త్వరలోనే భూముల ధర పెంపు
10 నుంచి 100 శాతం వరకు పెరిగే అవకాశం
రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీలపై ప్రభావం
ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
హైదరాబాద్ : త్వరలో భూములకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు పెరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత మొట్ట మొదటిసారి ప్రభుత్వం భూముల ధరలను పెంచే యోచనలో ఉంది. సాధారణంగా భూముల ధరలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధర, మరొకటి మార్కెట్ ధర. ప్రభుత్వ ధర కంటే మార్కెట్ ధర ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వ ధరకే రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా కొనుగోలుదారులు లబ్ది పొందుతున్నారు. ఈ రకంగా కోల్పోతున్న ఆదాయాన్ని దక్కించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూములకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలను పెంచనుంది. చివరి సారిగా 2013లో భూముల ధరలు పెంచారు. తాజాగా భూముల ధర కనీసం 25 శాతం పెరగనున్నాయి. ప్రభుత్వ, మార్కెట్ ధరల మధ్య తేడా ఆధారంగా వాణిజ్య, పట్టణ, గ్రామీణ భూముల ధరలు 10 నుంచి 100 శాతం వరకు పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. పెరిగే భూముల ధరల ప్రభావం రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీలపై కూడా పడనుంది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భూముల ధర పెంపు విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఆ సందర్భంగా భూముల వివరాలు, వాటి ధరలు, పెంపు ప్రతిపాదనల గురించి అధికారులు వివరించారు. భూముల ధరల పెంపు విషయంలో మరింత పకడ్బందీగా, మెరుగైన ప్రతిపాదనలు రూపొందించాలని సిఎం కెసిఆర్ సూచించారు. దీంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు కసరత్తును మొదలుపెట్టారు. సంబంధిత అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చర్చలు జరిపారు. అన్ని రకాల అభిప్రాయాలను క్రోడీకరించి తాజా ప్రతిపాదనలతో త్వరలో సిఎం కెసిఆర్‌కు ఒక నివేదికను సమర్పించనున్నారు. ఇందు కోసం అన్ని జిల్లాల్లో త్రిసభ్య కమిటీలు వేయనున్నారు. కమిటీ సభ్యులుగా జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ రిజిస్ట్రార్లు, సబ్ కలెక్టర్లు ఉంటారు. కమిటీల సిఫారసు మేరకు సగటున కనీసం 25 శాతం భూముల ధరలు పెరగనున్నాయని సమాచారం. చివరిసారిగా 2013 ఆగస్టులో భూముల ధరలు పెరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో భూముల అభివృద్ధి గణనీయంగా పెరిగిపోవడం, హైదరాబాద్‌తో రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రధాన కేంద్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెరిగిపోవడం, నగరాలు, పట్టణాలు విస్తరించడంతో వాటి విలువను కూడా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉండగా భూముల ధరల పెంపుపై రియల్ ఎస్టేట్ వర్గాలతో ఇప్పటికే చర్చలు జరిపిన అధికార యంత్రాంగం వారి అభిప్రాయం మేరకు ఆకర్షణీయమైన స్టాంపు డ్యూటీ స్కీమ్‌ను ప్రకటించే అవకాశముందంటున్నారు. భూముల రిజిస్ట్రేషన్‌పై కనీస కట్ ఆఫ్ వరకు 6 శాతాన్ని, ఆ తరవాత పెరిగే మొత్తం రిజిస్ట్రేషన్ చార్జీలపై 5 శాతం మాత్రమే స్టాంప్ డ్యూటీ విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రతిపాదనలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలిపినట్లు రియల్టర్ల సమాచారం. సిఎం కెసిఆర్ ఆమోదం అనంతరం భూముల ధరలను త్వరలోనే రెవెన్యూ శాఖ నోటిఫై చేయనుంది.
భూముల ్ర్తట్టింపు!
RELATED ARTICLES