12 అంతస్థుల్లో ఎంఎల్ఎ, ఎంఎల్‌సి క్వార్టర్ల నిర్మాణం
అదనంగా 120 సర్వెంట్ క్వార్టర్స్, సిబ్బందికి 36 క్వార్టర్స్
హైదర్‌గూడలో ఎంఎల్ఎ క్వార్టర్లు ప్రారంభించిన సిఎం కెసిఆర్
సభ్యుల ఆప్షన్లతో క్వార్టర్ల కేటాయింపు
ప్రజాపక్షం / హైదరాబాద్ : ఎంఎల్ఎలు, ఎంఎల్‌సిల కోసం హైదర్‌గూడలో నూతనంగా నిర్మించిన క్వార్టర్లకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రారంభోత్సవం చేశారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు హైదర్‌గూడకు చేరుకున్న సిఎం కెసిఆర్.. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రు లు మహ్మద్ మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, జి.జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎ. ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్‌లతో కలిసి క్వార్టర్లను ప్రారంభించారు. తొలుత సభా ప్రాంగణం వద్దకు చేరుకుని అక్కడున్న ఎంఎల్ఎలు, ఎంఎల్‌సిలకు సిఎం అభివాదం చేశారు. కార్యాలయ సమదా యం ప్రారంభించిన తర్వాత పలు బ్లాకులను పరిశీలించి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. విజయవాడ పర్యటనకు వెళ్లాల్సి ఉండడంతో మీడియాతో మాట్లాడకుండానే సిఎం అక్కడి నుండి వెళ్లి పోయా రు. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు అధికార పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ ఎంఎల్ఎలు హాజరయ్యారు. 2012 నుండి కొనసాగుతున్న ఈ పనులు సిఎం కెసిఆర్ చొరవతో నిర్మాణం పూర్తి చేసుకున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులకు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లోనే ఫ్లాట్ల కేటాయింపు పనులు చేపడుతామన్నారు. ఒక్కో సభ్యుడికి రెండు కార్లకు అవసరమైన పార్కింగ్ స్థలాన్ని కేటాయిస్తామని, గ్రౌండ్ ఫ్లోర్లో 23 సమావేశ క్యా బిన్లు కూడా ఏర్పాటు చేయించామన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలను కలువడానికి వీలుగా వీటిని నిర్మించినట్లు సభాపతి తెలిపారు.
166 కోట్లుతో నిర్మాణం: 2012లో శంకుస్థాపన చేసిన నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో రూ. 166 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్ అండ్ బి శాఖ ఈ భవంతిని అసెంబ్లీ స్పీకర్‌కు అప్పగించింది. నిర్మా ణం బాధ్యతల వరకే ఆర్ అండ్ బి కి బాధ్యతలు ఉంటాయని, తర్వాత దీనిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం చూసుకుంటుందని ఆర్ అండ్ బి శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ ఈ సందర్భంగా ‘ప్రజాపక్షం’కు తెలిపారు. మొత్తం నాలుగు విభాగాలుగా ఈ క్వార్లర్లను వర్గీకరించారు. శాసనసభ్యుల కోసం 120 త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్లు, 36 స్టాఫ్ క్వార్టర్లు , అటెండెంట్ క్వార్టర్స్ కూడా 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 120 ఫ్లాట్లు, విద్యుత్ అంతరాయాలకు ఆస్కారంలేని విధంగా 320 కెవిఎ సబ్‌స్టేషన్‌ను ఇక్కడ నిర్మించారు. సీవరేజీ నీటిని తిరిగి వినియోగించుకుని పచ్చిక బయళ్లను, గ్రీనరీని మెయింటెయిన్ చేయనున్నారు. ప్రస్తుతం 5 అంతస్తుల్లో నిర్మిస్తున్న ఐటి ఎమినెంట్ బ్లాక్ పనులు తుది దశలో ఉన్నాయని, నెల రోజుల్లోనే ఈ బ్లాక్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని ఆర్ అండ్ బి శాఖ అధికారులు తెలిపారు. ఈ బ్లాక్‌లో సూపర్‌మార్కెట్, కిచెన్, క్యాంటిన్, హెల్త్ సెంటర్‌ను నిర్మిస్తున్నారు.
ఆప్షన్లతో క్వార్టర్ల కేటాయింపు : 12 అంతస్థలుగల ఈ క్వార్టర్లలో ఎవరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో తెలుసుకుని ఫ్లాట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించినట్లు తెలిసింది. మిత్రులు, ఒకే జిల్లా వారు.. ఇలా శాసన సభ్యులు, ఎంఎల్‌సిలు, ఎవరెవరు దగ్గర దగ్గర ఉండాలనుకుంటున్నది తెలుసుకుని వారికి అప్పగించాలని, 12 అంతస్థుల పైకి వెళ్లకుండా ఎక్కువ మంది కింది క్వార్టర్లనే కోరుకుంటే ఆప్లన్లతో వారు కోరిన దానికి దరిదాపుల్లో ఉండేలా చూసి ఫ్లాట్లు ఇవ్వాలని సిఎం సూచించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.