కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల, కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలు, ఎన్‌పిఆర్, ఎన్‌ఆర్‌సి, సిఎఎ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన సార్వత్రిక సమ్మె రాష్ట్రంలో విజయవంతం అయింది. వామపక్ష నేతలతో పాటు వివిధ కార్మిక, రైతు సంఘాలు పలు చోట్ల కదం తొక్కాయి. భారీ ర్యాలీలు, ప్రదర్శనలు, సభలు నిర్వహించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, విద్యాసంస్థలు, సింగరేణి, రైతు సంఘాలు, వివిధ కార్మిక సంఘాలు పూర్తి బంద్‌ను పాటించాయి. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశాయి. హైదరాబాద్‌లో ఇందిరాపార్క్ వద్ద భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో వివిధ సంఘాలు, వామపక్షాల అగ్రనేతలు పాల్గొన్నారు. జిహెచ్‌ఎంసి వద్ద జిహెచ్‌ఎంసి కార్మిక ఉద్యోగ సంఘం ధర్నా నిర్వహించింది. వైద్య శాఖలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు సమ్మెలో పాల్గొన్నారు. తపాలశాఖ కార్యాలయాలు కూడా కార్మికుల సమ్మెతో బోసిపోయాయి. మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి జిల్లాల్లో సింగరేణి కార్మికులు రోడ్డెక్కారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమ్మెలో పాల్గొన్నారు. నిరసనకు దిగిన కార్మిక సంఘాల నేతలు గనుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పలు పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు , కార్మికసంఘాల నాయకులకు,పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై కార్మిక సంఘాలు మండిపడ్డాయి.