మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను తెలియజేసేందుకు గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ రెండవ పెద్దపార్టీ శివసేనకు సోమవారం సాయంత్రం 7గంటల వరకు ఇచ్చిన గడువులోగా స్పష్టత రాకపోవటం, మరో 48 గంటల వ్యవధి ఇచ్చేందుకు గవర్నర్ నిరాకరించటం, మూడవ పెద్దపార్టీ ఎన్‌సిపిని పిలిచి వ్వటం రాష్ట్ర రాజకీయాల్లోని సంక్లిష్టతకు నిదర్శనం. మోడీ ప్రభుత్వంలోని సేన ఏకైక మంత్రి అరవింద్ సావంత్ రాజీనామాతో శివసేన ఎన్‌డిఎ నుంచి వైదొలినట్లయింది. శివసేన, ఎన్‌సిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని, వెలుపల నుంచి కాంగ్రెస్ తోడ్పాటిస్తుందని ఊహాగానాలు బలపడ్డాయి. అయితే ఉద యం కాంగ్రెస్ వర్కింగ్ కమిటితో, సాయంత్రం మహారాష్ట్ర నాయకులతో చర్చల అనంతరం అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్‌సిపితో మరికొంత చర్చించాలని నిర్ణయించారు. దీనితో శివసేన ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలకు బ్రేక్ పడింది. గవర్నర్‌ను గడువులోగా కలిసిన శివసేన, ఎన్‌సిపి నాయకులు మరో 48 గంట ల వ్యవధికోరినా గవర్నర్ అంగీకరించలేదు. వాస్తవానికి మహారాష్ట్ర ఓటర్లు బిజెపి, శివసేన కూటమికి మెజారిటీ (వరుసగా 105; 56 సీట్లు) ఇచ్చారు. అయితే శివసేనకు అంతకుక్రితం అంగీకారం ప్రకారం రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బిజెపి నిరాకరించటంతో ఆ సైద్ధాంతిక మిత్రుల బంధం బెడిసింది. ఎన్‌సిపి (54), కాంగ్రెస్ (44)లతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ప్రయత్నాలు మొదలు పెట్టింది. పచ్చి హిందూత్వపార్టీ, స్థానికవాదపార్టీ అయిన శివసేన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం తమకు దేశ వ్యాప్తంగా నష్టం చేస్తుందని, తాము నమ్మిన విలువలకు విఘాతం ఏర్పడుతుందని కాంగ్రెస్ దీర్ఘాలోచనలో పడినట్లుంది.
గవర్నర్ పెద్ద పార్టీగా ముందుగా బిజెపికి అవకాశమివ్వగా అది అశక్తత తెలియజేసింది. బిజెపి శివసేన సహజ మిత్రులు. వారిది 30 ఏళ్ల బంధం. అయినా ఆధిక్యపోరులో వారిదెప్పుడూ కలహ కాపురమే. హిందూత్వ సైద్ధాంతిక మమేకత వారిని దగ్గరకు చేర్చితే, ఆ రాజకీయ పలుకుబడి క్షేత్రం కొరకు, ఆధిపత్యం కొరకు పోటీ వాటి మధ్య వైరానికి హేతువుగా ఉంది. 1989 లోక్‌సభ ఎన్నికల ముందు అవి హిందూత్వ ఎజెండాతో తొలిసారి రాజకీయ పొత్తు పెట్టుకోవటంతో వాటి మధ్య ప్రేమ ద్వేషం ప్రయాణానికి అంకురార్పణ జరిగింది. కీ.శే. ప్రమోద్ మహాజన బిజెపి తరఫున సూత్రధారి. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రేతో ఆయనకు మంచి సంబంధాలుండేవి. కాంగ్రెస్‌కు బలమైన మహారాష్ట్రలో అప్పటికి బిజెపి ఉనికి అల్పం. ప్రాంతీయ పార్టీ వీపుమీద ఎక్కి బలపడవచ్చునని బిజెపి భావించగా, దాని హిందూత్వ ఆకర్షణను అనుకూలంగా వాడుకోవచ్చునని శివసేన ఆశించింది. 1989 లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీగా బిజెపి ఎక్కువ సీట్లుకు పోటీచేయగా, మరుసటి సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో సేన అత్యధిక సీట్లకు పోటీ చేసింది. సేన 183 సీట్లకు పోటీ చేసి 52 గెలవగా, బిజెపి 104 సీట్లలో 42 గెలిచింది. 1995 అసెంబ్లీ ఎన్నికల నాటికి డిసెంబర్‌లో బాబ్రీ మసీదు కూల్చివేత, 1993 బొంబాయిలో బాంబు పేలుళ్ల ఘటనలను కాషాయ మిత్రులు సమాజాన్ని మత మార్గాల్లో విభజించేందుకు గట్టిగా ఉపయోగించుకున్నారు. సేన 73, బిజెపి 65 సీట్లు గెలుపొందాయి. మనోహర్ జోషి (సేన) ముఖ్యమంత్రి కాగా గోపీనాథ్ ముండే (బిజెపి) ఆయన డిప్యూటీగా హోంమంత్రి అయినారు. ఇదిలావుండగా తదుపరి ఎన్నికల అనంతరం శరద్‌పవార్ (ఎన్‌సిపి) కాంగ్రెస్ విలాస్‌రావు దేశ్‌ముఖ్ ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సేన, బిజెపి అనేక అంశాలపై విభేదించాయి. మహారాష్ట్రలో 100 శాతం బిజెపి ఆకాంక్షను ప్రమోద్ మహాజన్ ప్రకటించటం రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతను పెంచిం ది. ‘శివసేన కారణంగానే రాష్ట్రంలో కమలం వికసిస్తోంది’ అన్నది థాక్రే జవా బు. అయినా 2004 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు మరలా సర్దుబాటుకు వ చ్చాయి. సేన 62, బిజెపి 52 సీట్లు గెలిచాయి. అయితే 2005లో సేన ప్రభుత్వ పూర్వ ముఖ్యమంత్రి డజన్ సేన ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని కాంగ్రె స్ గూటికి చేరారు. ప్రతిపక్షనాయక పదవి కొరకు బిజెపి ప్రయత్నం ఫలించలేదు.
