అన్ని జిల్లాల జెడ్పి పీఠాలు పాలక పార్టీకే
గట్టి పోటీనిచ్చిన ప్రతిపక్షాలు
మంత్రుల గ్రామాల్లో కాంగ్రెస్ విజయఢంకా
ప్రజాపక్షం / హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ అన్ని జిల్లాల్లో ఆధిక్యత సాధించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంక్‌ను నిలబెట్టుకుంటూ దాదాపు మూడో వంతు స్థానాలను గెలుచుకున్నది. అయితే, ఎంపిటిసి, జెడ్పిటిసి ఫలితాలకు తేడా కనిపించింది. జెడ్పిటిసి ఎన్నికల్లో టి ఆర్ఎస్ ఏకపక్షంగా మొత్తం 32 జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకునేలా ఫలితాలు వచ్చాయి. మరోవైపు అనూహ్యంగా నాలుగు ఎంపి స్థానాలు గెలుచుకున్న బిజెపి.. లోక్‌సభ ఎన్నికల తరహాలో విజయాలు రాబట్టుకోలేకపోయింది. అయితే, పలు జిల్లాలో ఎంపిటిసి స్థానాలను గెలుచుకుంది. రాజధాని హైదరాబాద్ మినహాయించి మిగిలిన 32 జిల్లాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. మొత్తం 5,659 ఎంపిటిసి, 534 జడ్పిటిసి స్థానాలకు మూడు విడతలుగా ఎన్నికలను నిర్వహించారు. 158 ఎంపిటిసి, 4 జడ్పిటిసి స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైనాయి. ఎన్నికలు జరిగిన స్థానాలకు మంగళవారం ఉదయం నుండే కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు. దాదాపు అన్ని జిల్లాల్లో మెజారిటీ స్థానాలు అధికార పార్టీ టిఆర్ఎస్ గెలుపొందగా, రెండో స్థానాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నిలిచింది. మంత్రుల స్వగ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొండడం ప్రజల్లో అధికార పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేస్తోంది. ఉదాహరణకు సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్‌రెడ్డి స్వగ్రామం నాగారంలో జడ్పిటిసిగా 352 ఓట్ల మెజారీటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం ఇందిర గెలుపొందారు. దీనికి ప్రతీకారం అన్నట్లు .. అధికార టిఆర్ఎస్ అన్ని జిల్లాల్లో మెజారిటీ స్థానాలను గెలుపొంది కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టింది. ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ఈ నెల 7న మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు, అలాగే 8వ తేదీన జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు పూర్తి చేసేందుకు వీలుగా ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టా న్ని సవరించింది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగింది. కాగా, బ్యాలెట్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో జరిగిన ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 35, 529 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఒక్కో ఎంపిటిసి స్థానం ఓట్ల లెక్కింపు కోసం రెండేసి ఏర్పాటు చేశారు. పోటీ చేసిన అభ్యర్థులు చూసేలా జాలీ ఏర్పాటు చేసి కౌంటింగ్ కేంద్రాల్లో తొలుత పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కించారు. ఆ తర్వాత బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న ఓట్లను బయటకు తీసి ఒక్కోటి తిసి కట్టలుగా కట్టి లెక్కించారు.