కొరేగావ్ యుద్ధం 202వ వార్షికోత్సవ స్మరణ
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
ప్రశాంతతకు కొత్త ప్రభుత్వం ప్రాధాన్యత
రెండేళ్ల క్రితం రక్తసిక్తం
రాజద్రోహం కేసుల బనాయింపు
పుణె: పటిష్ట బందోబస్తు మధ్య కొరేగావ్ భీమ యుద్ధం 202వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మహారాష్ట్ర పుణె జిల్లాలోని పెర్నె గ్రామంలో ఉన్న ‘జై స్తంభ్’ వద్ద బుధవారం లక్షలాదిమంది ప్రజలు నివాళి అర్పించారు. ఈ ప్రాంతంలో రెం డేళ్ల క్రితం హింసాత్మక ఆందోళనలు చోటు చేసుకున్నాయి. బుధవారం మధ్యాహ్నం 3 గంట ల నాటికి దాదాపు నాలుగు లక్షల మంది దళితులు మత నివాళి అర్పించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. కాగా, ఉదయం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, వంచిట్ బహుజన్ అఘాడి (విబిఎ) అధ్యక్షుడు ప్రకాశ్ అంబేద్కర్, కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలె, అనేకమంది నాయకులు ‘జై స్తంభ్’ వద్ద నివాళి అర్పించారు. ముందస్తు చర్య ల్లో భాగంగా కొరేగావ్ భీమ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులను అధికారులు నిలిపివేశారు. 1818లో జరిగిన యుద్ధం 200వ వార్షికోత్సవ సందర్భంగా జనవరి 1, 2018లో కొరేగావ్ భీమ చుట్టుపక్కల ప్రాంతాల్లో హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఘర్షణల్లో ఒక వ్యక్తి మృతి చెందగా, అనేకమంది గాయపడ్డారు. అయితే ఈ ఏడాది మాత్రం నివాళి అర్పించే కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగిందని, మధ్యాహ్నం 3 గంటలకు వరకు దాదాపు 4 నుంచి ఐదు లక్షల మంది జై స్తంభ్ వద్ద నివాళి అర్పించారని పుణె ఎస్‌పి సందీప్ పాటిల్ వెల్లడించారు. రెండేళ్ల క్రితంలా హింసాత్మక ఘటన జరగకుండా కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు స్థానికులు పరస్పర సాయం అందించారన్నారు. గత అనుభవాల దృష్ట్యా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందితో పాటు రాష్ట్ర రిజర్వ్ పోలీస్ దళానికి(ఎస్‌ఆర్‌పిఎఫ్) చెందిన కంపెనీలు, బాంబు గుర్తింపు, నిర్వీర్య బృందాలు (బిడిడిఎస్)లను ఆ ప్రాంతంలో మోహరింపుజేసినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు డ్రోన్ కెమెరాలను కూడా రంగంలోకి దింపామన్నారు. నివాళి అర్పించేందుకు చేసిన ఏర్పాట్లలో భాగంగా వివిధ సావనీర్లు, ఇతర వస్తువులను విక్రయించేందుకు స్టాళ్ల ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించినట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, విక్టరీ పిల్లర్‌ను సందర్శించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వ తరుపున నివాళి అర్పించానన్నారు. ఈ చరిత్రాక్మక పిల్లర్ వద్దకు ప్రతి ఏడాది లక్షలాది మంది ప్రజలు వస్తారన్నారు. రెండేళ్ల క్రితం కొన్ని అవాంఛనీయ ఘటనలు చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఈ ఏడాదికి అలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తిగిన జాగ్రత్తలు తీసుకుందన్నారు. శాంతియుతంగా ప్రజలు పిల్లర్‌ను సందర్శించి నివాళి అర్పించాలని అజిత్ పిలుపునిచ్చారు. ఎలాంటి వదంతులను నమ్మొద్దని సూచించారు. 1818లో జరిగిన యుద్ధంలో పెష్వాస్ దళాలను బ్రిటీష్ ఆర్మీలో భాగంగా ఉన్న దళిత మెహర్ సామాజిక వర్గానికి చెందిన దాదాపు 500 మంది సైనికులు ఓడించారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది లక్షలాది మంది ప్రత్యేకించి దళితులు జనవరి 1న జై స్తంభ్‌ను సందర్శించి నివాళి అర్పిస్తారు. కాగా, కొంతమంది నివాళి కార్యక్రమ సందర్భంగా ఇబ్బందులు కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి ప్రయత్నాన్ని కొత్త ప్రభుత్వం భగ్న చేసిందని ప్రకాశ్ అంబేద్కర్ వ్యాఖ్యానించారు. కొంతమంది ఈ అంశాన్ని రాజకీయం చేసేందుకు, ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కానీ, తాము ప్రభుత్వానికి అండగా ఉన్నామని, అలాంటి ఉద్దేశాలను భగ్నం చేసిందని ఆయన చెప్పారు. కొరేగావ్ భీమ వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లపై అంబేద్కర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అదే విధంగా ఏర్పాట్లు బాగా చేయడంపై కేంద్రమంత్రి, ఆర్‌పిఐ (ఎ) చీఫ్ అథవాలె జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రశంసించారు. డిసెంబర్ 29 నుంచి నాలుగు రోజుల పాటు జిల్లాలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తూ గత వారం పుణె పోలీసులు మిలింద్ ఎక్బోటె, సంభాజీ భిడె, కబీర్ కాల మంచ్ సభ్యులు సహా అనేకమందికి నోటీసులు జారీ చేశారు. వీరందరిపై కూడా రెండేళ్ల క్రితం జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి కేసులు ఉన్నాయి. ఎక్బోటె మార్చి 2018లో అరెస్టు అయ్యాడు. ఇదిలా ఉండగా, భీమా కోరేగావ్ యుద్ధం 1818 జనవరి 1న జరిగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యానికి చెందిన మహర్ రెజిమెంట్‌కు, “అగ్రకులస్తులైన” పీష్వాలకు మధ్య జరిగిన యుద్ధం అది. పుణెకు దగ్గరల్లోని కోరేగావ్‌లో భీమ నది ఒడ్డున జరగడంతో ఆ పేరు వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీలోని సైన్యంలో ఎక్కువ మంది దళితులే ఉండేవారు. బ్రిటిషర్లపై బాజీరావ్ పీష్వా పోరాటంలో తమను కలుపుకోవాలన్న మహర్ల విజ్ఞప్తిని ఆయన తిరస్కరించాడని, దీంతో వారు బ్రిటిషు సైన్యంలో చేరారని చెబుతారు. దీంతో వాస్తవానికి ఇది బాజీరావు పీష్వా-2 సైన్యంపై బ్రిటీష్ వారు సాధించిన విజయమైనప్పటికీ… కుల వివక్షపై దళితులు సాధించిన విజయంగా కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ యుద్ధంలో మరణించిన వారి స్మారకార్థం బ్రిటిష్ వారు ’విజయ స్తూపం’ ఏర్పాటు చేశారు.
దళిత విజయోత్సవం
RELATED ARTICLES