లక్ష్మణ్‌కు రేవంత్‌రెడ్డి సవాల్
హైదరాబాద్: టిఆర్‌ఎస్ ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాల అవినీతిపై కేంద్రంతో దర్యాప్తు చేయించేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ సిద్ధమా? అని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కా జిగిరి ఎంపి ఎ.రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. విద్యుత్ అవినీతిపై పదే పదే ఆరోపణలు చేస్తున్న లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వంతో దర్యాప్తు చేయించేందుకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారని ప్రశ్నించారు. త్వరలోనే కాంగ్రెస్ ఎంపిలమైన తాను, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు ఈ అంశంపై దర్యాప్తు చేయాలని ప్రధానికి, కేంద్ర హోం మంత్రికి, కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు, లక్ష్మణ్‌కు సైతం ఆధారాలిచ్చి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. గాంధీభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపి, టిఆర్‌ఎస్ నేతలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్డును తొలగించుకునేందుకు వ్యూహాత్మకంగా ఒకరి ఉనికి ఒకరు కాపాడుకుంటూ విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు. తాము గతంలోనే విద్యుత్ ఒప్పందాల్లో అవినీతిపై ఆధారాలను చూపించామని, తాజాగా లక్ష్మణ్ కూడా దర్యాప్తు కోరుతున్నారని, సిబిఐ విచారణకు అదేశిస్తే నిజాయితీ నిరూపించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తరుపున ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావు, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారని చెప్పారు. అందరూ కోరుతున్నప్పుడు కేంద్రంలో వారి పార్టీ నేతలతో చెప్పి ఎందుకు దర్యాప్తు వేయడం లేదన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ ఒప్పందాల అవినీతి గురించి రేవంత్‌రెడ్డి వివరించారు. భద్రాద్రి, యాదాద్రి , కొత్తగూడెం విద్యుత్ ప్లాంట్‌ల నిర్మాణం కోసం బిహెచ్‌ఇఎల్ సంస్థకు రూ.32,600 కోట్ల కాంట్రాక్టులు నామినేషన్ పద్ధతిలో అప్పగించిన కారణంగా, విద్యుత్ సంస్థలపై రూ.5,600 కోట్ల భారం పడిందన్నారు. ఝార్ఖండ్ రాష్ట్రంలో రూ.14వేల కోట్ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్‌లు పిలవడంతో బిహెచ్‌ఇఎల్ పోటీ పడి 17 శాతం తక్కువగా కాంట్రాక్ట్ దక్కించుకున్నదని, దీంతో ఆ ప్రభుత్వానికి రూ.2,372 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. మన రాష్ట్రంలో కూడా టెండర్‌లను ఆహ్వానిస్తే అదే స్థాయిలో 17 శాతం తక్కువకు కోట్ చేస్తే, రూ.5,600 కోట్లు ఆదా అయ్యేవన్నారు. అయితే, నామినేషన్ పద్ధతిలోనే రూ.32,600 కోట్ల పనులను బిహెచ్‌ఇఎల్‌కు అప్పగించడం వెనుక కుట్ర ఉన్నదన్నారు. బిహెచ్‌ఇఎల్ కేవలం ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి మాత్రమే చేస్తుందని, కాని విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులను కూడా ఆ సంస్థకే అప్పగించారని, ఆ సంస్థ నిర్మాణ పనులను కెసిఆర్‌కు సంబంధించిన వ్య క్తులకు కాంట్రాక్టుకు ఇచ్చారని, వారు కమిషన్‌లు ముట్టజెప్పారని, రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వీటన్నిటి వెనుక దేవులపల్లి ప్రభాకర్‌రావు ఉన్నారని అన్నారు. ఐఎఎస్ అధికారులు ఉండాల్సిన సిఎండి స్థానాన్ని రిటైర్డ్ ఉద్యోగి ప్రభాకర్‌రావుకు ఇచ్చారని, ఐఎఎస్‌లైతే తప్పుడు ఒప్పందాలపై సంతకాలు పెట్టరనే ఉద్దేశ్యంతోనే వారిని కాదని ఆయనకు కట్టబెట్టారని అన్నారు. అలాగే భద్రాద్రి ప్రాజెక్టు వెనుక కూడా మతలబు ఉన్నదన్నారు. ఈ ప్రాజెక్టును 2014లో ఇండియా బుల్స్ అనే సంస్థ నుండి రాష్ట్ర ప్రభుత్వం రూ.7వేల కోట్లకు కొనుగోలు చేసిందని, అయితే ఇందులో కేంద్రం 2012లో నిషేధించిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని వాడుతున్నారని తెలిపారు. ఇండియన్ బుల్స్ ను గట్టెక్కించేందుకే పనికి రాని విద్యుత్ ప్లాంట్‌ను కొనగులో చేశారని, దీని వెనుక కూడా ప్రభాకర్‌రావు ఉన్నారని తెలిపారు.తరువాత తమకు విద్యుత్ అత్యవసరం ఉన్నందున, పాత టెక్నాలజీ విషయంలో మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిందని, అందులో 2017 నాటికి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని పేర్కొందని చెప్పారు. అయితే అత్యవసరమనిచెప్పిన ప్రాజెక్టు గడువు ముగిసి రెండేళ్ళు గడిచినా ఒక్క యూనిట్ ఇప్పటివరకు ఉత్పత్తి చేయలేదన్నారు. ఎందుకు ఇప్పటి వరుకు పనులు పూర్తి కాలేదని నిలదీశారు. కేంద్రం దర్యాప్తునకు ఆదేశిస్తే వీటన్నిటి వివరాలను అందజేస్తామన్నారు. విద్యుత్ కొనుగోలులో కూడా కుంభకోణం ఉన్నదని, ఆ వివరాలను గురువారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడిస్తానన్నారు.
నేతలకు ఉద్యమాల విభజన : వివిధ అంశాలపై అధ్యయనం చేసి పోరా డేందుకు సీనియర్ నేతలకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుంటియా కొన్ని అంశాలను అప్పగించారని రేవంత్‌రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అందులో భాగంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కలకు సాగునీటి ప్రాజెక్టులు, కాళేశ్వరం అవినీతి అంశాన్ని, తనకు విద్యుత్ ఒప్పందాల అవినీతి, భూ కుంభకోణాలు, మర్రిశశిధర్‌రెడ్డికి కెసిఆర్‌పై గతంలో ఉన్న సహారా పిఎఫ్, ఇఎస్‌ఐ భవన నిర్మాణ అక్రమాల తదితర కేసుల అంశాలను అప్పగించారని వెల్లడించారు. వీటిపై అధ్యయనం చేసి ప్రజాక్షేత్రంలో పోరాడుతామని తెలిపారు.
‘విద్యుత్’ అవినీతిపై కేంద్రం విచారణ
RELATED ARTICLES