టిడిపికి తీవ్రమైన ఎదురుదెబ్బ
జనసేనకు ఒకే ఒక్కటి
రెండు స్థానాల్లోనూ పవన్ కల్యాణ్ ఓటమి
150 స్థానాలతో వైఎస్ఆర్సిపి జయభేరి
30న సిఎంగా ప్రమాణం చేయనున్న వైఎస్ జగన్
ప్రజాపక్షం/అమరావతి: యావత్ దేశాన్ని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైసిపి ప్రభంజనం సృష్టించింది. ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డికి పట్టం కట్టారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభతో పాటు లోక్సభ ఎన్నికల్లోనూ వైసిపి అనూహ్య విజయం సాధించింది. ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్ అనంతరం దాదాపు 42 రోజుల తీవ్ర ఉత్కంఠ నడుమ గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో తొలిరౌండ్ నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ ముం దంజలో నిలిచింది. ఈ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ నిరాశపరిచింది. ఇటు శాసనసభ అటు లోక్ సభ ఎన్నికలు రెండింటిలోనూ ఘోర పరాజయం మూటకట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు తనయుడు లోకేష్ తోపాటు కీలకమైన నేతలు,మంత్రులు ఓటమిపాలయ్యారు. మరోవైపు తొలినుంచి దూకుడు ప్రదర్శించిన జనసేన అధినేతకు ఈ ఎన్నికలు తీవ్ర నిరాశ కల్గించాయి. ఆ పార్టీ కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదు. రాష్ట్ర శాసనసభలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 150 స్థానాలను కైవసం చేసుకుంది. టిడిపికి కేవలం 24 స్థానాలకు పరిమితం కా వలసి వచ్చింది. జనసేన ఒక నియోజకవర్గానికి పరిమితమైంది. జిల్లాల వారిగా ఫలితాలను గమనిస్తే గతంలో ఎంతో అండగా నిలిచిన తూర్పు, పశ్చి మ గోదావరి జిల్లాల్లో కూడా టిడిపికి ఈసారి ఎదురుదెబ్బ తగిలింది. కడ ప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసిపి స్వీప్ చేసింది. ఫలితాల్లో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదిపత్యం ప్రదర్శించింది. జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై గడిచిన ఐదేళ్లుగా సాగించిన అనేక ఆందోళనలు, ప్రతి నిత్యం ప్రజ ల్లో ఉండటం, గడిచిన ఏడాది కాలం పాటు ప్రజల మధ్యన సాగించిన పాదయాత్ర ఈ ఫలితాలకు కారణమైనట్టు ఆపార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు కార్యక్రమం రాత్రి 10 గంటల తర్వాత కూడా కొనసాగింది. అన్ని నియోజకవర్గాల్లో ఇవిఎంల ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ వివిప్యాట్ ల లెక్కింపు కారణంగా ఫలితాలను అధికారికంగా ప్రకటించడంలో జాప్యం జరిగింది. గురువారం రాత్రి పది గం టల వరకు అందిన సమాచారం మేర కు శ్రీకాకుళం (10) 8, విజయనగ రం (9) 9, విశాఖ (15) 11, తూర్పు గోదావరి (19) 14, పశ్చిమ గోదావరి (15) 12, కృష్ణా (16) 13, గుంటూరు (17) 14, నెల్లూరు (10) 10, ప్రకాశం (12) 8, అనంతపురం (14) 12, కడప (10) 10, కర్నూలు (14) 14, చిత్తూరు (14) 13 స్థా నాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయనున్నట్టు తెలుస్తోంది.
25న శాసనసభా పక్ష సమావేశం: ఎన్నికల్లో ఘనవిజయంతో ఉండవల్లిలోని వైసిపి పార్టీ కార్యాలయం వద్ద, జగన్ నివాసం వద్ద పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఫలితాల చివరి దశలో ఉన్న సమయంలో పార్టీ అధ్యక్షుడు జగన్ మీడియా తో మాట్లాడుతూ, ప్రజలు విశ్వసనీయతకు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. ప్రజలిచ్చిన తీర్పుతో తన విశ్వాసాన్ని బాధ్యతను పెంచుతుందని పేర్కొంటూ ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పార్టీ ముఖ్యులతో సమావేశమైన అనంతరం ఈనెల 25 వ తేదీన పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మేరకు పార్టీ ప్రకటనతో తెలియజేసింది. ఆ సమావేశంలో పార్టీ శాసనసభా పక్షం నాయకుడి ఎన్నుకుంటారు. జగన్ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్ ను కలిసి ఆ మేరకు సమాచారం ఇవ్వనున్నారు. గవర్నర్ ఆహ్వానం మేరకు ఈనెల 30న మంత్రివర్గం పదవీ స్వీకార ప్రమాణం చేస్తుంది.