మున్సిపోల్స్‌పై ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం
ప్రజాపక్షం/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే పోలింగ్ కేంద్రాల షెడ్యూల్‌ను విడుదల చేసింది. జనవరి 4న ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను విడుదల చేయనుంది. 13న వార్డుల వారిగా పోలింగ్ కేంద్రాల తుది జాబితాను విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల నిర్వహణపై శనివారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశంకా నుంది. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) కార్యాలయంలో శుక్రవారం ఎస్‌ఇసి కమిషనర్ వి.నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో డిజిపి మహేందర్‌రెడ్డి, మున్సిపల్ శాఖ సంచాలకులు శ్రీదేవి, ఎస్‌ఇసి కార్యదర్శి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్ల తదితర అంశాలపై వి.నాగిరెడ్డి సమీక్షించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు మరోసారి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. 10 కార్పొరేషన్ పరిధిలో సుమారు 53 లక్షల ఓటర్లు ఉన్నందున అవసరమైన ప్రాంతాల్లో కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా గరిష్టంగా 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. జనవరి 14న అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైన తర్వాత బ్యాలెట్ పత్రాల ముద్రణ చేయనున్నారు.ఇందులో అభ్యర్థులు, రాజకీయ పార్టీ పేరు గుర్తులను ముద్రించనున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి పొరపాట్లు రాకుండా వేగంగా పూర్తి చేయాలని,అలాగే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించకుం డా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని నాగిరెడ్డి ఆదేశించారు.
రిజర్వేషన్ ఓటర్ల గుర్తింపు షెడ్యూల్ : వార్డుల వారీగా ఎస్‌టి,ఎస్‌టి, బిసి, మహిళా రిజర్వేషన్ ఓటర్ల షెడ్యూల్‌ను మున్సిపల్ శాఖ విడుదల చేసింది. 2019 జనవరి 1 నాటికి అర్హులైన ఓటర్లను పరిగణలోకి తీసుకోనున్నారు. ఈనెల 30న వార్డుల వారిగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మహిళా రిజర్వేషన్ల జాబితాను విడుదల చేస్తారు. ఆ తర్వాత అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించేందుకు రెండు రోజుల గడువు విధించారు. ( డిసెంబర్ 31, జనవరి 1 వరకు) విధించారు. జనవరి 2,3 రెండు రోజులలో తమకు అందిన ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిష్కారిస్తారు. అనంతరం జనవరి 4న రిజర్వేషన్ల తుది జాబితాను విడుదల చేస్తారు.