HomeOpinionArticlesఅయోధ్య వివాదానికి తెర

అయోధ్య వివాదానికి తెర

అయోధ్యలోని రామజన్మభూమి స్థల వివాదానికి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తెరదించింది. వివాద ప్రదేశం 2.77 ఎకరాలపై  హక్కును ఆలయ నిర్మాణానికై శ్రీరాముని ప్రతినిధులకు దఖలు పరుస్తూ, అందుకు పరిహారంగా ముస్లింలకు మసీదు నిర్మాణానికై అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం మంజూరు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వం వహించిన ఐదుగురు న్యాయమూర్తుల బెంచి వెలువరించిన “ఏకగ్రీవ” తీర్పులో కక్షిదారులైన హిందూ, ముస్లిం ప్రతినిధులనేగాక దేశంలోని యావన్మంది ప్రజల విశ్వాసాలను, మనోభావాలను సంతృప్తి పరిచే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ “చరిత్రాత్మక” తీర్పు ఇచ్చిన బెంచిలోని ఇతర సభ్యులు ఎస్‌.ఎ.బాబ్డే, డివై చంద్రచూడ్‌, అశోక్‌ భూషణ్‌, ఎస్‌.ఎ. నజీర్‌. బెంచి తరఫున తీర్పు చదివిన గొగోయ్‌ తాము సాక్ష్యాల ఆధారంగానే నిర్థారణలకు వచ్చినట్లు చెప్పినప్పటికీ మెజారిటీ ప్రజల గాఢమైన విశ్వాసాలను, దేశంలోని రాజకీయ పరిస్థితులను కూడా గమనంలోకి తీసుకున్నారని భావించవచ్చు. అందువల్ల “తులనాత్మక” తీర్పు చెప్పారు. ఈ తీర్పును బిజెపి నుంచి కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల వరకు యావత్‌ రాజకీయ పార్టీలు, ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి ముస్లిం సంస్థల వరకు హర్షించాయి. తీర్పు ఎటొచ్చినా అసంతృప్తి జీవులెవరూ “కవ్వింపుచర్యలకు” పాల్పడకుండా అత్యున్నత న్యాయస్థానం తీర్పును గౌరవించాలని అంతకుముందు వారంరోజులుగా ప్రధాని నుండి మతపెద్దల వరకు చేస్తున్న విజ్ఞప్తులు, తీర్పును గౌరవిస్తామన్న  రాజకీయ ప్రకటనలు, సున్నితమైన ప్రాంతాల్లో ముందుజాగ్రత్తగా పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించటం, విశ్లేషణల్లో మీడియా సంయమనం వగైరా భావోద్వేగాలకు తావులేని పరిస్థితులకు దోహదం చేశాయి. తీర్పుపట్ల తమకు కొన్ని మినహాయింపులున్నప్పటికీ దాన్ని గౌరవిస్తున్నామని, సమష్టి చర్చ అనంతరం రెవ్యూ పిటిషన్‌ దాఖలు చేసే విషయమై నిర్ణయం తీసుకుంటామని ముస్లిం పర్సనల్‌ లా బోర్డు తరఫు న్యాయవాది చెప్పటం గమనార్హం. తమ విశ్వాసం ప్రకారం ‘రామజన్మభూమి’ ప్రదేశంలో దివ్యమైన ఆలయం నిర్మించాలన్న తమ ఆకాంక్ష నెరవేరుతున్నందుకు హిందూత్వ సంస్థలు, దాన్ని రాజకీయ ఎజండాలోకి తెచ్చి అపారమైన లబ్దిపొందిన బిజెపి ఎక్కువగా సంతోషించటం సహజం.
19వ శతాబ్దంలో కొన్ని ఉదంతాలున్నప్పటికీ ఈ వివాదం కొన్ని దశాబ్దాలుగా, ముఖ్యంగా  1980వ దశకంలో బిజెపి ఆలయ నిర్మాణాన్ని తమ రాజకీయ ఎజండాగా స్వీకరించినప్పటినుంచి అది దేశంలో మత ఉద్రిక్తతలకు, కలహాలకు, వందలాది మరణాలకు మూలంగా ఉంది.  1992 డిసెంబర్‌  6న కరసేవకుల పేరుతో అయోధ్య చేరిన వేలాదిమంది బిజెపి, విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌దళ్‌ అగ్రనాయకుల సమక్షంలో బాబ్రీమసీదును కూలగొట్టడం పరాకాష్ఠ. 1949 డిసెంబర్‌ 22/23 అర్థరాత్రి కొందరు హిందూత్వ వాదులు, 16వ శతాబ్దంలో బాబర్‌ లేదా అతడి సైన్యాధిపతి నిర్మించాడని చెబుతున్న బాబ్రీమసీదులోపల సెంట్రల్‌ డోమ్‌ కింద (అక్కడే రాముడు జన్మించాడన్నది వారి విశ్వాసం, వాదన) రాముడి విగ్రహం ఉంచిన దరిమిలా బాబ్రీ మసీదు నుండి ముస్లింలు అక్రమంగా బయటకు గెంటివేయబడ్డారు. ఆ విధంగా విగ్రహాలు పెట్టిన చర్యను అపవిత్రమైందిగా కోర్టు పేర్కొన్నది. అలాగే 1992 డిసెంబర్‌ 6న మసీదును కూల్చటాన్ని చట్ట ఉల్లంఘనగా, క్రిమినల్‌ చర్యగా, లౌకిక సూత్రంపై దాడిగా భావించింది. అయితే 27 ఏళ్లుగా ఆ క్రిమినల్‌ కేసు తీర్పు దశకు చేరలేదు. 1949లోగాని, 1992లోగాని హిందూత్వ వాదులు చట్టాన్ని ఉల్లంఘించి బలప్రయోగానికి పాల్పడ్డారని తీర్పు చెప్పినప్పటికీ   నిందితులకు శిక్షలు విధించబడతాయన్న గ్యారంటీ లేదు. సిబిఐ కాడి కింద పడేసింది.
