ముంబయి : ఆటగాళ్ల గాయాలను నిర్వహించడంపై తరచూ విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సిఎ) పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా బీసీసీఐ మెడికల్ ప్యానెల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు సోషల్ మీడియా విభాగాన్ని కూడా నెలకొల్పనున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన ఎన్‌సీఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో పాటు ఆఫీస్ బేర్లర్లు, ఎన్‌సీఏ అధ్యక్షుడు ద్రవిడ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. గాయాలపాలైన వృద్దిమాన్ సాహా, భువనేశ్వర్ కుమార్ సహా ప్రముఖ భారత ఆటగాళ్ల గాయం నిర్వహణపై ఎన్‌సీఎ చేసిన విమర్శల తరువాత బీసీసీఐ దిద్దుబాటు చర్చలకు దిగింది. మరోవైపు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాలు గాయాల నుంచి కోలుకునేందుకు ఎన్‌సీఏ కాకుండా వ్యక్తిగత ట్రైనర్లు సహాకారం తీసుకోడం కూడా ఎన్‌సీఏపై తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సభ్యులు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐకి చెందిన అధికారి ఒకరు తెలిపారు. మెడికల్ ప్యానెల్ ఏర్పాటుకు త్వరలో లండన్‌లోని ఫోర్టిస్ క్లినిక్‌తో సంప్రదింపులు జరపనున్నామని ఆయన అన్నారు. అదేవిధంగా చాలా రోజులుగా ఖాళీగా ఉన్న ఫాస్ట్ బౌలింగ్ విభాగపు హెడ్‌ను కూడా నియమించనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్‌సీఏలో అతడు ఫాస్ట్‌బౌలింగ్ ప్రోగ్రామ్‌కు నేతృత్వం వహిస్తాడని తెలిపారు. దీంతో పాటు ఎన్‌సీఏకు వచ్చే ఆటగాళ్ల కోసం ఓ న్యూట్రీషియన్‌ను కూడా నియమిస్తామని ఆ అధికారి తెలిపారు. ఎన్‌సీఏలో సదుపాయాలు ఏవిధంగా ఉన్నాయో సోషల్‌మీడియా మేనేజర్ ఎప్పటికప్పుడు అందజేస్తారని చెప్పారు. మెడికల్ ప్యానెల్ ఏర్పాటుకు 18 నెలలు పడుతుందని, మిగిలిన పోస్టుల భర్తీ త్వరలోనే చేపట్టనున్నట్లు తెలిపారు.
త్వరలో ఎన్‌సిఎ మెడికల్ ప్యానెల్
RELATED ARTICLES