నేడు భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్
ఆత్మ విశ్వాసంతో కోహ్లీసేన
బోణీ కోసం బరిలోకి ఇరు జట్లు
ఐసిసి వన్డే వరల్డ్‌కప్ 2019
సౌథాంప్టన్: ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభమైన ఐసిసి వన్డే ప్రపంచకప్ 2019లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇందుకు సౌథాంప్టన్ వేదిక కానుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లలో పటిష్టంగా ఉన్న కోహ్లీ సేన ఈ మ్యాచ్ గెలిచి ప్రపంచకప్‌లో బోణీ కొట్టాలని కుతూహలంతో ఉంది. అయితే దక్షిణాఫ్రికా మాత్రం ఇప్పటి వరకూ రెండు మ్యాచ్‌లు ఆడగా రెండింటిలోనూ ఓటమిని చవిచూసింది. భారత్‌తో జరిగే మూడో మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి నిలవాలనే పట్టుదలతో ఉంది. ఈ మెగా టోర్నీలో మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్‌తో తలపడిన సౌతాఫ్రికా 104 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. అనంతరం ఆదివారం జరిగిన రెండోమ్యాచ్‌లోనూ పసికూన బంగ్లాదేశ్‌ను సైతం నిలువరించలేకపోయింది. దీంతో 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక మూడో మ్యాచ్ ఎలాగైన గెలిచి తీరాలని ఉవ్విళ్లూరుతోంది. ఇదిలా ఉండగా సఫారీ జట్టును గాయాల బెడద వేధిస్తోంది. గాయంతో పేసర్ డేల్ స్టెయిన్, ఓపెనర్ హషీమ్ ఆమ్లా ఇప్పటికే దూరమవ్వగా.. బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో లుంగీ ఎంగిడి కూడా దూరమయ్యాడు. కాగా, కోహ్లీసేన ఈ మ్యాచ్ కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తుంది. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత్ రెండు సన్నాహాక మ్యాచ్‌లు ఆడగా.. ఒకటి ఓడగా.. రెండో మ్యాచ్‌లో గెలిచింది. ఈ మ్యాచ్‌లో భారత సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెలరేగి ఆడటంతో టీమిండియా గెలుపుటంచులకు చేరుకుంది. సౌతాఫ్రికాతో జరిగే తొలి మ్యాచ్‌లో ఓపెనర్లు శిఖర్ ధవన్, రోహిత్ శర్మలు చెరేగితే.. మిడిలార్డరర్స్ రాణిస్తే భారత్ గెలుపు ఖాయం. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, చైనమన్ కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. దీంతో భారత్, సౌతాఫ్రికా మధ్య బుధవారం జరిగే మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది. అయితే ఇప్పటివరకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు 55 వన్డే మ్యాచ్‌ల్లో తలపడగా భారత్ 18, దక్షిణాఫ్రికా 34 మ్యాచ్‌లు గెలుపొందాయి. మూడింటిలో ఫలితం తేలలేదు. కాగా, నాగపూర్ వేదికగా 1999లో జరిగిన వన్డేలో భారత్ చేసిన 310 పరుగులు ఇదే దక్షిణాఫ్రికాపై టీమిండియాకు అత్యుత్తమ స్కోరు. లక్ష్య చేధనలో జరిలోకి దిగిన సఫారీలు భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 320 పరుగులు చేసి భారత్‌ను ఓడించారు. ఇదిలా ఉండగా 2006లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జట్టు దర్బన్ వేదికగా సఫారీలతో జరిగిన వన్డే మ్యచ్‌లో కేవలం 91 పరుగులకే చాపచుట్టేసింది. కాగా, సొంత గడ్డపై భారత్ జరిగిన వన్డేలో భారత్ సౌతాఫ్రికాను కేవలం 117 పరుగులకే కట్టడి చేసింది. వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకు భారత్ సౌతాఫ్రికా నాలుగు సార్లు తలపడగా 1 మ్యాచ్‌లో భారత్ గెలువగా. 3 మ్యాచ్‌లలో సౌతాఫ్రికా గెలుపొందింది. అయితే ఈ రికార్డులను చూసుకున్నట్లయితే దక్షిణాఫ్రికాకు ఎక్కువగా గెలుపు అవకాశాలున్నా.. ప్రస్తుతం సౌతాఫ్రికా ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడి డీలాపడినట్లు కనిపిస్తోంది.
