ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై ప్రత్యేకం వ్యాసం
ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ ఏడాది ఇతివృత్తం ‘వాయుకాలుష్యం’. ఇది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో ఆందోళన కలిగించే అంశం. గత కొన్నేళ్ళుగా భారతదేశ నగరాల్లో వాయు నాణ్యత చాలా నాశిరకంగా ఉండడం వల్ల, అదొక జాతీయ సమస్యగా మారింది. అనేక స్థాయిల్లో జరుగుతున్న వాయుకాలుష్యం ఫలితం గా భారతదేశంలో లక్షల సంఖ్యలో అకాల మరణాలు సంభవిస్తున్నాయి. అయితే భారత అధికారులకు గుబులు పుట్టిస్తున్న అంశమేమిటంటే, దేశ రాజదాని ఢిల్లీ, దాని చుట్టపక్కలలో వాయు కాలుష్యం మరింత పెరిగిపోతోంది.
ప్రపంచ జనాభాలో 18 శాతం, భారత జనాభాగా ఉంటున్న పరిస్థితుల్లో, వాయుకాలుష్యం వల్ల ప్రపంచంలో చోటుచేసుకునే అకాల మరణాలు రోగాల భారంలో అసమతౌల్యంగా భారతదేశం 26 శాతం భరిస్తోంది. అంతేగాక, భారతదేశంలో సంభవించే మరణాలలో 8వ వంతు వాయు కాలుష్యం వల్లనేనని 2017 గణాంకాల ప్రకారం తెలుస్తోంది. మరణానికి అదే ప్రధానకారణంగా మారుతోంది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసేర్చ్(ఐసిఎంఆర్) ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్‌ఎంఇ)లు ఆరోగ్యం కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, దానితో పాటు మరో వందకుపైగా భారతసంస్థలతో సంబంధం ఉన్న నిపుణులు, ప్రయోజనాలిమిడివున్న వ్యక్తులు జరిపిన అధ్యయనంపై ఒక పుస్తకం ప్రచురించారు. ఆ విధంగా ప్రతీ రాష్ట్రంలో వాయుకాలుష్యం కారణంగా తగ్గిన ఆయుఃప్రమాణంపై మొదటిసారిగా సమగ్రమైన అంచనాలు వెల్లడయ్యాయి.
సమస్య తీవ్రత దృష్ట్యా, పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఈ జనవరిలో జాతీయ స్వచ్ఛమైన వాయు కార్యక్రమం (ఎన్‌సిఎపి) విడుదల చేసింది. దీని లక్ష్యం 2024 నాటికి వాయుకాలుష్యానికి దారుణంగా గురైన 102 నగరాలలో 20 శాతం కాలుష్యం తగ్గించాలని దిశానిర్దేశం చేసింది. కేంద్ర, రాష్ట్ర స్థానిక సంస్థలు తీసుకోవలసిన చర్యల గురించి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించింది. 2-017 స్థాయి నుండి 2024 నాటికి మనం పీల్చేవాయువులో ప్రతిపాదిత కాలుష్యం తగ్గింపు నిజంగా సవాలుతో కూడిన లక్ష్యమే.
ముందుగా ఈ కార్యక్రమంతో అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, కాన్పూర్, లక్నో, ముంబయి తదితర నగరాల్లో కేంద్రీకరిస్తారు. అక్కడ ఎల్లప్పుడూ వాయు నాణ్యత అనుమతించదగ్గ స్థాయికి దిగువనే వుంటోంది. ఈ ప్రణాళికలో అనేక చర్యలు, అలాగే అధికారులకు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. అలాగే వాహనాల, పారిశ్రామిక, థర్మల్ విద్యుత్ ఉద్గారాలు తగ్గించేందుకు, పంటల కోతలైపోయిన తరువాత మిగిలిన చెత్తను, వంట చెరకు, తగులబెట్టడం వల్ల ఇటుకల బట్టీలు, నిర్మాణం తదితర కార్యకలాపాల వల్ల వాయు కాలుష్యం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ, రాకపోకల రద్దీ ఏర్పడే ప్రాంతాలను గుర్తిస్తూ వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాలలో పంపించడం, బహిరంగ ప్రదేశాల్లో జీవరాశి, టైర్లు వంటి వాటిని తగులబెట్టడంపై నిషేధాలు విధించాలి.
దీనితో పాటు 2020 ఏప్రిల్ నుండి అమలులోకి వచ్చే వాహనాల భారత్ 6 ఉద్గార ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని రవాణా అధికారులకు సూచించారు. అయితే తీసుకోవాల్సిన చర్యలపై అలాగే జరిమానా విధింపు నిబంధనలను అంతకు మునుపే సూచించాల్సి ఉంటుంది.
