మొక్కవోని దీక్షతో ఆర్‌టిసి సమ్మె
ఎంఎల్‌ఎలు, అధికారుల ఒత్తిళ్లను ఖాతరు చేయని కార్మికులు
హైదరాబాద్ : ప్రభుత్వ బెదిరింపులకు ఆర్‌టిసి కార్మికులు వెరవడం లేదు. మంగళవారం అర్థరాత్రి వరకు విధుల్లో చేరకపోతే ఇక ఉద్యోగం లేనట్లేనని స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించినా భయపడలేదు. డెడ్‌లైన్ ముగిసేనాటికి సమ్మెలో ఉన్న సుమారు 49వేల ఆర్‌టిసి కార్మికులు, ఉద్యోగుల్లో కేవలం పిడికెడు మందే విధుల్లో చేరారు. వారి సంఖ్య 300 మంది కూడా కాలేదు. అటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు సాగిసుతున్నా విధుల్లో చేరకుండా ఆర్‌టిసి కార్మికులు మొక్కవోని ధైర్యంతో సమ్మె కొనసాగిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్‌టిసి కార్మికులు మొక్కవోని దీక్షతో సమ్మెను కొనసాగిస్తున్నారు. సమ్మె విరమించాలని ప్రభుత్వం, టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రభుత్వ అధికారులు ఇలా అన్ని వైపుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నా కార్మికులు తట్టుకుని నిలబడుతున్నారే తప్ప వెనుకడుగు వేయడం లేదు. “సమ్మె చేస్తున్న కార్మికులు విధుల్లో చేరకపోతే సెల్ఫ్ డిస్మిస్ అయినట్లే. ఇక వారిని ఉద్యోగాల్లోకి తీసుకోం. ఆర్‌టిసిని ప్రైవేటీకరిస్తాం. ఇక వెయ్యి శాతం పాత ఆర్‌టిసి ఉండదు. రూట్లను ప్రైవేటీకరిస్తాం. హైకోర్టు ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదు. ఇచ్చినా సుప్రీంకోర్టుకు వెళతాం” అని రకరకాలుగా ప్రభుత్వం, సిఎం కెసిఆర్ బెదిరింపులకు గురి చేసినా ఎక్కడా కార్మికులు వెనక్కి తగ్గలేదు. ఆర్‌టిసి సమ్మెపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రంగంలోకి దిగి డెడ్‌లైన్లు విధించినా కార్మికులు బెదరలేదు. కార్మికులు ఉద్యోగాల్లో చేరే విధంగా ప్రభుత్వం చేస్తున్న సకల ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు కనబడడం లేదు. ఒక వైపు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను, మరో వైపు టిఆర్‌ఎస్ నేతలను రంగంలోకి దింపి వారితో బెదిరింపులకు గురిచేసినా, భ్రతిమిలాడింపజేసినా సమ్మె చేస్తున్న కార్మికులు ఎక్కడా విధుల్లో చేరలేదు. కొంత మంది టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు తమకు తెలిసిన ఆర్‌టిసి కార్మికుల బంధువులకు ఫోన్లు చేసి వారిని విధుల్లో చేరాలని కోరుతున్నా ఉపయోగం లేకుండా పోతున్నది. చివరకు సమ్మె చేస్తున్న కార్మికులను వివిధ సాకుతలో అరెస్ట్‌లు చేసి పోలీసు స్టేషన్లలో పెడుతున్నా కార్మికులు భయపడడం లేదు. సిఎం బెదిరింపులకు భయపడి పదుల సంఖ్యలో విధుల్లో చేరేందుకు లేఖలు ఇచ్చిన కార్మికులు సైతం వేలాది సంఖ్యలో ఇతర కార్మికులు కొనసాగిస్తున్న ఉద్యమ స్పూర్తిని ఆదర్శంగా తీసుకుని తిరిగి సమ్మెలోకి వచ్చారు. సమ్మె చేస్తున్న ఆర్‌టిసి కార్మికులతో చర్చలు జరిపి పరిష్కరించాలని కోర్టు సూచించింది. ఆర్‌టిసిపై అధికారులు చెబుతున్న సమాచారం తప్పుల తడకగా ఉనాన్నాయని కోర్టు ఎత్తిచూపింది. పైగా ఆర్‌టిసి నష్టాలు, అప్పులుపై రవాణా శాఖ, ఆర్‌టిసి ఉన్నతాధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతుండడం, ప్రభుత్వ న్యాయవాదుల వాదనపై పట్ల హైకోర్టు ఆగ్రహం కూడా వ్యవక్తం చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది. చివరకు ఆర్‌టిసి సమ్మెపై ప్రభుత్వ అధికారులు ఇస్తున్న సమాచారంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ మంత్రి ఈ నెల 7వ తేదీన కోర్టుకు హజరు కావాలని ఆదేశించింది. ఈ పరిస్థితి నుంచి తప్పిసంచుకునేందుకు సిఎం కెసిఆర్ మరోసారి కార్మికులు విధుల్లో చేరేందుకు ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రిని డెడ్‌లైన్ విధించారు. పైగా ఆర్‌టిసి డిప్లోల్లో కాకుండా పోలీసు స్టేషన్లు, ఆర్‌డిఓ కార్యాలయాలు, ఆర్‌ఎం కార్యాలయాలు ఇలా రకరకాల కార్యాలయాల్లో కార్మికులు విధుల్లో చేరుతున్నట్లు లేఖలు ఇవ్వవచ్చని ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది. తద్వారా కార్మికులు దిగివస్తే వారు విధుల్లో చేరారని చూపించి కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయినా ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ వరకు 48 వేట మంది కార్మికుల్లో పట్టుమని అర శాతం కూడా విధుల్లో చేరలేదు. మంగళవారం రాత్రి వరకు అందిన సమాచారం మేరకు కేవలం 300 మంది మాత్రమే విధుల్లో చేరినట్లు సమాచారం. అయితే తక్కువ సంఖ్యలోనే కార్మికులు విధుల్లో చేరడంతో ఆర్‌టిసి అధికారులు విధుల్లో చేరిన కార్మికుల వివరాలు చెప్పేందుకు వెనుకాడుతున్నారు. పట్టుసడలకుండా సమ్మె చేస్తున్న ఆర్‌టిసి కార్మికులకు సమాజంలోని అన్ని వర్గాల నుంచి మద్దతు నిత్యం పెరుగుతున్నది.
ఫలించని ముఖ్యమంత్రి బెదిరింపు డెడ్‌లైన్
RELATED ARTICLES