రోగులకు అందుబాటులో ఉండి సేవలందించాలి
డాక్టర్లకు తేల్చి చెప్పిన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లితో కలిసి రోగులకు పరామర్శ
ప్రజాపక్షం/సూర్యాపేట : వైద్య వృత్తి పవిత్రమైనదని.. వైద్యులు, వైద్య విద్యార్థులు రోగులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో జ్వరంతో బాధపడుతూ చికిత్స పొం దుతున్న రోగులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున వాతావరణంలో మార్పులు వచ్చి వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. ఎవరూ కూడా అధైర్యపడవద్దని మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వైద్యాధికారులకు ఎలాంటి సెలవులు నెల రోజుల వరకు లేవని తెల్చి చెప్పారు. రోగులకు అందుబాటులో ఉండి సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. 30 రోజుల గ్రామీణాభివృద్ధి కార్యక్రమంలో గ్రామాల్లో ఉన్న సమస్యలు తొలగించుకోవాలని సూచించారు. వైద్య అధికారులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి వ్యాధుల వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పిల్లలకు రోటా వ్యాక్సిన్ చుక్కలను వేశారు.
మెడికల్ కళాశాల మంజూరు సూర్యాపేట జిల్లాకు వరం….
ప్రభుత్వం సూర్యాపేట జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేయడం ఈ ప్రాంత ప్రజల వరమని ఈటల రాజేందర్ అన్నారు. వైద్య కళాశాలను పరిశీలించిన అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ కళాశాల మంజూరు వెనుక మంత్రి జగదీశ్‌రెడ్డి కృషి, కష్టం ఎంతో ఉందన్నారు. ఉస్మానియా వైద్య కళాశాలలో చదివి దేశ, విదేశాల్లో వైద్య వృత్తి చేస్తూ గొప్ప పేరు, ప్రతిష్టలు పొందుతున్నారన్నారు. అలాగే సూర్యాపేట కళాశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా వైద్య వృత్తిలో రాణించి మంచి పేరు ప్రతిష్టలు పొందాలని సూచించారు. ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తు నిధుల కొరత లేకుండా చూస్తుందని తెలిపారు. వైద్యవృత్తి ఒక వరంగా భావించి పేద ప్రజలకు సేవలందించాలని విద్యార్థులను కోరారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పి చైర్పర్సన్ గుజ్జా దీపిక, కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ డి అమయ్‌కుమార్, ఎస్పి ఆర్ వెంకటేశ్వర్లు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నిరంజన్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ శారదతోపాటు వైద్యవిద్యార్థులు పాల్గొన్నారు.