మరో ఆసక్తిదాయక అంశం ఏమంటే, 2002లో ప్రధాని వాజ్‌పేయి గుజరాత్‌లో నరేంద్రమోడీకి ‘రాజ్‌ధర్మ’ బోధించినపుడు థాక్రే మోడీని సమర్థించాడు. ‘ మోడీ గయాతో గుజరాత్ గయా’ అని ఆయన వ్యాఖ్యానించాడు. అయితే మోడీ కొత్త ‘హిందూ హృదయ సామ్రాట్’గా ఎదగటంతో మహారాష్ట్ర అలయెన్స్‌లో తులాదండం నిర్ణయాత్మకంగా బిజెపి వైపు మొగ్గింది. 2014 లోక్‌సభ సభ ఎన్నికల్లో మోడీ గాలితో ధీమా పెంచుకున్న బిజెపి ఎక్కువ అసెంబ్లీ సీట్లకు పట్టుబట్టింది. దాంతో పాతికేళ్లుగా మిత్రులుగా ఉన్న సేన ఎవరికి వారు పోటీ చేయగా, కాంగ్రెస్ ఎన్‌సిపి కూడా వేర్వేరుగా పోటీ చేశాయి. ఈ బహుముఖ పోటీలో, మోడీ ప్రభావంతో బిజెపి 122 సీట్లు దక్కించుకోగా, శివసేన 63 కు పరిమితమైంది. దేవేంద్ర పఢ్నావిస్ ముఖ్యమంత్రి అయినారు. తర్వాత కొద్ది నెలలకు సేన ఆ ప్రభుత్వంలో భాగస్వామి అయింది. 12 అప్రధాన శాఖలు లభించాయి. కేంద్రం, రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామిగా ఉంటూనే శివసేన ఆ నాటి నుంచి బిజెపి ప్రభుత్వాలపై నోట్లరద్దు, రఫేల్ ఒప్పందం, రైతులకు రుణమాఫీ ఇలాంటి అనేక అంశాలపై నిరంతరం విమర్శలు గుప్పిస్తూనే ఉంది. రెండవ స్థానంలోకి నెట్టవేయబడిన పరిస్థితితో మానసికంగా అది రాజీపడలేకపోయింది. బిజెపితో పాతిక సంవత్సరాలు వృధా చేసుకున్నామని ఉద్దావ్ థాక్రే వ్యాఖానించారు. బృహన్ ముంబయి కార్పొరేషన్ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ పడ్డారు.
అయితే 2019 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండగా, ఒక్కటిగా పోటీ చేయాల్సిన అవసరాన్ని రెండు పార్టీలు మళ్లీ గుర్తించాయి. అమిత్ షా రాజీ కుదిర్చారు. లోక్‌సభలో మెజారిటీ సాధనపై అప్పుడు బిజెపికి నమ్మకం లేదనటానికి ఇదే ఉదాహరణ. రాష్ట్ర ప్రభుత్వంలో “పదవులు, బాధ్యతలు” సమానంగా ఉంటాయని పఢ్నావిస్ ఫిబ్రవరిలో ప్రకటించారు. అయితే మోడీ గాలి ఇంకా ఉందని లోక్‌సభ ఫలితాల్లో తేలడంతో అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన తక్కువ సీట్లకు అంగీకరించక తప్పలేదు. కాగా మహారాష్ట్ర ఓటర్లు బిజెపిని 122 నుంచి 105 సీట్లకు, శివసేన సంఖ్యా బలాన్ని 63 నుంచి 56కు తగ్గించారు. దాంతో శివసేన ఆదేశించే అవకాశం పొందింది. ముఖ్యమంత్రి పదవిని కూడా చెరి రెండున్నర సంవత్సరాలు పంచుకోవాలని, ముందుగా తమకు అవకాశమివ్వాలని పీటముడి వేసి కూర్చుంది. బిజెపి ఐదేళ్ల ముఖ్యమంత్రి పదవి తమదేనని, ముఖ్యమంత్రి పదవిని పంచుకునే ఒప్పందమేదీ లేదంటూ బెట్టువీడి మెట్టుదిగకపోవటంతో, శివసేన కేంద్ర ప్రభుత్వంలోని తమ మంత్రిచేత సోమవారం రాజీనామా చేయించి ఎన్‌డిఎ నుంచి వైదొలిగింది.
మహారాష్ట్రలో వీడని చిక్కుముడి
RELATED ARTICLES