రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వానలు
ఇలాగే కురవాలని రైతుల్లో ఆశలు
వేసిన పంటలకు ప్రాణం కొత్తగా సాగుకు సన్నాహం
ప్రజాపక్షం / హైదరాబాద్ : చినుకు కోసం ఆకాశంపై ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాతను ఎట్టకేలకు మేఘం కరుణించింది. గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తం గా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీవర్షాలు కురిశాయి. ఈ పరిస్థితి మరో నాలుగైదురోజులు కూడా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రైతుల్లో హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వేసిన పంటలకు నీళ్లు లేక ఎండిపోతుంటే వాటిని కాపాడుకోవడానికి బిందెలు, బకెట్లు, డ్రమ్ములు, ఎడ్లబండ్ల సా యంతో తీసుకువెళ్లి బొట్టుబొట్టు పోసి మొలకలను కాపాడుకున్న రైతుకు గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఆ కష్టాల నుం చి వారిని దూరం చేశాయి. వర్షాలు లేవంటూ ఇప్పటికి సాగు మొదలుపెట్టని భూముల్లోకి కూడా నాగళ్లు, ట్రాక్టర్లు ప్రవేశించడం మొదలుపెట్టాయి. మొత్తానికి జులై చివరి వారం నుంచి వర్షాలు బాగా కురుస్తాయన్న వాతావరణ కేంద్రం సూచన నిజం అవుతుండడంతో ఇక నుంచి వర్షాలకు ఢోకా ఉండదని భావించిన రైతులు ఏరువాక మొదలు పెట్టారు. అయితే ఇప్పటికే వ్యవసాయం నెలరోజులు ఆలస్యం కావడంతో ఆయా ప్రాంతాలకు అనుగుణంగా వేయాల్సిన మధ్యకాలిక, స్వల్పకాలిక పంటల ప్రణాళినకు సిద్ధం చేసుకుని వాటి విత్తనాలను కూడా సిద్దంగా ఉంచుకున్న వ్యవసాయశాఖ రైతులకు ఆయా పంటలను మాత్ర మే వేసుకోవాలని సూచిస్తూ సబ్సిడీపై ఆయా విత్తనాలనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. వర్షాలు లేక ఈ సారి పత్తి పంట బాగా డీలా పడింది. రాష్ట్రంలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 1.08కోట్ల ఎకరాలు కాగా ఇప్పటి వరకు కేవలం 43.33లక్షల ఎకరాల్లో మాత్ర మే పరిమితమైంది. ఇందులోనూ 27.05 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు మొదలైంది. ఆహారధాన్యాల సాగు పరిస్థితి కూడా అంతే. వీటి సాగు విస్తీర్ణం 48.25లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు కేవలం 10.98 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగును మొదలుపెట్టారు. పప్పు దాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.37లక్షల హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 4.82 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగును మొదలుపెట్టారు. ఇందులో ప్రధానమైన కంది సాగు విస్తీర్ణం 7.29 లక్షలు ఎకరాలు కాగా ఇప్పటి వరకు 3.66 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు ప్రారంభమైంది. అత్యంత ప్రధానమైన వరి సాగు సాధారణ విస్తీర్ణం 24.11లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు కేవలం 1.46 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగును మొదలు పెట్టారు. వర్షాలు ఆలస్యం కావడం వల్ల ఇప్పుడు ఎంత భారీవర్షాలు పడ్డా వరి సాధారణ సాగుకు చేరుకోవడం కష్టమేనని అధికారులే స్పష్టం చేస్తున్నారు. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 12.52లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 4.15లక్షల ఎకరాల సాగు మాత్రమే మొదలైంది. అంతే కాదు కొన్ని చోట్ల తొలుత అడపాదడపా కురిసిన వర్షాలకు పత్తిని నాటినా గింజలు భూమిలోనే ఎండిపోయాయి తప్ప మొలకెత్తలేదు. మొలకెత్తిన చోట కూడా వేసవిని తలపించే ఎండలతో చాలా మటుకు ఎండిపోయాయి. రైతులు అష్ట కష్టాలు పడి ప్రాణంపోసుకున్న మొక్కలకు గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రాణం పోసాయి. పత్తి ఎక్కువగా పండించే ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, కరీంనగర్, వరంగల్ ఇలా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అతి భారీ వర్షాలు కురిస్తే మొలక దశలో ఉన్న పంటలు కొట్టుకుపోయే అదో రకంగా నష్టం జరిగేది. కాని అలా కాకుండా ముసురు పట్టడంతో మొక్కలకు, భూమిలో ఉన్న గింజలకు ప్రాణం పోయడమే కాకుండా నీళ్లు భూమిలో ఇంకి భూగర్భజలాలు కూడా పెరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. వరుణుడు ఇక నుంచి ఇలాగే కరుణించాలని రైతులు ఆశపడుతున్నారు.