40 రోజులపాటు రోజువారీ విచారణతో చరిత్రలో రెండవ సుదీర్ఘకాల విచారణగా రికార్డు సృష్టించిన జస్టిస్‌ గొగోయ్‌ ధర్మాసనం, వివాద స్థలాన్ని మూడు పక్షాల మధ్య సమానంగా పంచుతూ 2010  లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పును తప్పుపట్టింది. అది భూమిపై హక్కు కేసు తప్ప భాగ పంపిణీ కేసు కాదని వ్యాఖ్యానించింది. స్థల వివాదానికి సంబంధించి  1857లో అవధ్‌ రాజ్యాన్ని బ్రిటిష్‌వారు ఆక్రమించుకోక పూర్వం కూడా అక్కడ హిందువుల ఆరాధన  భావించగల సాక్ష్యాధారాలున్నాయి. బాబ్రీమసీదు 16వ శతాబ్దంలో నిర్మించినప్పటికీ 1857 కు పూర్వం మసీదు ప్రత్యేకించి తమ అధీనంలో ఉన్నట్లు ముస్లింలు సాక్ష్యాలు చూపలేకపోయారని తీర్పు పేర్కొన్నది. హిందువులు అటకాయించడం వల్ల 1949 డిసెంబర్‌ 16న చివరి శుక్రవారం ప్రార్థన జరిగినట్లు 1949  డిసెంబర్‌లో వక్ఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ నివేదిక తెలియజేస్తున్నది.
పురావస్తు శాస్త్ర సంస్థ (ఎఎస్‌ఐ) నిర్ధారణలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దాని ప్రకారం బాబ్రీమసీదును ఖాళీ ప్రదేశంలో నిర్మించలేదు. దాని కింద ఉన్న కట్టడాలు ఇస్లామిక్‌ మూలానికి చెందినవికావు. అయితే అవి హిందూ ఆలయానివని కూడా నిర్థారించలేదు. అవి హిందూ ఆలయానివని అనుకున్నా అది భూమిపై హక్కు కలుగజేయదని కోర్టు పేర్కొన్నది. అయితే ఆ ప్రదేశం రాముడి జన్మస్థానమన్న హిందువుల విశ్వాసం  నిర్వివాదమైందని పేర్కొన్న కోర్టు, రామజన్మభూమి జూరిస్టిక్‌ పర్సనాలిటీ (ఫిర్యాదు చేయగల వ్యక్తి) కాదని, ఆరాధించబడుతున్న రాం లల్లాను (బాల రాముడు) జూరిస్టిక్‌ పర్సనాలిటీగా స్వీకరించింది.
ఆదేశాలు ః అయోధ్యలో నిర్దిష్ట ప్రాంత స్వాధీనచట్టం 1993  కింద దఖలు పడిన అధికారాలను ఉపయోగించి కేంద్రప్రభుత్వం ఈ రోజునుంచి మూడు మాసాలలోపు బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీలను ఏర్పాటు చేయాలి. ఆలయ నిర్మాణం సహా పనులన్నీ దానికి అప్పగించాలి. (అయోధ్యచట్టం కింద కేంద్రప్రభుత్వం వివాద ప్రదేశం చుట్టూ 64 ఎకరాలు సేకరించింది. దాన్ని ఇప్పుడు ఆలయానికి బదిలీచేస్తారు). అదే సమయంలో సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డుకు అనువైన 5 ఎకరాల భూమి కేటాయించాలి. ఆ స్థలంలో మసీదు నిర్మాణానికి చర్యలు తీసుకోవచ్చు. ట్రస్ట్‌ బోర్డులో నిర్మోహి అఖాడాకు కూడా తగు ప్రాతినిధ్యం ఇవ్వాలి.
ఈ తీర్పుతో రామజన్మభూమి అంశం అంతిమ పరిష్కారానికి వచ్చిందని, దేశంలో మత సామరస్యానికి ఇది దోహదం చేస్తుందని ఊహించటాన్ని, ఆశించటాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే అధికారంలో ఉన్న బిజెపి, దాని గురుపీఠం ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూ మెజారిటీ వాదాన్ని స్థిరపరిచేందుకు నిబద్ధులై, చర్యలు తీసుకుంటున్నందున, కొంత ఆలస్యంగానైనా కాశీ, మధుర వివాదాలు తెరపైకి రావని  భావించటం సాధ్యం కాదు.  ‘బాబ్రీ మసీదు కూల్చివేత తొలి కిస్తీ. కాశీ, మధుర బాకీహై’ అనేది అప్పట్లో పరివార్‌ నినాదం. ఇకపై వివాదాలకు అంతం పలకాలంటే ప్రార్థనాలయాల విషయంలో 1947 ఆగస్టు 15నాటి కున్న యథాతథ స్థితి పరిరక్షణకు హామీ ఇస్తూ, 1991లో పార్లమెంటు ఆమోదించిన ప్లేసెస్‌ ఆఫ్‌ రెలిజియస్‌ వర్షిప్‌ చట్టాన్ని ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలి.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments