ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, వైఎస్ జగన్, సిపిఐ నేతలు, సురవరం, డి. రాజా ప్రభృతులు సంతాపం
ప్రజాపక్షం / హైదరాబాద్ / విజయవాడ : అక్షర చక్రవర్తి, విశాలాంధ్ర పూర్వ సంపాదకులు సీనియర్ కమ్యూనిస్టు చక్రవర్తుల రాఘవాచారి (81) సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాసవిడిచారు. కొంత కాలంగా అస్వస్థులుగా ఉండి చికిత్సపొందుతున్నారు. ఆయనకు భార్య జ్యోత్స, కుమార్తె డాక్టర్ అనుపమ ఉన్నారు. ఆయన మృతికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతూ పత్రికారంగానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్, విజయవాడ విశాలాంధ్ర కార్యాలయం చంద్రంబిల్డింగ్స్ వద్ద పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు, వివిధ వర్గాల వారు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. భౌతికకాయాన్ని పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీకి అప్పగించారు.
మఖ్దూంభవన్‌లో నివాళి : రాఘవాచారి భౌతికకాయాన్ని ప్రజల దర్శనార్థం ఉదయం 7 గంటల నుంచి 10ః30 గంటల వరకు మఖ్దూంభవన్‌లో ఉంచారు. రాఘవాచారి భౌతికకాయంపై సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, కార్యాదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్‌పాషా అరుణపతాకాన్ని కప్పి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఐ, సిపిఐ(ఎం) నాయకులు, వివిధ పత్రికల సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులర్పించిన వారిలో ప్రజాపక్షం సంపాదకులు కె.శ్రీనివాస్‌రెడ్డి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, నమస్తే తెలంగాణ సంపాదకులు కట్టా శేఖర్‌రెడ్డి, నవ తెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అంతర్రాష్ట్ర, జాతీయ మీడియా సలహాదారులు దేవులపల్లి అమర్, ఎపి పబ్లిక్ పాలసీ సలహాదారులు కె.రామచంద్రమూర్తి, ఐజెయు నాయకులు కె.అమర్నాథ్, కె.సత్యనారాయణ, వై.నరేందర్‌రెడ్డి, వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు అమరయ్య, కొండయ్య, బసవపున్నయ్య, సో మయ్య, ఆనందం తదితరులు ఉన్నారు. అలాగే సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ స భ్యులు పాటూరి రామయ్య, జి. నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.జి. నరసింహారావు, బి.వెంకట్ తదితరులు రాఘావాచారికి నివాళులు అర్పించా రు. అనంతరం భౌతికకాయాన్ని అంబులెన్స్‌లో విజయవాడకు తరలించారు.
జీవిత పయనం : తోటి జర్నలిస్టులు, రచయితలు, వివిధ వర్గాల మేధావులు ఆయనను ‘నడుస్తున్న విజ్ఞానసర్వస్వం’ అని గర్వంగా పిలుచుకునే చక్రవర్తుల రాఘవాచారి వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురంలో వరదాచార్యులు – కనకవల్లి దంపతులకు 1939 సెప్టెంబరు 10వ తేదీన జన్మించారు. రాఘవాచారి పూర్తి వైష్ణవ సాంప్రదాయంలో పెరిగారు. ఐదారేళ్ల వయస్సులోనే ఇంటి దగ్గర ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా తెలుగు, సంస్కృతం, ఉర్దూ భాషలను అభ్యసించారు. దానితో తెలుగు పద్యాలు, సంస్కృత శ్లోకాలు అలవోకగా ధారణ చేయగలిగారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో సంఘం కార్యకర్తల (కమ్యూనిస్టు కార్యకర్తల)ను నిర్మూలించే నెపంతో దొరలు ఊరినే కాల్చివేయడంతో రాఘవాచారి కుటుంబం ఆయన తల్లిగారి ఊరైన కృష్ణాజిల్లా మాని కొండకు పొరుగునున్న బొకినాల అగ్రహారానికి మారింది. అక్కడ ఏబీసీడీలు నేర్చుకున్నప్పటికీ ప్రధానంగా చదువు సంస్కృతాభ్యాసనానికే పరిమితమైంది. గుంటూరు జిల్లా పొన్నూరు భావనారా యణ సంస్క త కళాశాలలో సంపత్‌కు మారాచార్య, చల్లా సత్యనారాయణ శాస్త్రి వద్ద పంచకావ్యాలు నేర్చారు. 15వ యేటికల్లా ఉర్దూ, సంస్కతంలో రాటుదేలారు. తెలంగాణాలో రజాకార్ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు వీరి కుటుంబం కమ్యూని స్టులకు ఆశ్రయ మిచ్చింది. వీరి తాతగారు నరసింహాచార్యులు గొప్ప ఆయుర్వేద వైద్యులు. ఇంటికి దగ్గరగా పాకలు వేయించి ఆసుపత్రులుగా మార్చి వైద్యసేవ చేశారు.