వృథా అవుతున్న నీరు : రైతుల ఆశలు గల్లంతు
ప్రాజెక్టును సందర్శించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట : భారీ వరద ప్రవాహంతో మూసీ ప్రాజెక్టు గేటు విరిగిపోయింది. దీంతో నీటితో నిండుకుండగా తలపిస్తున్న మూసీ నుంచి దిగువకు నీరు వృథా గా వెళ్తూ ప్రాజెక్టులో ఖాళీ అవుతుంది. ప్రాజెక్టు సామర్థ్యం 4.46 టిఎంసిలు, 645 అడుగులు. మొత్తం 32 క్రస్ట్ గేట్లు ఉండగా, అందులో 7 గేట్లను అధికారులు పూర్తిగా మూసివేశారు. ప్రస్తు తం 25 గేట్లు ఉన్నాయి. గత రెండు రోజులుగా ఎగువ నుండి వస్తున్న భారీ వరద ఉధృతితో అధికారులు రెండు గేట్లు ఎత్తి 1350 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. వరద ప్రవాహం తిరిగి పెరగడంతో శనివారం సాయంత్రం 6వ నెంబర్ గేటు విరిగి నీటిలో కొట్టుకపోయినట్లు సమాచారం. గేటు తుప్పుబట్టడం వల్లే విరిగిపోయినట్లు తెలిసింది. గత సంవత్సరం క్రితమే మూసీ ఆధునీకరణలో భాగంగా మరమ్మతులు చేశారు. కాంట్రాక్టు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఇలా జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గేటు విరిగిపోవడంతో నీరు పెద్దఎత్తున వృథా అవుతుంది. తెల్లవారే వరకు మూసీ ప్రాజెక్టులో నీరు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. మూసీ పూర్తిస్థాయిలో నిండడంతో ఆయకట్టు రైతులు రబీలో తమ పంట సాగుకు డోకాలేదని ఎంతో ఆశతో ఉన్నారు. గేటు విరిగి పోయి నీరు వృథా అవుతుండడంతో వారి ఆశలు గల్లంతు అయ్యాయి. గేటు విరిగిన విషయాన్ని తెలుసుకున్న విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హుటాహుటిన సూర్యాపేట మండల పరిధిలోని రత్నవరం గ్రామ సమీపంలో ఉన్న మూసీ ప్రాజెక్టుకు చేరుకున్నారు. ఘటనపై ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీరు వృథాగా పోకుండా తీసుకోవల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు.
విరిగిన మూసీ గేటు
RELATED ARTICLES