పటిష్టంగా టీమిండియా..
టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. ఓపెనర్లు శిఖర్ ధవన్, రోహిత్ శర్మల, మిడిలార్డర్స్ విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, కెఎల్ రాహుల్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యల బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. దీనికి తోడు ఎంఎస్ ధోనీ, కెఎల్ రాహుల్ భీకర ఫామ్‌లో ఉన్నారు. సన్నాహక మ్యాచ్‌లో తడబడి ఆడిన ఓపెనర్లు కూడా ఈ మ్యాచ్‌లో బ్యాట్‌కు పని చెబితే భారత విజయం అంత కష్టమేమి కాదు. అంతేకాదు విరాట్ కోహ్లీ, ధోనీ, రోహిత్‌శర్మలు దక్షిణాఫ్రికాపై రాణించిన రికార్డులున్నాయి. అయితే ఇంగ్లాండ్‌లోని బౌన్సీ పిచ్‌లపై ఎలా రాణిస్తారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బూమ్రా, భువనేశ్వర్, మహమ్మద్ షమీ, రవీంద్రజడేజా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహాల్, హర్ధిక్ పాండ్య వంటి మేటి బౌలర్లు ఉన్నారు. వీరంతా ఐపిఎల్‌లో రాణించారు.
కళతప్పిన బౌలింగ్.. బ్యాటింగ్..
ఈ మెగా టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌లలో సౌతాఫ్రికా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టే సఫారీ పేసర్ డెయిల్ స్టెయిన్ గాయం కారణంగా ఆడలేకపోయాడు. బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో లుంగీ ఎంగిడికి తొడ కండాలు పట్టివేయడంతో భారత్‌తో ఆడే మ్యాచ్‌కు అనుమానమే. కాగా, ప్రస్తుతం ఉన్న స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ కూడా ఫామ్‌లేమితో ఆడిన రెండు మ్యాచ్‌లలో 20 ఓవర్లు విసిరిన అతను కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. రువ్వున దూసుకొచ్చే బంతులతో స్వింగ్ చేసే కసిగో రబాడ సైతం రాణించలేక పోతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి ప్రపంచకప్ మ్యాచ్‌లో రబాడ 10 ఓవర్లు విసిరి 66 పరుగులిచ్చి కేవలం రెండో వికెట్లు పడగొట్టాడు. అనంతరం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో10 ఓవర్లకు 57 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ కూడాతీయలేకపోయాడు. డ్వైనే పెట్రూట్, ఫెలుక్వాయో, మోరిస్, మాక్రమ్, జెపి డుమినీలు సైతం బ్యాట్స్మెన్లను కట్టడి చేయలేక అష్టకష్టాలు పడుతున్నారు. కాగా, సీనియర్ బౌలర్ డెయిల్ స్టెయిన్ ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడని తెలుస్తోంది. ఇక సఫారీల బ్యాటింగ్ విషయానికి వస్తే ఈ జట్టులో ప్రపంచ మేటి బ్యాట్స్మెన్లు ఉన్నారు. హషీమ్ అమ్లా, క్వింటమ్ డికాక్, మాక్రామ్, డుప్లెసిస్, డెవిడ్ మిల్లర్, వాండర్ డుస్సెన్, డుమిని వంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నా పరుగుల రాబట్టలేక తంటాలు పడుతున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డికాక్ (68), వాన్‌డర్ డుస్సెన్(50)లు రాణించారు. మిగతా వారు బ్యాట్లెత్తేశారు. దీంతో దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకోవలసి వచ్చింది. అనంతరం బంగ్లాతో జరిగిన రెండో మ్యాచ్‌లో డికాక్(23), తక్కువ పరుగులకే ఔట్ అయినా డుప్లెసిస్(62), మాక్రామ్(41), జెపి డుమినీ(45) పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా దాదాపు గెలుపుటంచుల వరకు వచ్చిన 21 పరుగులతో ఓటమిని చవిచూసింది. అయితే భారత్‌తో మ్యాచ్‌లో మరోసారి వీరు చెలరేగితే సౌతాఫ్రికా గెలుపు సులువే..
నాలుగో స్థానంలో రాహుల్..
టీమిండియాలో నాలుగో నంబర్ ఆటగాడిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గతవారం బంగ్లాదేశ్‌తో సన్నాహక మ్యాచ్‌లో శతకంతో రాణించిన కెఎల్ రాహుల్ 108 (99) ప్రస్తుతం నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బిసిసిఐ ట్విటర్లో పోస్టు చేసింది. దీంతో దక్షిణాఫ్రికాతో పోరులో అతడు నాలుగో ఆటగాడిగా బరిలోకి దిగుతాడనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ వీడియోలో డిఫెన్స్ స్ట్రోక్స్ ఆడుతూ కనిపించాడు రాహుల్. ఇదిలా ఉండగా బంగ్లాతో సన్నాహక మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అతడిని కొనియాడాడు. “ప్రపంచకప్‌లో భారత్‌కు కలిసొచ్చే అతిపెద్ద విషయం ఏదైనా ఉందంటే నాలుగో నంబర్లో రాహుల్ చేసిన బ్యాటింగ్ విధానమే. అతడెంతో విలువైన ఆటగాడు’ అని కొనియాడాడు. దీంతో ఇప్పుడంతా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌పై చర్చ జరుగుతోంది. అందరు అనుకున్నట్లుగానే రాహుల్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్ పంపితే భారత్‌కు కలిసొచ్చే అవకాశాముందని క్రికెట్ విశ్లేషకులు అంచనా.
జట్ల వివరాలు( అంచనా)
భారత్: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ధవన్, కెఎల్ రాహుల్, విజయ్ శంకర్, ఎంఎస్ ధోనీ( వికెట్ కీపర్), హర్ధిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యాజువేంద్ర చహాల్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, జస్ప్రిత్ బూమ్రా.
దక్షిణాఫ్రికా: డుప్లేసిస్(కెప్టెన్), కింటాన్ డికాక్(వికెట్ కీపర్), హషీమ్ ఆమ్లా, జెపి డుమినీ, మాక్రామ్, వాండర్ డుస్సెన్, డెవిడ్ మిల్లర్, డ్వైనే పెట్రుట్, ఫెలుక్వాయో, క్రిస్ మోరిస్, కసిగో రబాడ, ఇమ్రాన్ తహీర్, లుంగీ ఎంగిడి, డెయిల్ స్టెయిన్.
గాడిలో పడతాం : డుమినీ
ప్రపంచకప్‌లో రెండు వరుస ఓటములు చవిచూసిన దక్షిణాఫ్రికాపై ఆ జట్టు ఆటగాడు ఆల్‌రౌండర్ జెపి డుమినీ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ‘తాము ఒక్క మంచి ప్రదర్శన చేస్తే తిరిగి గాడిలో పడతామని, టీమిండియాలో ఎంతో మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారని, అలాగే బౌలింగ్ విభాగంలో పటిష్టంగా కనిపిస్తున్నారని అన్నాడు. స్పిన్ త్రయంతో పాటు జస్ప్రిత్ బుమ్రా అద్భుత ఫామ్‌లో ఉన్నాడని గుర్తుచేశాడు. ముఖ్యంగా ఐపిఎల్‌లో మంచి ప్రదర్శన చేశాడని కొనియాడాడు. ఇక బ్యాటింగ్ విషయంలో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ లాంటి అనుభవజ్ఞులున్నారని, వాళ్లు కూడా చాలా ప్రమాదకరమని అన్నాడు. ఇక భారీ స్కోర్ ఛేదించేటప్పుడు మంచి భాగస్వామ్యాలు అవసరమని, అవి ఎంతో ముఖ్యమని తెలిపాడు. ఆటగాళ్లు బాగా ఆడి భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాలన్నాడు. దురదృష్టవశాత్తూ బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు అలా ఆడలేదని, అందరూ 30,-40 పరుగులకే పరిమితమయ్యారు’ అని వివరించాడు. కాగా, ‘భారత్‌తో జరిగే మ్యాచ్‌లో కుదురుగా ఆడి విజయం సాధిస్తామని’ అన్నాడు.
సఫారీలతో సమరానికి..
RELATED ARTICLES