ఉత్తమ చిత్రం అవార్డు గుజరాతీ చిత్రం ‘హెల్లారో’
ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్‌కు సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక 66వ జాతీయ ఫిల్మ్ అవార్డులను శుక్రవారం ప్రకటించారు. అవార్డులను జ్యూరీ అధిపతి రాహుల్ రవైల్ ప్రకటించారు. అయితే ఈ అవార్డులను ఎప్పుడు ప్రదానం చేయనున్నారన్నది ఇంకా స్పష్టం కాలేదు. బాలివుడ్ చిత్రాలే ఎక్కువ అవార్డులను గెలుచుకున్నాయి. బాలివుడ్ నటులు ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్ ఉత్తమ నటుడు అవార్డును సంయుక్తంగా గెలుచుకున్నారు. ‘అంధాధున్’, ‘యురి’ సినిమాల్లో వారి నటనకు గుర్తింపుగా ఈ అవార్డులు గెలుచుకున్నారు. ఇదిలావుండగా తెలుగు చిత్రం ‘మహానటి’లో ముఖ్య భూమికను నిర్వహించిన నటి కీర్తి సురేశ్‌కు ఉత్తమ జాతీయ నటి పురస్కారం లభించింది. డైరెక్టర్ ఆదిత్య ధర్ తన తొలి సినిమా ‘యురి: ద సర్జికల్ స్ట్రయిక్’కి ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకున్నారు. ఈ సినిమా 2016లో భారత్ జరిపిన మెరుపుదాడుల కథ ఆధారంగా చిత్రీకరించింది. కాగా ‘అంధాధున్’ ఉత్తమ హిందీ సినిమా, ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమాకు శ్రీరాం రాఘవన్ దర్శకత్వం వహించారు. ఆయన ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు మెల్బోర్న్‌లో ఉన్నారు. ఆయన అక్కడి నుంచే ఫోన్‌చేసి తన ఆనందాన్ని తెలిపారు. తనతోపాటు ఉన్న టబు ‘మనం గెలిచాం’ అని చెప్పినట్టు కూడా ఆయన సంతోషంగా తెలిపారు.
సామాజిక అంశాలపై ఉత్తమ చిత్రంగా అక్షయ్ కుమార్ నటించిన ‘ప్యాడ్‌మ్యాన్’ నిలిచింది. ఉత్తమ చిత్రంగా అభిషేక్ షా దర్శకత్వం వహించిన ‘హెల్లారో’ నిలిచింది. ఇది గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి చెందిన సినిమా. ఇందులో మహిళల సాధికారతపై చిత్రీకరించారు. ఆద్యంతం వినోదాన్ని పంచి, బహుజనాదరణ పొందిన ‘బదాయ్ హో’ బెస్ట్ పాపులర్ చిత్రం అవార్డును అందుకుంది. ఈ చిత్రంలో నటించిన సురేఖ సిక్రీకి ఉత్తమ సహాయ నటి అవార్డు లభించింది. ‘లేట్ ప్రెగ్నెన్సీ’ని ఓ కుటుంబం ఎలా డీల్ చేసిందనే ఇతివృతంపై ఈ సినిమాను తీశారు. సినిమా విడుదల మొదలుకుని అనేక అడ్డంకులు, విమర్శలు ఎదుర్కొన్న సంజయ్ లీలా బన్సాలీ చిత్రం ‘పద్మావత్’కు బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు లభించింది. ఉత్తమ గాయని అవార్డు బిందు మాలిని గెలుచుకుంది. కన్నడ సినిమా ‘నాతిచరామి’లో ఆమె పాడిన ‘మాయావి మనవే..’పాటకు ఈ అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా ఉత్తమ కన్నడ చిత్రంగా, ఉత్తమ గీతం, ఉత్తమ ఎడిటింగ్ అవార్డులను కూడా గెలుచుకుంది. ఉత్తమ ఉర్దూ చిత్రంగా ‘హమీద్’ నిలిచింది. ఈ చిత్రంలో నటించిన బాల నటుడు తాల్హ అర్షద్ రేష్మీ ఉత్తమ బాల నటుడు అవార్డును గెలుచుకున్నాడు. తెలుగు సినిమా ‘చి. అర్జున్ ల.సౌ.’ ఉత్తమ స్క్రీన్‌ప్లే చిత్రంగా అవార్డును అందుకుంది. మలయాళం సినిమా ‘ఒలు’ ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును గెలుచుకుంది.