ఈ ఎన్‌సిఎపి ఒక శుభప్రారంభం అన్న దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. వాయు కాలుష్యం నియంత్రించడం ద్వారా హృద్రోగాలను, ఊపిరితిత్తులు తత్సంబంధవ్యాధులను అరికట్టవచ్చు. డిసెంబర్‌లో విడుదల చేసిన ఒక అధ్యయనం ద్వారా, వాయుకాలుష్యం వల్ల 12 లక్షల 40 వేల అకాల మరణాలు కేవలం 2017లోనే సంభవించాయని తెలుస్తున్నది.
ఇదిలా ఉంటే, శాస్త్ర విజ్ఞానం పర్యావరణ కేంద్రం( సిఎస్‌ఇ) ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదికలో దేశంలోని 29 రాష్ట్రాలను వాటి సామాజిక ఆర్థిక సూచీ(ఎస్‌డిఐ) ప్రాతిపదికన వర్గీకరించింది. 2017లో వాయుకాలుష్యం వల్ల సంభవించిన మరణాలలో దాదాపు 40 శాతం ఉత్తరప్రదేశ్, బెంగాల్, మహారాష్ట్రలలోనే జరిగినట్లు తెలుస్తున్నది. అన్ని రాష్ట్రాలలో బెంగాల్ నాల్గవ స్థానంలో ఉంది. తక్కువ కేటగిరీలో ఉత్తర ప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటే, ఎక్కువ స్థాయిలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. అందువల్ల ఐదేళ్ళలో ప్రతిపాదించిన తగ్గింపు అసహేతుకంగా ఉంది. అంతేగాక పర్యావరణ శాస్త్రవేత్తలు, కార్యకర్తలు ఎన్‌సిఎపి లక్ష్యాలను వివేకవంతంగా రూపొందించలేదని, వాయు నాణ్యతను మెరుగుపరచేందుకు ఇంకా ఎక్కువ ఏళ్ళు పడుతుందని చెబుతున్నారు. క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మొనరీ డిజార్డర్, ఆస్తా, బ్రోంకైటిస్, ఊపిరి తీసుకోవడంలో ఎలర్జీలు, వంటివి హెచ్చుగా వాయుకాలుష్యం వల్ల ఏర్పడుతున్నాయి. ఈ ఉద్గారాలలో ఉండే అణువులు చాలా చిన్నవిగా ఉన్న కారణంగా అవి ఊపిరితిత్తుల్లోకి, రక్త ప్రవాహంలోకి తేలికగా చేరి వ్యాధులకు కారణమౌతున్నాయి. ఈ వ్యాధులు ఢిల్లీ, కోల్‌కతాలలో సర్వసాధారణం. ఇక్కడ ఈ వ్యాధి గ్రస్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.
అన్నిటికంటే ముఖ్యమైనది, కాలు ష్యం వల్ల రుతుపవనాలు సహా వాతావరణక్రమంపై ప్రభావం చూపిస్తున్నాయని ఆరోగ్య శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
భారతదేశం నుండి కాలుష్యం హిందూకుష్, హిమాలయాలకు కూడా చేరుకుంటూ ఈ సున్నితవైన ప్రాంతంలో నష్టం కలుగజేస్తోంది. అయితే ఈ సమస్య కేవలం భారత్ మాత్రమేగాక బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కూడా ఈ జాడ్యాన్ని ఎదుర్కొనేందుకు సతమతమౌతోంది.
భారతదేశ ప్రమాదకర విషవాయువు 20లక్షల అకాల మరణాలకు హేతువవుతోంది. అంటే వాయుకాలుష్యం వల్ల ప్రపంచంలో సంభవించే మరణాలలో 25 శాతం మన దేశంలోనే జరుగుతున్నాయి. వీటిలో 1,10,000 మంది బాలలు. నాసిరకం వాయువు కేవలం పట్టణ సమస్యేనని దానిని ఎదుర్కొవలసింది పట్టణ అధికారులేనని చాలా మంది భావిస్తారు. ఓజోన్ పొరలో ఈ కాలుష్యం వారాల తరబడి అంటిపెట్టుకొని వందల కిలోమీటర్ల దూరాన్ని వ్యాప్తి చేయగలదు.
ఈ సమస్య చాలా తీవ్రమైనది. తక్షణ, కఠిన చర్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సి వుంది. ఇది కేవలం విధానాన్ని రూపొందించినంత మాత్రాన సరిపోదు. బలమైన అమలు జరిపే క్రమం అంతే ముఖ్యం. మన నగరాలను జనాభా ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు అత్యంతావశ్యకం. సమస్యకు తక్షణమే పరిష్కారం కనుగొంటే మరిన్ని సమస్యలను నివారించవచ్చు.
ఓయిషీ ముఖర్జీ