ముఖ్య అతిథులుగా ఎపి, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్‌మోహన్‌రెడ్డి, ఫడ్నవిస్ : 21న ప్రారంభం
ప్రజాపక్షం / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేం ద్ర ఫడ్నవిస్ హాజరవుతారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం మధ్యాహ్నం ఫోన్లో మాట్లాడారు. కెసిఆర్ ఆహ్వానం మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావడానికి ఆయన అంగీకరించారు. త్వరలోనే కెసిఆర్ స్వయంగా ముంబయి వెళ్లి ఫడ్నవిస్‌ను ఆహ్వానించాలని నిర్ణయించారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎపి సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలోనే విజయవాడకు వెళ్లి ఆయనను ఆహ్వానిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.70శాతం జిల్లాలకు త్రాగునీరు, సాగునీరు : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలోని 70 శాతం జిల్లాలకు త్రాగునీరు, సాగు నీరు అందుతుంది. దీంతో పాటు పారిశ్రామిక అవసరాలకు సరిపడా నీరును అందిస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇప్పటికే దేశ నీటిపారుదల శాఖ రంగంలో అనేక రికార్డులు నెలకొల్పింది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు,సందర్శుకులు దీనిని చూసి నివ్వెరపోయి ఇంత పెద్ద మానవ నిర్మితమా అంటూ కొనియాడారు. నిపుణులు చూసి నివ్వెరపోయారు. ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం పనులు నిర్దేశిత సమయంలో పూర్తి కావడం విశేషం. ఈ ప్రాజెక్టులో భాగంగా మేడిడ్డ వద్ద సముద్ర మట్టానికి వంద మీటర్ల ఎత్తున గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ఆరు దశల్లో ఎత్తిపోతలు నిర్మించారు. వీటి ద్వారా ఎత్తి పోసిన నీటిని 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్‌కు తరలిస్తారు. ఇక్కడ అరకిలీమీటర్ ఎత్తులో నీటిని ఎత్తిపోస్తారు. దీని కోసం పంప్‌హౌజ్‌తో పాటు ప్రతి రోజు రెండు టిఎంసిల చొప్పున ఏడాది పాటు లిఫ్ట్ చేస్తారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి రోజు మూడు టిఎంసిలు ఎత్తిపోసేలా నిర్మాణాలు చేపడుతున్నారు. దీని కోసం దేశంలోనే ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా భారీ స్థాయి పంప్‌లను ఉపయోగిస్తున్నారు.