రాజధానిపై రగిలిన ప్రజాందోళనలు
చంద్రబాబు, రామకృష్ణ తదితరుల అరెస్ట్
పోలీసులకు అడుగడుగునా అడ్డంకులు
అమరావతి, విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు
ప్రజాపక్షం/అమరావతి; ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని రగడ ఉధృతరూపం దాల్చింది. బుధవారం టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రత్యక్ష ఆందోళనకు దిగడంతో అమరావతి, విజయవాడలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జెఎసి ఆధ్వర్యంలో అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా బస్సుయాత్ర నిర్వహించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు విచ్ఛిన్నం చేశారు. చంద్రబాబుతోపాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని తరలించేటప్పుడు ప్రజలు అడుగడుగునా పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. బెంజిసర్కిల్ జనదిగ్బంధమైంది. మూడు రాజధానులు ఎవరడిగారు? ఉన్న రాజధానిని ఎందుకు చెడగొడతారు? జగన్ డౌన్‌డౌన్ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. అమరావతి కోసం ఆందోళన ఆపేది లేదని చంద్రబాబు మీడియాకు చెప్పారు. చంద్రబాబు, ఇతర నేతలను వాహనాల్లో తరలించి, బాబు ఇంటివద్ద వదిలిపెట్టారు. అంతకు ముందు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అమరావతి ఐకాస నేతల బస్సుయాత్రకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని ప్రశ్నించారు. తాము చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని.. ఎందుకీ దౌర్జన్యమని పోలీసులను నిలదీశారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేసుకోవాలని.. పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. అణచివేతతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. శాంతియుతంగానే తాము నిరసన తెలుపుతున్నామని.. ఏ చట్టం ప్రకారం తమను అడ్డుకుంటున్నారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సిపిఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అరెస్టులతో తమను ఆపలేరన్నారు.