చంద్రబాబు నివాసం చిత్రీకరణ టిడిపి నేతల ఆందోళన
ప్రజాపక్షం/విజయవాడ: టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అమరావతిలో అద్దెకు ఉంటున్న ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు ప్రైవేటు వ్యక్తులు చంద్రబాబు నివాసంపైకి డ్రోన్లను ప్రయోగించారు. దీంతో టిడిపి కార్యకర్తలు వారిని పట్టుకున్నారు. పోలీసులు జోక్యంతో డ్రోన్ ప్రయోగించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. జల వనరుల శాఖ అధికారుల అను మతితోనే డ్రోన్ ప్రయోగించినట్లు ప్రైవేటు వ్యక్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టిడిపి కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. చంద్రబాబు నివాసానికి చేరుకున్న టిడిపి నేతలు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ టిడి జనార్దన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు నిజాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో టిడిపి నేతలు పోలీసు జీపును చుట్టుముట్టారు. జడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబు నివాసంపైకి డ్రోన్ ప్రయోగించడానికి గల కారణాలను తమకు తెలపాల్సిందేనంటూ పట్టుబట్టారు. అక్కడ ఉన్న కరకట్టపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
డ్రోన్లతో నిఘా పెట్టిందెవరు?: చంద్రబాబు
తన ఇంటిపై డ్రోన్లు ఎగరడంపై టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పి, డిజిపి గౌతమ్ సవాంగ్‌తో ఫోన్లో మాట్లాడారు.హై సెక్యూరిటీ జోన్ లో డ్రోన్లు ఎగరడంపై అధికారులను నిలదీశారు. డ్రోన్లు ఎగరేస్తున్న వ్యక్తులెవరు? వారికి అనుమతులు ఎవరిచ్చారు? అని ఆయన ప్రశ్నించారు. డిజిపి, రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు లేకుండా డ్రో న్లు ఎగురవేయడానికి వీల్లేదు కదా? అని అన్నారు. అన్ని అనుమతులతోనే డ్రోన్లు ఎగరేస్తున్నారా అని ప్రశ్నించారు. ‘ నేను ఉండే నివాసంపై డ్రోన్లతో నిఘా పెట్టిందెవరు? చివరికి నా భద్రతనే ప్రశ్నార్థకంగా మారుస్తారా? డ్రోన్లు ఎగరేస్తూ పట్టుబడిన వ్యక్తులెవరు? ఆ డ్రోన్లలో ఏముందో, పట్టుబడింది ఎవరో తెలియజేయాలి. నిఘా వేసిందెవరో, దాని వెనక కుట్ర ఏముం దో తెలియజేయాలి’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.