ఆయా భాషల కేటగిరిల్లో అవార్డులు గెలుచుకున్న చిత్రాలివి: రేవా(గుజరాతీ), హర్జితా(పంజాబీ), అమోరి(కోంకణి), మహానటి(తెలుగు), సుడానీ ఫ్రం నైజీరియా(మలయాళం), ఏక్ జే చిలో రాజా(బెంగాలీ), బారం(తమిళ్), భోంగ(మరాఠి), మామ(గరో), మిషింగ్(షేర్‌దుక్పన్), ఇన్ ద ల్యాండ్ ఆఫ్ పాయిజన్ విమన్(పంగ్‌చెంగ్పా), టర్టుల్(రాజస్థానీ).
అవార్డుల జాబితా
ఉత్తమ చిత్రం: హెల్లారో(గుజరాతీ)
ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్(యురి)
ఉత్తమ నటుడు: ఆయుష్మాన్ ఖురానా(అంధాధున్), విక్కీ కౌశల్(ఉరి)
ఉత్తమ నటి: కీర్తి సురేశ్(మహానటి)
ఉత్తమ సహాయ నటుడు: స్వానంద్ కిర్కిరే(చంబక్)
ఉత్తమ సహాయ నటి: సురేఖా సిక్రీ(బదాయ్ హో)
ఉత్తమ పర్యావరణ పరిరక్షణ నేపథ్య చిత్రం: పానీ(మరాఠీ)
ఉత్తమ సామాజిక చిత్రం: ప్యాడ్‌మ్యాన్
ఉత్తమ వినోదాత్మక చిత్రం: బదాయ్ హో
ఉత్తమ పరిచయ దర్శకుడు: సుధాకర్రెడ్డి యాకంటి(నాల్: మరాఠీ)
జాతీయ ఉత్తమ హిందీ చిత్రం: అంధాధున్
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం: మహానటి
జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్
జాతీయ ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్
ఉత్తమ సంగీత దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ(పద్మావత్)
జాతీయ ఉత్తమ యాక్షన్ చలన చిత్రం: కెజిఎఫ్
ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం (రాజా కృష్ణన్)
ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రం: చి. అర్జున్ ల.సౌ.
ఉత్తమ స్పెషల్ ఎఫెకట్స్: ‘అ!’(తెలుగు) కేజీఎఫ్(కన్నడ)
ఉత్తమ సాహిత్యం: నాతిచరామి(కన్నడ)
ఉత్తమ మేకప్: ‘అ!’
ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్: మహానటి
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కమ్మార సంభవం(మలయాళం)
ఉత్తమ ఎడిటింగ్: నాతిచరామి(కన్నడ)
ఉత్తమ సౌండ్ డిజైనింగ్: ఉరి
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: అంధాధున్
ఉత్తమ సంభాషణలు: తారీఖ్(బెంగాలీ)
ఉత్తమ గాయని: బిందుమాలిని(నాతి చరామి: మాయావి మనవే)
ఉత్తమ గాయకుడు: అర్జిత్ సింగ్(పద్మావత్: బింటే దిల్)
ఉత్తమ బాల నటుడు: పివి రోహిత్, షాహిబ్ సింగ్, తలాహ్ అర్షద్ రేష్మి, శ్రీనివాస్ పోకాలే
నర్గీస్ దత్ అవార్డు: వండల్లా ఎరడల్లా(కన్నడ)