృద్ధి పనుల్లో అవసరాలను దృష్టిలో పెట్టుకుని జారీ చేసినట్టు చెబుతున్న ఈ అనుమతుల మాటున అక్రమార్కులకు లాభం కలిగించేలా అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక అవసరాల కోసం ఇసుకను తరలించేందుకు అధికారులు గ్రామపంచాయతీలకు ఇచ్చిన అనుమతులు ప్రైవేటు వ్యక్తులకు ఎంతో లాభం తెచ్చిపెడుతున్నాయి. అధికారికంగా విక్రయించాల్సిన ఈ ఇసుక విక్రయాలను పలుచోట్ల ప్రైవేటు వ్యక్తులు సొంతం చేసుకుని తమ సొంత మనుషులతో వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించిన ప్రాంతాల నుండి ఈ ఇసుక రవాణా నిత్యం పదుల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్ల ద్వారా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇసుక తవ్వకాల కారణంగా భూగర్జ జలమట్టాలు మరింత పాతాళానికి అడుగంటుతున్నాయని రైతాంగం ఆరోపిస్తోంది.
నిన్న మొన్నటి వరకు రూ. 1400 పలికిన టన్ను ఇసుక ధర తాజాగా 2,500లకు పెంచేసి విక్రయాలు చేస్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్ , కామారెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఇసుక దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతున్న పట్టించుకునే నాథుడే కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతినిత్యం ప్రత్యామ్నాయ మార్గాల మీదుగా తరలించే ఇసుక దళారుల పంట పండిస్తోందంటున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ఇలా ఇసుక అక్రమంగా తరలిపోతున్నా క్షేత్రస్థాయిలో నియంత్రించాల్సిన అధికారుల జాడ కనిపించడం లేదంటున్నారు. ప్రస్తుత శీతాకాలం, ఆ తర్వాత వచ్చే వేసవిలో భవన నిర్మాణాలకు గోదావరి టఇసుకకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంటోంది. గోదావరి తీరంలో ఇసుక రూపేణా సహజ వనరుల దోపిడి అత్యంత సహజంగానే మారిపోయిందని పలువురు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. గోదావరి, కిన్నెరసాని, మున్నేరు, తాలిపేరు తదితర వాగులు, వంకల నుండి ఇసుక అక్రమ రవాణా నిత్యం యధేచ్చగా కొనసాగుతుండడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అటు ఉమ్మడి నిజామామాద్ జిల్లా, కామారెడ్డి సరిహద్దుల్లోని ఇసుక ర్యాంపులు దళారుల పంట పండిస్తున్నాయంటున్నారు. నిజామాబాద్ జిల్లాలోని అనధికారిక ర్యాంపుల నుండే కాకుండా రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్ధకు చెందిన అధికారిక ర్యాంపుల నుండి కూడా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఇసుకనే వ్యాపారంగా మలుచుకుని పలువురు దళారులు కోట్లకు పడగలెత్తుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం , నిజామామాద్ జిల్లాల్లోని ఆయా ప్రాంతాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతల కనుసన్నల్లోనే ఇసుక వ్యాపారం సాగుతోందని తెలుస్తోంది. భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, చర్ల, దుమ్ముగూడెం తదితర ప్రాంతాలకు చెందిన ప్రముఖులు రాజకీయ పార్టీల నేతల కనుసన్నల్లో ఇసుక వ్యాపారాన్ని చేసుకుంటూ అందిన కాడికి దోచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.