HomeNewsBreaking Newsసంజుకు చోటు

సంజుకు చోటు

యువ క్రికెటర్‌ శివమ్‌ దూబే కూడా
విరాట్‌కు విశ్రాంతి.. రోహిత్‌కు పగ్గాలు
బంగ్లాతో టి20, టెస్టు సిరీస్‌లకు జట్టు ఎంపిక
పదిలంగా జట్టులో సాహా స్థానం
టెస్టులో బ్యాకప్‌ కీపర్‌గా రిషభ్‌పంత్‌
ముంబయి : బంగ్లాదేశ్‌తో టీ20 సిరిస్‌ నుంచి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. నవంబర్‌ 3 నుంచి ఆరంభమయ్యే ఈ టీ20 సిరిస్‌కు కోహ్లీ స్థానంలో వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు. బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 2 టెస్టులు ఆడనుంది. టీ20 సిరిస్‌ అనంతరం రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు తిరిగి కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. బంగ్లాదేశ్‌తో సిరిస్‌కు జట్టుని ఎంపిక చేసేందుకు గాను ఎమ్మెస్కే ప్రసాద్‌ నాయకత్వంలోని సెలక్షన్‌ కమిటీ గురువారం సమావేశమైంది. వరల్డ్‌ప్‌ తర్వాత నుంచి విరాట్‌ కోహ్లీ విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. కోహ్లీ పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని అతడికి విశ్రాంతినిచ్చారు. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో చివరి రెండు వన్డేలతో పాటు టీ20 సిరీస్‌లో కోహ్లి చివరగా విశ్రాంతి తీసుకున్నాడు. కోహ్లీ స్థానంలో వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు.
పంత్‌కు బ్యాకప్‌ కీపర్‌గా ఛాన్ప్‌..
పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రిషబ్‌ పంత్‌కు బ్యాకప్‌గా మరో వికెట్‌కీపర్‌ను తయారు చేసేందుకు సెలక్టర్లు బంగ్లాదేశ్‌ సిరిస్‌ను తమకు అనుకూలంగా మరల్చుకున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని వారసుడిగా రిషబ్‌ పంత్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. రిషబ్‌ పంత్‌ చాలా ప్రతిభావంతుడు. అలవోకగా సిక్సర్లు బాదగలడు. ఇదంతా కూడా వరల్డ్‌ప్‌కు ముందుమాట. వరల్డ్‌కప్‌ ముందు వరకు తుది జట్టలో రిషభ్‌ పంత్‌కు చోటివ్వకపోతే మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేశారు. అయితే, పంత్‌ స్థానంలో మరొకరిని ఎంపిక చేయాలని వారే కోరుతున్నారు. ఇంగ్లాండ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌ప్‌లో ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌ గాయపడటంతో అనూహ్యంగా చోటు దక్కించుకున్న పంత్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఫరవాలేదనిపించాడు. సెమీస్‌లో కివీస్‌ చేతిలో ఓడటం.. ఆ తర్వాత కోహ్లీసేన విండిస్‌ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో పంత్‌ ప్రదర్శన తీవ్ర విమర్శల పాలైంది. టీమిండియాకు ఎప్పటి నుంచో సమస్యగా మారిన నెం. 4 స్థానంలో పంత్‌ను ఆడిస్తే పేలవ షాట్లకు వికెట్‌ సమర్పించుకుని విమర్శల పాలయ్యాడు. కీలక సమయంలో జట్టుకు అండగా నిలవాల్సిందిపోయి అనవసరపు షాట్లకు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరుకున్నాడు. యువ ఆటగాడు కావడం… అద్భుత ప్రదర్శన దాగి ఉండటంతో తప్పుల నుంచి నేర్చుకుంటాడని అటు జట్టు మేనేజ్‌మెంట్‌తో పాటు ఇటు కెప్టెన్‌, కోచ్‌ సైతం పంత్‌ను వెనుకేసుకొచ్చారు. అయితే, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో సైతం పంత్‌ ఆటతీరులో ఏమాత్రం మార్పు రాలేదు.
వృద్ధిమాన్‌ సాహాకు చోటు
సఫారీలతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ నుంచి రిషబ్‌ పంత్‌ను తప్పించి అతడి స్థానంలో వృద్ధిమాన్‌ సాహాకు చోటు కల్పించారు. సాహా సైతం తనకు అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడంతో మిగతా రెండు టెస్టులకు అతడినే కొనసాగించారు. దీంతో టెస్టుల్లో వికెట్‌ కీపర్‌గా రిషబ్‌ పంత్‌ స్థానం సందిగ్ధంలో పడింది. టెస్టుల్లో వృద్దీమాన్‌ సాహాను కాదని రిషబ్‌ పంత్‌కు చోటిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే సమయంలో విజయ్‌ హజారే టోర్నీలో సంజూ శాంసన్‌ 125 స్ట్రయిక్‌ రేట్‌తో 410 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్‌ సెంచరీ సాధించాడు. దేశవాళీ క్రికెట్‌లో యువ బ్యాట్స్‌ మెన్‌ సంజూ శాంసన్‌ సత్తా చాటడం కూడా పంత్‌ కెరీర్‌ను ప్రమాదంలో పడేసింది. బంగ్లాదేశ్‌తో సిరిస్‌కు జట్టుని ఎంపిక చేసేందుకు గాను ఎమ్మెస్కే ప్రసాద్‌ నాయకత్వంలోని సెలక్షన్‌ కమిటీ గురువారం సమావేశమైంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరిస్‌కు కేరళ బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో సంజు శాంసన్‌ నుంచి పంత్‌కు గట్టి పోటీ తప్పేలా లేదు. మరోవైపు విజయ్‌ హజారే ట్రోఫీలో సెంచరీతో వెలుగులోకి వచ్చిన యువ క్రికెటర్‌ శివమ్‌ దూబే కూడా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరిస్‌కు దూరమైన యజువేంద్ర చాహల్‌ కూడా తిరిగి చోటు దక్కించుకున్నాడు.
వైఫల్యాల నుంచే నేర్చుకున్నా..
విజయ్‌ హజారేలో అత్యధిక పరుగులు (212 నాటౌట్‌) చేసి బంగ్లా సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా సంజు మాట్లాడుతూ.. తానెప్పుడూ పరిపూర్ణ బ్యాట్స్‌మన్‌ అయ్యేందుకు ప్రయత్నించలేదని సంజూ అంటున్నాడు. ’నిజమే, నా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాను. సురక్షితమైన, సులభమైన కెరీర్‌ ఉంటే నేర్చుకొనే అంశాలు తక్కువుంటాయి. ఎక్కువ సార్లు విఫలమైతే విజయవంతం అవ్వడమెలాగో తెలుస్తుంది. నా జీవితంలో ఎన్నోసార్లు విఫలమయ్యాను. నిలబడ్డాను. ఎదిగాను. నా కెరీర్‌ పట్ల బాధలేదు. నాపై ఎక్కువగానే అంచనాలున్నాయి. ముందు కన్నా నేనిప్పుడు బాగా ఆడాలి. టీమిండియాకు ముందుగానే ఎంపికవ్వాల్సింది. ఆలస్యంగానైనా సరే ప్రతి దానికీ ఒక సమయం వస్తుందని తెలుసుకున్నాను. నా గడ్డు కాలాన్నీ ఆస్వాదించాను’ అని సంజూ అన్నాడు. ’ఈ ఐదేళ్లలో మానసికంగా, సాంకేతికంగా ఎన్నో మార్పులు జరిగాయి. వ్యక్తిగా నన్ను, నా ఆటను అర్థం చేసుకున్నాను. నా బలాలపై దృష్టిపెట్టాను. ఎప్పుడూ పరిపూర్ణ బ్యాట్స్‌మన్‌ అవ్వాలని ప్రయత్నించలేదు. ఎందుకంటే పరిపూర్ణులు ఎవరూ ఉండరని అర్థమైంది. ఇప్పుడన్నీ తేలిగ్గా స్వీకరిస్తూ ఆటను ఆస్వాదిస్తున్నా. మూడేళ్లుగా నా ఫిట్‌నెస్‌పై శ్రమించా. వివిధ వ్యక్తులు, ఫిజియోలు, శిక్షకులు ఎన్నో సలహాలు ఇచ్చారు. ఒక క్రమపద్ధతిలో కసరత్తులు చేశాను. 2018 ఐపీఎల్‌ తర్వాత గాయపడ్డాను. యోయో టెస్టుకు ముందు కోలుకోలేదు. ఈ విషయాన్ని ఫిజియోకు చెప్పలేదు. యోయో పాస్‌ అవుతాననే అనుకున్నా. కానీ కాలేదు. ఫిట్‌నెస్‌ నా విషయంలో సమస్యే కాదు’ అని సంజు వెల్లడించాడు.

బంగ్లా సిరిస్‌కు భారత టీ20 జట్టు:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, సంజు శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్‌పంత్‌ (కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, కృనాల్‌ పాండ్య, యుజువేంద్ర చాహల్‌, రాహుల్‌ చాహర్‌, దీపక్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌, శివమ్‌ దూబే, శార్దూల్‌ ఠాకూర్‌

బంగ్లా సిరిస్‌కు భారత టెస్టు జట్టు:
విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, వృద్ధిమాన్‌ సాహా (కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్‌, రిషభ్‌పంత్‌

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments