అధికారులు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు
హుజూర్‌నగర్‌కు రూ. 100 కోట్లు ప్రకటించిన సర్కార్.. ఆర్టిసికి రూ. 47 కోట్లు ఇవ్వలేదా?
ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు
అధికారుల గణాంకాలపై అసహనం
హైదరాబాద్ : ‘ఆర్టిసి కూడా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేది. ఎక్కడైనా ఆర్టిసిపైనే ప్రజలు ప్రయాణాలు చేస్తుంటారు. విద్య,వైద్యం, సంక్షేమం వంటి వాటికి ఎంతగా ప్రాధాన్యత ఇస్తారో ప్రజాసంక్షేమం కోసం ఆర్టిసి ఇవ్వాలి. హుజూర్నగర్ ఫలితాల తర్వాత ప్రభుత్వం వంద కోట్ల రూపాయల్ని అక్కడి అభివృద్ధి కోసం ప్రకటించింది. ఆర్టిసి కార్మికుల 4 మెయిన్ డిమాండ్ల సాధనకు రూ.47 కోట్లు ఇవ్వాలంటే ఆర్థిక మాద్యం అంటున్నారు. పైగా ఆర్టిసి అప్పు తీసుకునేందుకు రూ.850 కోట్లకు గ్యారెంటీగా ఉంటే దానిని కూడా ఆర్థికంగా ఆదుకున్నట్లు ప్రభుత్వం చెప్పుకోవడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. బాకాయిలన్నీ ఇవ్వడమే కాకుండా రూ.620కోట్లు ఎక్కువగా ఇచ్చామని ప్రభు త్వం చెబుతోంది.ఇది ఎలా ఉందంటే.. ఒకరి దగ్గర తీసుకున్న అప్పు తిరిగి చెల్లించేప్పుడు వాళ్ల ఇంట్లో వివా హం ఉందని చెప్పి అప్పుకు అదనంగా మరో రెండు లక్షలు కలిపి ఇచ్చిన దానిని కానుక అనాలా లేక తిరిగి అప్పు ఇచ్చిన వ్యక్తికే అప్పు ఇవ్వడమనాలా’ అని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టిసి సమ్మెకు వ్యతిరేకంగా ఒయు రీసెర్చ్ స్కాలర్ సుబేందర్‌సింగ్ దాఖలు చేసిన పిల్‌ను సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది. ఆర్టిసి కార్పొరేషన్‌కు ప్రభుత్వం ముందుగానే బకాయిల్ని చెల్లించిందని,ఆర్టిసి యూనియన్లు డిమాం డ్ చేస్తున్నట్లుగా ప్రభుత్వం ఆర్థిక బకాయిలు ఏమీ లేదని, ఇప్పటి చెల్లించి వాటిని, బకాయిల్ని బేరీజు వేస్తే రూ.620 కోట్లకుపైగా ప్రభుత్వం ముందుగా చెల్లించిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. దీంతో ఆర్టిసికి ప్రభుత్వం నుంచి అన్ని బకాయిలు వచ్చాయో లేదో, ఇంకేమైనా బాకాయిలు ఉన్నా యో లేదో తెలియజేయాలని ఆర్టిసి కార్పొరేషన్ ఎండి చెప్పాలని హైకోర్టు ఆదేశించింది.ఆర్టిసి ఆస్తులు, అప్పు ల విభజన జరగలేదని, ఇది చేయాల్సింది కేంద్రమని కూడా ప్రభుత్వం చెప్పడంతో దీని విషయంలో కేంద్రం జవాబు చెప్పాలని హైకోర్టు నోటీసులిచ్చింది. ఈకేసులో కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చి నోటీసు జారీ చేసింది.
అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వాదిస్తూ.. ఆర్టిసికి బకాయిల చెల్లింపులుగానీ, జిహెచ్ఎంసి బకాయిలుగానీ అన్నింటినీ చెల్లించి ప్రభుత్వం పూర్తి బాధ్యతగా వ్యవహరించిందన్నారు. ఆర్థికమాద్యం నేపథ్యంలో హైకోర్టు కోరిన విధంగా రూ.47 కోట్లను విడుదల చేసేందుకు సమయం పడుతుందన్నారు. ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను రూ.1.82 లక్షల కోట్ల నుంచి రూ.1.46 లక్షల కోట్లకు తగ్గించుకుందని చెప్పారు. ఇప్పుడు వస్తున్న ఆదాయం విద్య,వైద్యం,సంక్షేమం వంటి రోజు వారీ అవసరాలకు సరిపోతుందని, ఇన్ని ఇబ్బందులున్నా ఆర్టిసికి కేటాయించిన బడ్జెట్లో రూ.550 కోట్లకుగాను రూ.425 కోట్లు చెల్లించిందని, మిగిలిన రూ.125 కోట్లను వచ్చే మార్చిలోగా విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పా రు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఎపిఎస్ ఆర్టిసి విభజన జరగలేదని, దీని వల్ల ఆస్తులు విభజన జరగలేదని, దీనిపై కేంద్రం చర్యలు తీసుకోవాలని నిన్ననే కేంద్రానికి లేఖ రాశామని, ఆర్టిసిలో కేంద్రానికి 31 శాతం వాటా ఉందన్నారు.2009 నుంచి 2013 మధ్యకాలంలో రూ.1099 కోట్లు రీయింబర్స్మెంట్ చెల్లింపులు జరిగాయన్నారు. 2018 వరకూ రూ.1375 కోట్ల రీయింబర్స్ చేయాలని ఆర్టిసి కోరిందని,అయితే ప్రభుత్వం బడ్జెట్ ద్వారా రూ.3403.36 కోట్లు ఆర్టిసికి విడుదల చేసిందన్నారు. ఆర్టిసి రూ.850 కోట్లు అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారెంటీ కూడా ఇచ్చిందని, దీంతో కలిపి రూ.4253.36 కోట్లు ప్రభుత్వం ఆర్టిసికి ఆర్థికంగా అండగా నిలిచిందన్నారు. జిహెచ్ఎంసి చట్టబద్ధంగా రూ.1492 కోట్లు చెల్లించాలని, రూ.335 కోట్లు చెల్లించిందని, ముందుగానే ఆర్టిసికి ప్రభుత్వం ఇచ్చినందున జిహెచ్ఎంసి చెల్లించాల్సినది లేదన్నారు. ఆ మూడింటినీ కలిపితే రూ.3966 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి రూ.4253 కోట్లను చెల్లించిందని, ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక లెక్కల్ని పరిశీలిస్తే పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించాలని చెబుతున్న దానికంటే రూ.622 కోట్లు ఎక్కువగా సర్కార్ ఇచ్చిందని ఏజీ చెప్పారు. 2019 ఆర్థిక సంవత్సరంలో వచ్చే మార్చి నాటికి రూ.125 కోట్లు చెల్లించాల్సివుందన్నారు.
