HomeNewsBreaking Newsఇక పాలమూరు.. పరుగులు

ఇక పాలమూరు.. పరుగులు

వచ్చే వానాకాలానికి పూర్తి కావాలి
వట్టెం రిజర్వాయర్‌ను సందర్శించిన సిఎం కెసిఆర్‌
హైదరాబాద్‌/నాగర్‌ కర్నూల్‌: “కాళేశ్వరం ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తయ్యాయి. అక్కడక్కడ కొన్ని ఫినిషింగ్‌ పనులు తప్ప పెద్ద పనేమీలేదు. ఇక మన దృష్టి అంతా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు మీదనే కేంద్రీకరించాలి. మీ మిషన్లను కూడా పెంచండి. త్వరితగతిన పనులు పూర్తి చేసినప్పుడు మీకు ఇన్సెంటివ్‌లు ఇస్తాం. ఒకవేళ చేయలేకపోతే ఆ విషయం కూడా మాకు స్పష్టం చేయాలి తప్ప పనుల్లో తాత్సారం జరగడానికి వీలు లేదు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నాటికి శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా నాలుగు రిజర్వాయర్లను నింపి సాగు భూములకు నీళ్లు అందించాలి” అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. పాలమూరు ఇరిగేషన్‌ ప్రాజెక్టు రిజర్వాయర్లు, పంప్‌ హౌస్‌ల పనులను మూడు షిఫ్టుల్లో యుద్ధ ప్రతిపాదికన పూర్తిచేయాలని సిఎం ఇరిగేషన్‌ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్‌ఆర్‌, భూ సేకరణకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేస్తామని, పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆగవద్దని ముఖ్యమంత్రి సూచించారు. పాలమూరు ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా గురువారం నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం రిజర్వాయర్‌ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. తొలుత ఏరియల్‌ వ్యూ ద్వారా రిజర్వాయ్‌ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలన్నింటిని ముఖ్యమంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ల నిర్మాణం కాలువలు సొరంగ మార్గాల తవ్వకాలు సంబంధిత ఎత్తిపోతల పంపులు మోటార్లు బిగింపు పనులు విద్యుత్‌ నిర్మాణ పనులు లు పురోగతి, మిషన్‌ భగీరథ పథకం పనుల పురోగతి, కల్వకుర్తి ఎత్తిపోతల పనుల పురోగతి తదితర అంశాలపై పై పాలమూరు రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు ఎంపిలు ఎంఎల్‌ఎలు, ప్రాజెక్టు ఇంజనీర్లు సిఎంఓ అధికారులు వర్క్‌ ఏజెన్సీల ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేయాలనే తమ ప్రభుత్వ లక్ష్య సాధన కోసం అకుంఠిత దీక్షతో ప్రాజెక్టుల నిర్మాణ మహాకార్యాన్ని పూర్తిచేయాల్సి ఉన్నదని, ప్రతీప శక్తులు సృష్టించిన అనేక ఆటంకాలను ఎదుర్కొని ఇప్పటికే కాలేశ్వరం ప్రాజెక్టును పూ ర్తి చేసుకున్నామని, అదే స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసుకుని తెలంగాణ సాగు భూములకు నీరు అందిద్దామని ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నారు. ఇకనుంచి సిఎంఓ కార్యదర్శి స్మిత సబర్వాల్‌ పాలమూరు-రంగారెడ్డి పనుల పురోగతిపై ప్రతి పది రోజులకు ఒకసారి వచ్చి సమీక్ష జరుపుతారని సిఎం తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల మంత్రులు ప్రజాప్రతినిధులతో మరొకసారి విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి సాగు నీటి పంపిణీకి సంబంధించి ఏర్పాటు చేసుకోవాల్సిన చిన్న రిజర్వాయర్ల సామర్ధ్యం పెంపు, కొత్తగా కాలువలు ఇంకా ఇతరత్రా సమస్యలు ఉంటే వాటిపై కూలంకషంగా సమగ్రంగా చర్చించాలని సిఎం సూచించారు. ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి ఎంఎల్‌ఎలు, ఎంపిలు సమన్వయం తో చర్చించి తమ అభిప్రాయాలను స్మితా సబర్వాల్‌కు తెలియచేయాలని అన్నారు. మొత్తం 16.7 టిఎంసిల సామర్ధ్యంతో రిజర్వాయర్‌ నిర్మిస్తున్నందున ఒక వారంలోపు మూడు ఏజెన్సీలు రిజర్వాయర్‌ నిర్మాణాన్ని మూడు షిఫ్టుల్లో పూర్తిచేయడానికి అవసరమైన కార్మికులను రప్పించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రివిట్మెంట్‌ పనులను వచ్చే మార్చిలోపే పూర్తిచేయాలని ఆదేశించారు. రిజర్వాయర్‌, పంప్‌ హౌస్‌ పనులను సమాంతరంగా పూర్తిచేయాలని సిఎం పేర్కొన్నారు. భూ సేకరణ, ఆర్‌ఆర్‌కు సంబంధించి రూ.200 కోట్ల నిధులు కావాలని జిల్లా కలెక్టర్‌ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే నిధులు విడుదల చేయాలని సిఎంఓ కార్యదర్శి స్మీతా సబర్వాల్‌ను సిఎం ఆదేశించారు. రిజర్వాయర్‌ వద్దకు వచ్చే ముందు హెలిప్యాడ్‌ నుంచి డైరెక్ట్‌గా వట్టెం గ్రామస్థుల వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వారి నుండి వినతి పత్రాలను తీసుకున్నారు. భూసేకరణ నిధులను వేగంగా ఇవ్వడంతో పాటు గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా గ్రామస్థులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. తాను అన్ని చూసుకుంటానని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారు. అంతకు ముందు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకంలో కీలక రిజర్వాయర్‌ అయిన కర్వేన ప్రాజెక్ట్‌ను సిఎం కెసిఆర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఏరియల్‌ వ్యూ నిర్వహించి అనంతరం ఇంజనీర్లు అధికారులు వర్క్‌ ఏజెన్సీలతో పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో కర్వేన రిజర్వాయర్‌ కీలకమైనదని దీనికి సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావాలని సంబంధిత ఇంజనీర్లు వర్క్‌ ఏజెన్సీలకు సిఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం నడుస్తున్న పనులను 3 షిఫ్టుల్లో నిరంతరాయంగా నిర్మాణ పనులను పూర్తిచేయాలని తెలిపారు. “మీరు ఇక నుంచి మీ బిల్లులకు చింత చేయవలసిన అక్కర్లేదు. పొద్దున బిల్లులు పెడితే సాయంత్రం కల్లా క్లియర్‌ చేసే బాధ్యత నాది. వర్క్‌ ఫోర్స్‌ పెంచుకోండి. పని షిప్టులు పెంచుకోండి. అధికార యంత్రాంగం మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. నాలుగున్నర నెలల టార్గెట్‌ పెట్టుకొని ఎండలు ముదురక ముందే పని పూర్తి చేయండి. వానాకాలం వచ్చేనాటికి రైతుల పంటలకు మన నీళ్ళందాలి. ఇప్పుడు మీకు ఎటువంటి సమస్యలు లేవు భూసేకరణ సమస్యలు లేవు” అని సిఎం అన్నారు. ఇంకా ప్రాజెక్టు పనులకు సంబంధించి పలు అంశాలపై మంత్రులు, ఎంఎల్‌ఎలు, అధికారులకు వర్క్‌ ఏజెన్సీలకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేసి అక్కడనుండి వట్టెం ప్రాజెక్టు పరిశీలనకు వాయు మార్గంలో బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, వి.శ్రీనివాస్‌ గౌడ్‌, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, ఎంఎల్‌ఎలు మర్రి జనార్థన్‌ రెడ్డి, గువ్వల బాలరాజు, ఎంఎల్‌సి కె.దామోదర్‌ రెడ్డి, జెడ్‌పి ఛైర్‌పర్సన్‌ పద్మావతి, కలెక్టర్‌ శ్రీధర్‌, ఈఎన్‌సి మురళీధర్‌రావు, మెగా సంస్త ప్రతినిధి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments