అమరావతి : రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ ప్రకటనకు నిరసనగా రైతులు దీక్షకు దిగారు. రాజధాని ప్రాంతంలోని వెలగపూడి, రాయపూడి, కిష్టాయపాలెం, మందడంలో రైతులు ధర్నా చేపట్టారు. మందడంలో రోడ్డుపై రైతులు బైఠాయించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. వెంకటాయపాలెంలో రాజధాని రైతులు రిలే నిరాహార దీక్షకు దిగారు. వెలగపూడి ప్రధాన కూడలిలో రైతులు ఆందోళన చేపట్టారు. తమ పిల్లల భవిష్యత్ కోసమే గత ప్రభుత్వానికి భూములు ఇచ్చామని రైతులు తెలిపారు. మూడు రాజధానుల ప్రకటనను జగన్ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పురుగుల మందు డబ్బాలతో ఆందోళన జగన్ ప్రకటనకు నిరసనగా తుళ్లూరులో రైతులు రోడ్డెక్కారు. పురుగుల మందు డ బ్బాలతో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని కోరారు. తమ సమస్య పరిష్కారమయ్యే వరకూ రహదారులు దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. దీంతో విజయవాడ-అమరావతి మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జగన్ ప్రకటనకు నిరసనగా గుంటూరు లాడ్జి చౌరస్తాలో తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పడవచ్చంటూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి నిన్న కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో రాజధాని అంశంపై ప్రభుత్వ ఆలోచన ఏంటో సూత్రప్రాయంగా స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో మూడు రాజధానులు రావచ్చన్న సీఎం ప్రకటన రాష్ట్రంలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి పేర్కొన్న ఆ మూడూ… కార్యనిర్వాహక (ఎగ్జిక్యూటివ్), శాసన (లెజిస్లేటివ్), న్యాయ (జ్యుడిషియరీ) రాజధానులు. కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో ప్రభుత్వ పాలనా కార్యాలయాలు, అమరావతిలో చట్ట సభలు, కర్నూలులో హైకోర్టు రావచ్చని సీఎం చెప్పారు.
ఎపి రాజధానిపై ప్రకంపనలు
RELATED ARTICLES