హైకోర్టు స్పందిస్తూ.. ఒకరికి రూ.3 లక్షలు అప్పు ఉన్న వ్యక్తి పెళ్లి ఉందని చెప్పి అప్పు తీర్చేప్పుడు రూ.5 లక్షలు తిరిగి ఇస్తే మిగిలిన రు.2 లక్షలు కానుకగా ఇచ్చినట్లు అవుతుందా, తిరిగి ఆవ్యక్తి అప్పుతీసుకున్న వాడు అప్పు ఇచ్చినట్లా అని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి తగిన జవాబు రాలేదు. ఆర్టిసి విభజన జరగలేదని, అప్పులు, ఆస్తులను విభజన చేయాల్సింది కేంద్ర సర్కార్ అని ఎజి చెప్పారు. వాటి విభజన తేల్చడం కష్టం అవుతుందేమోగానీ జనభా లెక్కల ప్రకారం తెలంగాణకు 42 శాతం మిగిలింది ఎపికి ఇచ్చే పద్ధతిలో ఆర్టిసి అప్పుల్ని పంచుకోవచ్చు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. బకాయిలు చెల్లించామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అఫిడవిట్లో చెప్పారేగానీ ఆర్టిసికి బకాయిలు చెల్లించాల్సినవి ఏమీ లేవని మాత్రం చెప్పలేదని హైకోర్టు తప్పుపట్టింది. ఆర్టిసి అప్పు తీసుకునేందుకు రూ.850 కోట్లకు సర్కార్ గ్యారెంటీ ఇవ్వడాన్ని కూడా ఆర్థిక తోర్పాటు అంటే ఏమనాలని ప్రశ్నించింది. ఆ అప్పుపై ఒక నయాపైసా కూడా సర్కార్ చెల్లించనప్పుడు ఏవిధంగా ఆర్థిక తోర్పాటు అవుతుందని ప్రశ్నించింది. అప్పు పుట్టడానికి గ్యారెంటీ ఇచ్చి ఏదో చేశామంటే ఏమనుకోవాలని ఆక్షేపించింది. ఎపి రీఆర్గనైజేషన్ యాక్ట్‌లోని సెక్షన్ 53 ప్రకారం ఆర్టిసి విషయంలో కేంద్రం ఎందుకు ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదో, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు చొరవ చూపలేదో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించింది. రూ.47 కోట్లు ఇస్తే నాలుగు మెయిన్ డిమాండ్లు పరిష్కారం అవుతాయని హైకోర్టు చెప్పగానే, ఆర్థిక మాద్యం ప్రభావం వల్ల ఇప్పుడే ఇవ్వలేమని ఏజీ చెప్పారు. ప్రభుత్వానికి విద్య,వైద్యం వంటి ప్రాధాన్యత రంగాలకు వచ్చే ఆదాయం సరిపోతుందని చెప్పగానే.. ఆర్టిసి కూడా ప్రజలకు చెందిన రవాణా వ్యవస్థ అని మరిచిపోరాదని హైకోర్టు గుర్తు చేసింది. హుజూర్నగర్ అంత చిన్న ప్రాంతానికి ఇచ్చిన నిధులు ఆర్టిసికి ఇస్తే తెలంగాణ అంతటికీ ఉపయోగం అవుతుందని అభిప్రాయపడింది. ప్రభుత్వం బాకాయిలు చెల్లించినట్లు చెప్పిందేగానీ ఇంకా బకాయిలు ఉన్నాయో లేదో చెప్పలేదని, ఈ లెక్కలు చెప్పి ఆర్థిక శాఖ అధికారి అంకెలతో ఆడుకున్నట్లుగా అనిపిస్తోందని బెంచ్ వ్యాఖ్యానించింది. ఆ అధికారి చిత్తశుద్ధితో వివరాలు అందజేస్తారని ఆశిస్తే లెక్కలతో ఆడుకున్నారని ఆక్షేపించింది. సమ్మె విరమించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ లాయర్ కోరారు. దీంతో హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఒక పక్క సమ్మె చట్ట విరుద్ధమని పిల్ వేసి మరో పక్క సమ్మె విరమించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వేరువేరు వాదనలు చేయడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. సమ్మె విరమించమంటే విరమిస్తారా.. సమస్యను సానుకూలంగా పరిష్కరించి ప్రజలకు ఆర్టిసికి మేలు జరిగేలా చేయాలన్నదే తమ అభిమతమని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ నవంబర్ 1కి వాయిదా వేసింది.
ఇవేం లెక్కలు?
RELATED ARTICLES